Sony Liv Freedom At Midnight Web Series Review and Rating
Freedom At Midnight Series Review : ఇటీవల చరిత్రపై పలు వెబ్ సిరిస్ లు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అసలు దేశ విభజన జరగడానికి ఏర్పడిన పరిస్థితులు ఏంటి? అప్పుడు ఉన్న నాయకులు ఏం చేసారు? అప్పటి పరిస్థితులు ఏంటి? దేశ విభజన ఎలా జరిగింది? అనే కథాంశంతో ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్’ వెబ్ సిరీస్ ని తెరకెక్కించారు. సోని లివ్ ఓటీటీ సమర్పణలో ఎమ్మాయ్ ఎంటర్టైన్మెంట్స్, స్టూడియో నెక్స్ట్ నిర్మాణంలో ధనిష్ ఖాన్, మోనిష అద్వానీ , మధు బోజ్వని నిర్మాతలుగా నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో ఈ సిరీస్ తెరకెక్కింది. ఈ సిరీస్ లో సిద్దాంత్ గుప్తా, చిరాగ్ వోహ్రా, రాజేంద్ర చావ్లా, ఆరిఫ్ జకారియా.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.
కథ విషయానికొస్తే.. 1946 మే నుంచి ఈ కథ మొదలవుతుంది. అప్పటికే బ్రిటిష్ వాళ్ళు ఇండియా వదిలి వెళ్ళడానికి సిద్దపడుతూ ఉంటారు. అయితే దేశంలో ప్రభుత్వం ఏర్పాటు, విధి విధానాల గురించి మాట్లాడటానికి అప్పటి కాంగ్రెస్ నాయకులు నెహ్రు, వల్లభాయ్ పటేల్.. పలువురిని పిలుస్తారు. ఆ మీటింగ్ కి ముస్లిం లీగ్ పార్టీ లీడర్ జిన్నాని కూడా పిలుస్తారు. జిన్నా స్వతంత్రం ఇస్తే ముస్లిమ్స్ ఉండే ప్రాంతాలన్నీ కలిపి పాకిస్థాన్ సపరేట్ దేశం కావాలని డిమాండ్ చేస్తాడు. కాంగ్రెస్ వాళ్ళు అందుకు ఒప్పుకోరు. అప్పట్నుంచి ఈ కథ సాగుతుంది. జిన్నా పాకిస్థాన్ దేశం కావాలని, ఒక వర్గానికి ప్రతినిధిగా ఉండాలని, అధికారం తనకు కావాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో కలకత్తా, ముంబై, బీహార్, పంజాబ్ లో జరిగే మతకలహాలు కారణం అవుతాడు. మరో పక్క కాంగ్రెస్ నాయకులు, గాంధీ దేశ విభజన జరగకుండా ఉండటానికి ప్రయత్నాలు చేస్తారు. ఇదే సమయంలో ఇండియాలో పరిస్థితులు చక్కదిద్ది స్వతంత్రం ఇచ్చి రమ్మని లండన్ పెద్దలు మౌంట్ బాటెన్ ని ఇండియా కొత్త వైస్రాయ్ గా నియమిస్తారు.
మరి మౌంట్ బాటెన్ ఇండియా వచ్చి ఏం చేసాడు? జిన్నాతో, కాంగ్రెస్ నాయకులతో, గాంధీతో ఏం మాట్లాడారు? జిన్నా ఎందుకని ప్రత్యేక దేశం కావాలని పట్టుబట్టాడు? దేశ విభజన ఆపడానికి గాంధీజీ ఏం చేసాడు? దేశ విభజన ఎలా జరిగింది.. ఇవన్నీ తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.
Also Read : Lucky Baskhar : లక్కీ భాస్కర్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడు? ఎక్కడ?
