Harom Hara Review : ‘హరోం హర’ మూవీ రివ్యూ.. సుధీర్ బాబు హిట్ కొట్టాడా?

సుధీర్ బాబు మాస్ సంభవం అంటూ ప్రమోట్ చేసిన ఈ హరోం హర సినిమా నేడు జూన్ 14న థియేటర్స్ లోకి వచ్చింది.

Harom Hara Movie Review : సుధీర్ బాబు, మాళవిక శర్మ జంటగా తెరకెక్కిన సినిమా ‘హరోం హర’. జ్ఞానసాగర్ ద్వారకా దర్శకత్వంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్ జి నాయుడు నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. సుధీర్ బాబు మాస్ సంభవం అంటూ ప్రమోట్ చేసిన ఈ హరోం హర సినిమా నేడు జూన్ 14న థియేటర్స్ లోకి వచ్చింది.

కథ విషయానికొస్తే.. తమిళనాడు బోర్డర్ లో ఉండే కుప్పంని తమ్మిరెడ్డి, అతని తమ్ముడు, కొడుకు వాళ్ళ అనుచరులతో కలిసి ఆగడాలు సృష్టించి శాసిస్తుంటారు. వాళ్ళు వస్తే ఊళ్ళో మనుషులు అంతా తలలు దించుకొని నిలబడేంత భయంతో అక్కడి ప్రజలు బతుకుతూ ఉంటారు. కుప్పంలో పాలిటెక్నిక్ కాలేజీలో జాబ్ కోసం సుబ్రహ్మణ్యం(సుధీర్ బాబు) వస్తాడు. అదే కాలేజీలో తన ప్రియురాలు(మాళవిక శర్మ) పనిచేస్తూ ఉంటుంది. ఓ రోజు అనుకోకుండా సుబ్రహ్మణ్యం తమ్మిరెడ్డి మనుషులతో గొడవ పెట్టుకుంటాడు. ఈ ఊరువాడు కాకపోవడంతో జాబ్ సస్పెండ్ చేసి పంపించేస్తారు. అదే సమయంలో ఇంట్లో తండ్రి అప్పులు చేసాడని తెలియడంతో సుబ్రహ్మణ్యంకు బాగా డబ్బులు కావాల్సి వస్తుంది.

కుప్పంలో సుబ్రహ్మణ్యంకు సస్పెన్స్ అయిన కానిస్టేబుల్ పళని(సునీల్) ఫ్రెండ్ అవుతాడు. ఓ రోజు గన్, గన్ తయారుచేసే బ్లూ ప్రింట్ పళని తేవడంతో డబ్బుల కోసం గన్స్ తయారుచేయడానికి సిద్దమవుతాడు సుబ్రహ్మణ్యం. అలా గన్స్ బిజినెస్ లో ఎదుగుతూ తమ్మిరెడ్డి కొడుకుకి కూడా గన్స్ అమ్ముతాడు. కానీ ఓ సమయంలో తమ్మిరెడ్డి కొడుకు సుబ్రహ్మణ్యం నాన్నని చంపడానికి తీసుకొస్తాడు. దీంతో సుబ్రహ్మణ్యం – తమ్మిరెడ్డి కొడుకు శరత్ కి గొడవ జరుగుతుంది. సుబ్రహ్మణ్యం నాన్నని కాపాడుకున్నాడా? ఆ ఊళ్ళో తమ్మిరెడ్డి ఆగడాలు సుబ్రహ్మణ్యం ఎలా తీర్చాడు? గన్ బిజినెస్ లో సుబ్రహ్మణ్యం ఎంతలా ఎదిగాడు? పోలీసులకు సుబ్రహ్మణ్యం దొరుకుతాడా? సుబ్రహ్మణ్యం ప్రేమ సంగతి ఏమైంది? అనేది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ.. హీరో ఎక్కడ్నుంచో ఓ ఊరికి వచ్చి అక్కడి ప్రజల కష్టాలు తీర్చి విలన్ ని ఎదిరించి ఏదో ఒక ఇల్లీగల్ బిజినెస్ లో ఎదిగే కథలు ఇప్పటికే చాలా వచ్చాయి. బిజినెస్ మెన్, పుష్ప, కెజిఎఫ్.. ఇలా చాలా సినిమాల్లాగే ఈ సినిమా కథ కూడా అంతే. ఫస్ట్ హాఫ్ అంతా సుబ్రహ్మణ్యం జాబ్, ప్రేమ, తమ్మిరెడ్డి మనుషులతో గొడవ, గన్స్ తయారుచేయడం చూపిస్తారు. ఇంటర్వెల్ కి నాన్న ఎమోషన్ తో ఆసక్తి కలిగిస్తారు. ఇక సెకండ్ హాఫ్ అంతా గన్స్ బిజినెస్ లో ఎదగడం, ఊరి వాళ్ళని కాపాడటం, విలన్ తో గొడవలతో సాగుతుంది. ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించింది సెకండ్ హాఫ్ మాత్రం చాలా సాగదీసినట్లు ఉంటుంది. ఈ కథ అంతా 1980ల కాలంలో జరిగినట్టు చూపించినా చాలా చోట్ల ఆ ఫ్లేవర్ మిస్ అవుతుంది. హీరో, హీరోయిన్స్ క్యారెక్టర్స్, వాళ్ళ ప్రేమని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయకుండా కథలోకి తీసుకువెళ్లిపోతారు. సినిమాలో సుధీర్ బాబు యాక్షన్ సీన్స్ ఎక్కువే ఉంటాయి. ఇక ఈ సినిమాకి సుధీర్ బాబుకి నవ దళపతి అనే కొత్త ట్యాగ్ ఇవ్వడం గమనార్హం.

