SPB : బాలన్నా పాట పాడవా : అంత్యక్రియల్లో ప్రముఖుల కంటతడి

  • Publish Date - September 27, 2020 / 11:38 AM IST

SP Balasubrahmanyam’s funeral : గాన గంధర్వుడు బాల సుబ్రమణ్యం అంత్యక్రియలు ముగిశాయి. తిరువళ్లూరు సమీపంలోని తామరపాక్కంలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో SPB ఖననం చేశారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అధికారలాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి.



గాయకుడి కడచూపు కోసం అభిమానలోకం, ప్రముఖులు తరలిరావడంతో ఉద్వేగ భరిత వాతావరణం నెలకొంది. బాలు పాడిన పాటలు పాడుతూ..అంత్యక్రియల ఊరేగింపు జరిగింది. ప్రముఖ నటుడు విజయ్, అర్జున్, దర్శకుడు భారతీరాజా, అమీర్, రహ్మాన్, సింగర్‌ మనో, మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవిశ్రీప్రసాద్, హాస్యనటుడు మైల్‌స్వామి బుల్లితెర నటుడు కృష్ణన్, బోండామురుగన్, భారతీ, శ్రీరెడ్డితో పాటు పలువురు ప్రముఖులు తరలివచ్చారు.



బాలు పార్థివ దేహాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు. బాలుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ..తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. పోలీసులు మూడు రౌండ్‌లతో 72 తూటాలను గాల్లో పేల్చి అంత్యక్రియల ప్రక్రియను ముగించారు. ఆయన పార్థీవదేహాన్ని అశ్రునయనాల నడుమ ఖననం చేశారు. ఎస్పీబీకి నివాళులర్పించే క్రమంలో భారతీ రాజా, గాయకుడు మనో తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు.



సినీ నటుడు అర్జున్‌ బాలు పార్థివదేహాన్ని చూసి బోరున విలపించారు. బాలన్న.. తన చిత్రాల్లో ఎన్నో దేశభక్తి పాటలను పాడి విజయాన్ని అందించావని, ఇప్పుడు లేచి ఓ పాట పాడవా అంటూ అర్జున్‌ ఉద్వేగానికి లోనయ్యారు.



ఆయన చేసిన సేవలను గుర్తు చేస్తూ, చరిత్రను చాటే రీతిలో కేంద్రం భారతరత్నతో గౌరవించాలని దర్శకుడు భారతీ రాజా కోరారు.



ఆడుకుందాం…లేచి రండి సార్‌: మిమ్మల్ని కలిసినప్పుడల్లా కాసేపు సరదాగా ఆడుకుందామా అని అడిగే తమరు దేవుడు ఆడిన ఆటలో అలసి శాశ్వత విశ్రాంతిలో ఉన్నారని, ఇప్పుడు లేచి రండి సార్‌..కాసేపు ఆడుకుందాం అని హాస్య నటుడు మైల్‌స్వామి విలపించారు.