సిరీస్ విశ్లేషణ.. చరిత్ర గురించి చెప్పే కథలు ఆసక్తికరంగా ఉంటాయి. స్వాతంత్రోద్యమాల గురించి అనేక సినిమాలు వచ్చాయి కానీ దేశవిభజన మీద చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. ఇది స్వతంత్రం ముందు జరిగిన దేశ విభజన పరిస్థితుల గురించి కావడంతో మరింత ఆసక్తికరంగా ఉంటుంది. అక్కడక్కడా డాక్యుమెంటరీలా అనిపించినా ఎక్కడా బోర్ కొట్టకుండా కథని నడిపించారు. అప్పటి రియల్ విజువల్స్ కూడా కొన్ని ఈ సిరీస్ లో వాడటం గమనార్హం. అయితే ఇది సీజన్ 1 లో ఏడు ఎపిసోడ్స్ గా రిలీజ్ చేసారు. నెక్స్ట్ సీజన్ ఉండే అవకాశం ఉందేమో.
స్వతంత్రం ముందు కాంగ్రెస్ పార్టీలో ఎవరెవరు ఉన్నారు, అప్పటి పరిస్థితులు ఏంటి, జిన్నా సపరేట్ పార్టీ పెట్టడం, పాకిస్థాన్ కావాలని అనడం, అప్పుడు జరిగిన మతకలహాలు.. ఇలా అన్ని చక్కగా కళ్ళకు కట్టినట్టు చూపించారు. దేశ విభజనపై నాయకులు – గాంధీ మధ్య విబేధాలు రావడం, బ్రిటిష్ వాళ్ళ గురించి, మౌంట్ బటన్ గురించి, లండన్ లో ఇండియా గురించి ఏమనుకుంటున్నారు.. ఇలా అప్పటి సంగతులు అన్ని చక్కగా చూపించే ప్రయత్నంకు చేసారు. సిరీస్ చూస్తుంటే అప్పట్లో ఇంత జరిగిందా అని ఆశ్చర్యపోక తప్పదు.
నటీనటుల పర్ఫార్మెన్స్.. నెహ్రు పాత్రలో సిద్దాంత్ గుప్తా, గాంధీ పాత్రలో చిరాగ్ వోహ్రా, వల్లభాయ్ పటేల్ పాత్రలో రాజేంద్ర చావ్లా, జిన్నా పాత్రలో ఆరిఫ్ జకారియా అదరగొట్టేసారు అని చెప్పొచ్చు. అప్పట్లో ఈ లీడర్లు అలాగే ఉన్నారేమో అనిపిస్తుంది. అంత బాగా నటించారు. మౌలానా ఆజాద్ పాత్రలో పవన్ చోప్రా, రాజగోపాలాచారి పాత్రలో సచిన్ నవారే, సరోజినీ నాయుడు పాత్రలో మలిష్క, మౌంట్ బటన్ పాత్రలో ల్యూక్ మగబిని మెప్పించారు. అప్పటి నాయకులు, బ్రిటిష్ వారి పాత్రల్లో నటించిన మిగిలిన నటీనటులు కూడా వారి వారి పాత్రల్లో మెప్పించారు.
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ అప్పటి కాలానికి తగ్గట్టు పర్ఫెక్ట్ గా చూపించారు. లొకేషన్స్ బాగా వెతికి అప్పటి సన్నివేశాలకు సరిపోయేలా పట్టుకున్నారు. ఇక ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా అప్పుడు ఉన్న పరికరాలు, సెట్స్ అన్ని పర్ఫెక్ట్ గా సెట్ చేసింది. కాస్ట్యూమ్స్ కూడా లీడర్స్ నుంచి జనాల వరకు అప్పట్లో ఇలాగే వేసేవారు అనేట్టు సరిగ్గా డిజైన్ చేసారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. అసలు దేశ విభజన జరిగినప్పుడు పరిస్థితులు ఏంటి అని బాగా రీసెర్చ్ చేసి కథ, కథనం రాసుకున్నట్టు తెలుస్తుంది. డైలాగ్స్ కూడా సింపుల్ గా బాగున్నాయి. దర్శకుడు నిఖిల్ అద్వానీ కథని అర్ధమయ్యే రీతిలో చూపించడంలో సఫలమయ్యారు. నిర్మాణ పరంగా కుడా ఈ సిరీస్ కు బాగానే ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది.
మొత్తానికి ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్’ సిరీస్ స్వతంత్రం ముందు దేశ విభజన ఎలా జరిగింది, అప్పటి పరిస్థితులు ఏంటి అని కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఈ సిరీస్ కు 3.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సిరీస్ రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.