Also Read : Yevam Review : ‘యేవమ్’ మూవీ రివ్యూ.. పోలీసాఫీసర్ గా చాందిని చౌదరి మెప్పించిందా?

నటీనటుల పర్ఫార్మెన్స్.. సుధీర్ బాబు ప్రతి సినిమాకి జయాపజయాలతో సంబంధం లేకుండా బాగా కష్టపడతాడని తెలిసిందే. ఈ సినిమాకు కూడా సుధీర్ బాబు బాగా కష్టపడ్డాడు. 25 రోజులు రియల్ వర్షంలో షూట్ చేయడం, ఫుల్ యాక్షన్ సీన్స్, బాడీ పరంగా ఫిట్ గా కనిపిస్తూ సుధీర్ హరోం హర కోసం బాగా వర్క్ చేసాడు. మాళవిక శర్మ చీరలో కనిపించి అందంతో అలరించింది. కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ లాంటి పాత్ర మాత్రమే. సునీల్ మాత్రం ఫుల్ లెంగ్త్ సుధీర్ బాబు పక్కనే ఉండి పళని పాత్రలో అదరగొట్టాడు అని చెప్పొచ్చు. లక్కీ లక్ష్మణ్, రవి కాలే, అర్జున్ గౌడ.. లాంటి నటులు విలన్స్ గా బాగా నటించారు. మిగిలిన పాత్రలు కూడా మెప్పించాయి.

సాంకేతిక అంశాలు.. హరోం హర సినిమా సాంకేతికంగా మాత్రం చాలా బాగుంది అని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ విజువల్స్, కొత్త కలర్ ప్యాలెట్ తో చాలా బాగున్నాయి. చేతన్ భరద్వాజ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఇన్నాళ్లు లవ్ సాంగ్స్ ఇచ్చిన చేతన్ ఈ సినిమాకి అదిరిపోయే యాక్షన్ BGM ఇచ్చి సూపర్ అనిపించాడు. గన్స్ కోసం కూడా చాలా బాగానే రీసెర్చ్ చేసారు. ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా బాగా కష్టపడినట్టు సెట్స్ చూస్తుంటే తెలిసిపోతుంది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ బాగున్నా వైలెన్స్ మరీ ఎక్కువగా ఉంది. నిర్మాణ పరంగా మాత్రం ఈ సినిమాకి బాగానే ఖర్చు పెట్టాడు. కథ, కథనం రెండూ పాతవే అయినా సాంకేతికంగా దర్శకుడు మాత్రం సక్సెస్ అయ్యాడు.

మొత్తంగా ‘హరోం హర’ సినిమా బతకడానికి ఓ ఊరు వచ్చిన హీరో అనుకోకుండా గన్స్ తయారీ బిజినెస్ లోకి దిగి ఆ ఊరికి దేవుడు లాంటి మనిషి ఎలా అయ్యాడు అనేది ఫుల్ లెంగ్త్ యాక్షన్ తో చెప్పారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

ట్రెండింగ్ వార్తలు