SPB Funeral : గాన గంధర్వుడు బాల సుబ్రమణ్యంకు కన్నీటి వీడ్కోలు పలికారు. అత్యంత సన్నిహిత కుటుంబసభ్యుల మధ్య బాలు అంత్యక్రియలు జరిగాయి. చెన్నై సమీపంలోని తామరైపాకం ఫాం హౌజ్ లో తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో ఈ కార్యక్రమాలు జరిగాయి.
కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. బాలు కొడుకు చరణ్ వైదిక కార్యక్రమాలు చేశారు. బాలుకు చివరిసారి చూసేందుకు చిత్రరంగానికి చెందిన ప్రముఖులు నివాళులర్పించారు. బాలుకు అత్యంత ఆప్తుడిగా ఉన్న డైరెక్టర్ భారతీరాజా నివాళి అర్పించారు.
ఉదయం 10.30గంటలకు అంత్యక్రియల ప్రక్రియ ప్రారంభించారు. బాలుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటితో వెల్లడించారు. కరోనా వైరస్ నేపథ్యంలో అభిమానులు ఎవరూ రావద్దని చెప్పినా..తండోపతండాలుగా వచ్చారు. అభిమానులు పోటెత్తే సరికి..కొద్ది మందికి మాత్రమే అవకాశం ఇచ్చారు.
ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (74) కు ఆరోగ్యం బాగోలేదని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటి నుంచి ప్రతి ఒక్కరూ ఆందోళనకు గురయ్యారు. క్షేమంగా హాస్పిటల్ నుంచి వచ్చి.. ఎప్పటిలానే తన గాత్రంతో అలరించాలని ప్రార్థనలు చేశారు. కానీ… చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం మధ్యా హ్నం 1:04 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు.
ఆయన ఇక లేరని తెలుసుకున్న అభిమానులు, పలువురు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సంగీత ప్రపంచం మూగబోయింది. తమిళనాడు సీఎం పళని స్వామి ఏపీ తరపున బాలు సొంత జిల్లాకి చెందిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లు హాజరయ్యారు.
ఎస్పీ బాలు మరణం పట్ల రాష్ట్రపతి కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోదీ, తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
కరోనా వైరస్ సోకినట్లు తేలడంతో బాలు ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్ ఆస్పత్రిలో బాలు చేరారు.
ఈ విషయాన్ని బాలు స్వయంగా వెల్లడించారు. కరోనా సోకింది, ఎవ్వరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ ఆందోళన, అభిమానాన్ని అర్థం చేసుకోగలను. పరామర్శించేందుకు దయచేసి ఫోన్ చేయకండి’ అని ఆస్పత్రి నుంచి వాట్సాప్ వీడియో విడుదల చేశారు.
ఆగస్టు 13న బాలు ఆరోగ్యం విషమించింది. దీంతో ఐసీయూకు తరలించి వెంటిలేటర్ అమర్చారు.
అయితే..ఊపిరితిత్తుల సమస్య తలెత్తడంతో ఎక్మో సహాయంతో చికిత్స అందించారు.
డాక్టర్లు ఫిజియోథెరపీ చేశారు.
క్రమేపీ కోలుకున్నారు.
కరోనా పరీక్షలు నిర్వహంచారు. నెగెటివ్ రావడంతో అందరూ సంతోషం వ్యక్తం చేశారు.
5వ తేదీన 51వ వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు.
ఆస్పత్రిలో సతీమణి సావిత్రితో కేక్ కట్ చేసి సంతోషంగా గడిపారు.
ఈ నెల 23న రాత్రి బాలు ఆరోగ్యం విషమించినట్లు వైద్యులు బులెటిన్ విడుదల చేశారు.
ఆయన కుటుంబీకులను వైద్యులు హడావిడిగా ఆస్పత్రికి పిలిపించారు.
సతీమణి సావిత్రి, కుమారుడు చరణ్, కుమార్తె పల్లవి, సోదరీమణులు ఆస్పత్రికి చేరుకున్నారు.
తన తండ్రి శుక్రవారం మధ్యాహ్నం 1:04 గంటలకు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారని ఎస్పీ చరణ్ ప్రకటించారు.