అంతర్ముఖంగా ఉంటాడు. ఆలోచించే గుణంలో కొద్ది మందికే చేరువగా ఉంటాడు. బహిరంగ సభల్లో పెద్ద గొంతుకలో బిగ్గరగా మాట్లాడతాడు. రెండు పడవల ప్రయాణం వద్దే వద్దని అంటాడు. రాజకీయంగా కాదు సామాజికంగా ఓ వ్యక్తి ఎదిగితేనే సంతోషిస్తానని చెబుతాడు. దటీజ్ పవన్ కళ్యాణ్. నమ్మితే నేనున్నానని అంటాడు. మనిషిగా స్పందిస్తాడు. బాధార్తులకు సాయం చేస్తూ అండగా నిలుస్తాడు. ఇవే ఇవాళ పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగా చేరువ చేస్తున్న అంశాలు. పవన్ కళ్యాణ్ అందరికీ కాస్త నచ్చుతాడు. అభిమానులకు ఇంకాస్త ఎక్కువ నచ్చుతాడు. అభిమానులూ! నన్ను ఇంకాస్త ప్రేమించండి. వ్యక్తిగానే తారగా కాదు.. అన్నది ఆయన వేడుకోలు.
ఓ సందర్భంలో భీమవరం అట్టుడికి పోతోంది. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కొందరి కోపోద్రేకాల కారణంగా యథాలాపంగా జరిగిపోయింది. పవన్ స్పందించాడు. తన వంతుగా పరిహారం ఆ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ కు పంపాడు. దయచేసి వివాదాల్లోకి నన్ను లాగొద్దు. మీరూ మీ భవిష్యత్ ను పాడుచేసుకోవద్దు అని విన్నవించాడు. తోటి హీరోలంతా నా వారే నా స్నేహితులే మీరెందుకు ఇలా గొడవ పడుతున్నారని ఆవేదన చెందుతూ, నాటి గొడవలు సద్దుమణిగేలా చొరవ తీసుకున్నాడు. ఓ సినిమా హిట్ అయినా, ఓ సాహిత్య పుస్తకం నచ్చినా ఇతరుల విషయంలో తను గుర్తించిన మంచిని తప్పక చెబుతాడు. ఏ చిన్న ప్రయత్నం విజయం సాధించినా ఉప్పొంగిపోతాడు. కష్టం అని వస్తే అనేకానేక సందర్భాల్లో అండగా నిలిచి, గొప్ప వ్యక్తిత్వానికి తార్కాణంగా నిలిచాడు.
నటనలు తెలియని నైజం:
నిజంగానే నాకు నటన తెలియదు అందులో ఓనమాలు కూడా రావు. మీరంతా ఎందుకింత ఆరాధిస్తున్నారో నాకే అర్థం కాదు. ఇంకా నేర్చుకోవాలి. అసలు చాలీ చాలని నృత్యాలతో నేనింతవరకూ నెట్టుకువచ్చాను. అనేకానేక అపజయాల నీడల్లో బతుకుతూ వచ్చాను. అయినా మీరంతా ఆదరించారు. ఏమీ లేకపోయినా ఏదో ఎక్కడో ఓ ఆశ మనిషిని నడిపిస్తుందన్న తీరున అన్నయ్య అభిమానులు కొండంత అండగా నిలిచారు. ఆ అభిమాన శిఖరం దగ్గర నేను చిన్నవాణ్ని. ఈ జీవితం ఆయన భిక్ష.. ఈ క్రేజ్ ఆయన భిక్ష.. ఈ పేరు ఈ కీర్తి ఆయన భిక్ష అని తరుచూ చెబుతూనే ఉంటాడు తన వారితో తన సన్నిహితులతో..
అసలీ స్టార్ డమ్ అంటేనే ఓ భయం. ఉన్న చోట ఉండనీయని భయం.ఎక్కడా మనశ్శాంతినివ్వని భయం.ఈ భయంలో ఈ భయంతో చాలా కాలం బతికాడు పవన్.వీటి వల్ల అంచనాలు పెరగడం తప్ప ఒనగూరేదేమీ ఉండదు..అన్నది ఆయన భావన.నటుడిగా తనపై పెరిగిపోతున్న అంచనాల ఫలితం రేపటి వేళ ఎలా ఉంటుందో ఎన్నో సందర్భాల్లో చెప్పాడు. దయచేసి ఇంతటి అంచనాలు నాపై రుద్ద వద్దనీ చెప్పాడు.బాక్సాఫీసుకు కొన్ని కమర్షియల్ పాఠాలు కామర్స్ సూత్రాలు నేర్పిన ఆయనే ఓ సందర్భంలో భయపడిపోయాడు.కొన్ని అపజయాల వేళ నిర్మాతలకు అండగా నిలిచాడు. ఎన్ని కోట్లు ఇస్తామన్నా వాణిజ్య ప్రకటనలు చేయననే చెప్పాడు.
నటుడిగా పవన్ డౌన్ టు ఎర్త్. నాయకుడిగా పవన్ తూరుపు సూరీడు. ఇంకా ఇంకా వెలుగులు పంచాల్సిన సూరీడు. అయినా ఓటమిని అయినా గెలుపునీ దేన్నయినా పట్టించుకునే దాఖలా లేని మనిషి.ఉద్దానం విషయంలో స్పందించాడు. బాధితుల ఘోష విని చలించిపోయాడు.ఇది బాధితుల సమావేశం దయచేసి మీరేమీ నాకు జేజేలు పలకాల్సిన పని లేదని అభిమానులను సున్నితంగానే వారించాడు.హెచ్చరించాడు. తనని ఇంకా సినిమా వరకూ పరిమితం చేసి పవర్ స్టార్ అనే పిలుపుతో ఇబ్బంది పెట్టవద్దన్నది ఆయన విన్నపం. అభిమానులకు ఎప్పుడూ ఎప్పుడూ మీరు ఈ తగాదాలు గొడవలు కొట్లాటలూ కాదు ప్రభుత్వం పనితీరు సరిగా లేకుంటే స్పందించండి. నిలదీయండి. దీని వల్ల రాజకీయంగా ఏం ప్రయోజనం అన్నది కాదు బాధితులకు మన చర్యలు ఓ ఉపశమనం.. అని అంతర్గత సమావేశాల్లో చెబుతూనే ఉంటాడు. హితవుగా తోచిన మాటలను ఎన్నో ఎన్నో వినిపిస్తాడు. ఆచరించాల్సిన సందర్భాలను సైతం సూచిస్తాడు. అవి పాటించేలా చేస్తాడు.
కష్టం చూసి చలించేవాడంటే కొందరికి అయిష్టం. నిజం మాట్లాడేవాడంటే అసహనం. రోజూ పేపర్లో ముఖం చూసుకోవడం ముఖ్యం కాదనుకునేవాడంటే కొందరికి అదో రకం కోపం. అయితే వినిపించుకుంటాడా? వినిపించుకోడు గాక వినిపించుకోడు. దటీజ్ పవన్ కళ్యాణ్..
నీ కోసం ఓ గగన వీధి ఇక్కడ సిద్ధం
నీ కోసం ఓ ఉద్యమం సిద్ధం
రా.. రా.. బంగారు.. రా..
అన్నది సగటు అభిమాని అభిమతం భావోద్వేగ భరిత సందేశం
ఒకప్పుడు సినిమా రాయక తప్పని పరీక్ష.. అతనికి.. ఇప్పుడు రాజకీయం ఎన్ని తీవ్రతలు ఎదురయినా నిలిచి ఎదురెళ్లి నిరంతరం తనలో తాను పడే సంఘర్షణ. ఈ అంతర్మథనం ఉన్నన్నాళ్లూ పవన్ ఇంకొంత కాలం ప్రజా వేదికలపై గళం వినిపిస్తూనే ఉంటాడు. సత్యాగ్రహిగా నిలుస్తాడు. హ్యాపీ బర్త్ డే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
– రత్నకిశోర్ శంభుమహంతి