Ooru Peru Bhairavakona : ‘ఊరుపేరు భైరవకోన’ రివ్యూ.. భయపెట్టి.. నవ్వించి.. మెప్పించారా?

ఊరుపేరు భైరవకోన సినిమా దయ్యాలు, ఆత్మలతో థ్రిల్లింగ్ గా సాగుతూనే ఓ చక్కటి ప్రేమకథని చూపించారు.

Ooru Peru Bhairavakona : ‘ఊరుపేరు భైరవకోన’ రివ్యూ.. భయపెట్టి.. నవ్వించి.. మెప్పించారా?

Sundeep Kishan Ooru Peru Bhairavakona Movie Review and Rating

Ooru Peru Bhairavakona : సందీప్ కిషన్(Sundeep Kishan) హీరోగా VI ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఊరుపేరు భైరవకోన’ సినిమా నేడు ఫిబ్రవరి 16న థియేటర్స్ లో రిలీజయింది. వర్ష బొల్లమ్మ(Varsha Bollamma), కావ్య థాపర్ హీరోయిన్స్ గా నటించగా వైవా హర్ష, వెన్నెల కిషోర్, రవిశంకర్.. పలువురు ముఖ్య పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది. సినిమాలోని ఓ పాట బాగా వైరల్ అవ్వడం, ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత థ్రిల్లింగ్ అంశాలు ఉండటంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.

కథ విషయానికొస్తే..
సినిమాల్లో హీరోలకు డూప్ గా యాక్షన్ సీన్స్ చేసే బసవ(సందీప్ కిషన్) ఓ పెళ్లి ఇంట్లో దొంగతనం చేసి అక్కడ బంగారు నగలు కొట్టేసి తప్పించుకొని పారిపోతాడు. బసవతో పాటు జాన్(వైవా హర్ష) తప్పించుకొని వెళ్తుంటే దారిలో గీత(కావ్య థాపర్) అనే దొంగ యాక్సిడెంట్ లాగా నాటకం ఆడటంతో, తనని కాపాడటానికి వీళ్ళ బండి ఎక్కించుకుంటారు. పోలీసులు వీళ్ళని ఛేజ్ చేయడంతో అనుకోకుండా భైరవకోన అనే ఊర్లోకి వెళ్తారు.

అక్కడ వీరికి అనుకోని వింత అనుభవాలు ఎదురవ్వడం, బసవ.. భూమి(వర్ష)ని ప్రేమించి, ఆమె కోసమే ఈ దొంగతనం చేయడం ఇవన్నీ పెద్దమ్మ(వడివుక్కరాసి) అనే ఆవిడ చెప్పడంతో ఆశ్చర్యపోతారు. తాను దొంగతనం చేసిన నగలు, అక్కడి వాళ్ళు కొట్టేస్తారు. వాళ్ళని ఎదుర్కొని ఆ నగలు తెచ్చుకుందాం అనుకునేలోపు అసలు అది ఊరు కాదని, ఆ ఊళ్ళో ఉన్నవాళ్ళంతా దయ్యాలు అని తెలుస్తుంది, ఉదయం అవ్వడంతో ఆ దయ్యాలన్నీ మళ్ళీ గాలిలో కలిసిపోతాయి. ఆ ఊర్లో ఒక్కరు కూడా కనపడరు. కానీ ఆ నగలు తీసుకొనే వెళ్ళాలి, డబ్బులు అవసరం అని బసవ ఉండాలనుకుంటాడు అక్కడే. అసలు భైరవ కోన ఏంటి? అక్కడ అన్ని దయ్యాలే ఎందుకున్నాయి? బసవ ఎందుకు భూమి కోసం దొంగతనం చేస్తున్నాడు? భూమి ఎవరు? భూమి సమస్య ఏంటి? భూమి బసవ కలిసారా? వీళ్ళు భైరవకోన నుంచి బయటపడ్డారా అనేది తెరపై చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ..
సినిమా ఓపెనింగ్ లోనే భైరవకోన అనే ఊరు గురించి ఒక క్లారిటీ ఇచ్చేస్తారు. మొదటి హాఫ్ అంతా హీరో దొంగతనం, హీరో ప్రేమ ఫ్లాష్ బ్యాక్, ముగ్గురు భైరవకోనలోకి ఎంటర్ అవ్వడంతో సాగుతుంది. అక్కడక్కడా కామెడీతో, థ్రిల్లింగ్ గా ఫస్ట్ హాఫ్ సాగుతుంది. ఇంటర్వెల్ టైంకి ఆ ఊళ్ళో అంతా దయ్యాలు అని చెప్పి షాక్ ఇస్తారు. దీంతో సెకండ్ హాఫ్ పై మరింత ఆసక్తి పెరుగుతుంది. ఇక సెకండ్ హాఫ్ మొదట్లో ఫుల్ కామెడీతో నవ్వించినా తర్వాత సీరియస్ ఎమోషన్ తో నడిపించారు.

