Stuntman Dies: సినిమా షూటింగ్ లో ప్రమాదం.. ప్రముఖ స్టంట్ మ్యాన్ దుర్మరణం.. కారు స్టంట్ చేస్తుండగా..

రాజు కుటుంబానికి తాను అండగా ఉంటానని విశాల్ చెప్పారు.

Stuntman Dies: కోలీవుడ్ లో పెను విషాదం చోటు చేసుకుంది. సినిమా షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో ప్రముఖ స్టంట్ మ్యాన్ రాజు చనిపోయారు. పా రంజిత్ డైరెక్షన్ లో ఆర్య నటిస్తున్న మూవీలో ఈ దుర్ఘటన జరిగింది. సెట్‌లో హై రిస్క్ కారు బోల్తా స్టంట్ చేస్తూ రాజు ప్రాణాలు కోల్పోయారు. తమిళ నటుడు విశాల్ స్టంట్ మ్యాన్ రాజు మృతిని ధృవీకరించారు. ఈ వార్త తమిళ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది.

రాజు మృతి వార్త తెలిసి నటుడు విశాల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు. “ఆర్య, రంజిత్ సినిమా కోసం ఈ ఉదయం కారు బోల్తా పడే సన్నివేశం చేస్తూ స్టంట్ ఆర్టిస్ట్ రాజు మరణించాడనే వాస్తవాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టం. నాకు రాజు చాలా సంవత్సరాలుగా తెలుసు. అతను చాలా ధైర్యవంతుడు. నా సినిమాల్లో చాలా రిస్కీ స్టంట్స్ చేశాడు” అని నటుడు విశాల్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.

రాజు కుటుంబానికి తాను అండగా ఉంటానని విశాల్ చెప్పారు. ” రాజు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబానికి దేవుడు మరింత బలాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా. అనేక చిత్రాలకు ఆయన చేసిన కృషి ఎనలేనిది. రాజు కుటుంబానికి అండగా ఉంటాను” అని విశాల్ తెలిపారు.

ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ సిల్వా కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో రాజు మృతి పట్ల సంతాపం తెలిపారు. “గొప్ప కార్ జంపింగ్ స్టంట్ ఆర్టిస్టుల్లో ఒకరైన ఎస్ ఎం రాజు ఈరోజు కార్ స్టంట్స్ చేస్తూ మరణించారు. మా స్టంట్ యూనియన్, భారతీయ చిత్ర పరిశ్రమ గొప్ప స్టంట్ మ్యాన్ ను కోల్పోయాయి” అని ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. అయితే, ఇప్పటివరకు ఈ సంఘటనకు సంబంధించి నటుడు ఆర్య లేదా దర్శకుడు పా రంజిత్ అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.