కథ చాలా వరకు చీకట్లోనే జరగుతుంది. కొన్ని సీన్స్ మాత్రం అంత కన్విన్సింగ్ గా అనిపించవు. ఓ వైపు భైరవకోన కథ, మరోవైపు భూమి గూడెం కథ, మరోవైపు బసవ కథ.. అంటూ తిప్పడంతో అక్కడక్కడా కొంత కన్ఫ్యూజన్ వస్తుంది. కానీ సినిమా అంతా ఎక్కడా బోర్ కొట్టకుండా తీసుకెళ్లడం విశేషం. ఇలాంటి ఆసక్తికర కథకి లెంగ్త్ కూడా తక్కువ ఉండటం గమనార్హం. సెకండ్ హాఫ్ ఇంకొంచెం ఉంటె బాగుండు అనిపిస్తుంది. క్లైమాక్స్ కి ఇచ్చే ఇంకో ట్విస్ట్ తో అందరూ ఆశ్చర్యపోతారు.

Also Read : ‘ఊరి పేరు భైరవకోన’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. పబ్లిక్ టాక్ ఏంటి..?

నటీనటుల విషయానికొస్తే..
సుందీప్ కిషన్ యాక్షన్, ఎమోషన్ సీన్స్ లో మెప్పిస్తాడు. వర్ష బొల్లమ్మ ఓ గూడెం పిల్లగా కనిపించి అలరించింది. కావ్య థాపర్ మోడరన్ దొంగగా కనిపించి మెప్పించింది. వైవా హర్ష, వెన్నెల కిషోర్ కామెడీతో నవ్విస్తారు. రవిశంకర్ దయ్యంలా భయపెడతాడు. మిగిలిన నటీనటులు కూడా ఓకే అనిపిస్తారు.

సాంకేతిక అంశాలు..
ఊరుపేరు భైరవకోన సినిమాకి ముందుగా చెప్పుకోవాల్సింది ఆర్ట్ వర్క్, గ్రాఫిక్స్. దయ్యలా ఊరుగా భైరవకోనని అద్భుతంగా సెట్ చేసారు ఆర్ట్ డైరెక్టర్. కొన్ని సీన్స్ లో VFX వర్క్స్ బాగుంటాయి. ఇక సినిమాటోగ్రఫీ విజువల్స్.. సినిమా చాలా భాగం రాత్రి పూటే కావడంతో దానికి తగ్గ లైటింగ్, న్యాచురల్ కాగడా మంటలతో బాగా చూపించారు. శేఖర్ చంద్ర ఇచ్చిన సంగీతం చాలా బాగుంది. ఆల్రెడీ సినిమాలో ఉన్న రెండు పాటలు ముందే హిట్ అయ్యాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంటుంది. కథ, కథనం చాలా ఆసక్తిగా నడిపించాడు దర్శకుడు. అయితే సెకండ్ హాఫ్ ఇంకొంచెం పెంచితే బాగుండు అనిపిస్తుంది. సినిమాల రిజల్ట్ పక్కనపెడితే దర్శకుడిగా VI ఆనంద్ బెస్ట్ ఇస్తాడని ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమాతో కూడా దర్శకుడిగా 100 శాతం సక్సెస్ అయ్యాడు.

మొత్తంగా ఊరుపేరు భైరవకోన సినిమా దయ్యాలు, ఆత్మలతో థ్రిల్లింగ్ గా సాగుతూనే ఓ చక్కటి ప్రేమకథని చూపించారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు. చాలా రోజుల తర్వాత సందీప్ కిషన్ ఓ మంచి సినిమాతో వచ్చాడు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే..