Paarijatha Parvam Movie Review : ‘పారిజాత పర్వం’ మూవీ రివ్యూ.. సినిమా వాళ్ళు కిడ్నాప్ చేస్తే..

కిడ్నాప్ ఒక ఆర్ట్ అంటూ క్రైం కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా 'పారిజాత పర్వం'.

Paarijatha Parvam Movie Review : చైతన్య రావు, సునీల్(Sunil), శ్రద్ధా దాస్(Shraddha Das), మాళవికా సతీశన్, వైవా హర్ష.. మెయిన్ లీడ్స్ లో సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో మహీధర్ రెడ్డి, దేవేష్ నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘పారిజాత పర్వం’. కిడ్నాప్ ఒక ఆర్ట్ అంటూ ఈ సినిమా ప్రమోషన్స్ కొత్తగా చేసారు. క్రైం కామెడీ నేపథ్యంలో ఉండటంతో టీజర్, ట్రైలర్స్ తో ఈ సినిమాపై మంచి ఆసక్తి నెలకొంది. ‘పారిజాత పర్వం’ సినిమా నేడు ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథ విషయానికొస్తే.. ఇంద్ర సినిమా రిలీజయిన సమయంలో చిరంజీవి ఫ్యాన్ శ్రీను(సునీల్) హీరో అవ్వాలని ఇండస్ట్రీకి వస్తాడు. కాని ఇక్కడ రియాల్టీ అర్థమయి బార్ లో పని చేస్తూ చిన్న చిన్న క్యారెక్టర్స్ వేస్తూ ఉంటాడు. ఆ బార్ లో డ్యాన్సర్ గా పనిచేసే పారు(శ్రద్ధ దాస్)ని బార్ ఓనర్ నుంచి రక్షించబోయి అతన్ని చంపేస్తాడు. ఆ బార్ ఓనర్ పెద్ద డాన్ అని తెలిసి అతన్ని చంపడంతో అతని ప్లేస్ లో శ్రీను.. బార్ శ్రీనుగా మారి పారుతో కలిసి దందాలు చేసుకుంటూ ఉంటాడు.

ఇదే బార్ శ్రీను కథని సినిమా కథగా రాసుకొని చైతన్య(చైతన్య కృష్ణ) దర్శకుడిగా సినిమా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కథ నిర్మాతలకు నచ్చినా హీరోగా తన ఫ్రెండ్(హర్ష)నే కావాలి అనడంతో వచ్చిన ఛాన్సులు కూడా పోతాయి. ఓ ప్రొడ్యూసర్(శ్రీకాంత్ అయ్యంగార్) అయితే అవమానించి మరీ పంపిస్తాడు. అదే టైంలో చైతన్య గర్ల్ ఫ్రెండ్(మాళవిక సతీషన్) పెళ్లి గురించి మాట్లాడుతుంది, వాళ్ళ అమ్మ ఇంట్లో కష్టాలు చెప్తుంది. దీంతో ఎలాగైనా డైరెక్టర్ అవ్వాలని చైతన్య ప్రొడ్యూసర్ భార్యని కిడ్నాప్ చేసి డబ్బులు అడిగి వాటితో సినిమా తీయాలనుకుంటాడు. అదే సమయంలో బార్ శ్రీను మనుషులు కూడా ప్రొడ్యూసర్ భార్యని కిడ్నాప్ చేయాలనుకుంటారు. మరి ఎవరు ఎవర్ని కిడ్నాప్ చేశారు? అసలు బార్ శ్రీను మనుషులు ఎందుకు కిడ్నాప్ చేయాలనుకున్నారు? చైతన్య సినిమా తీసాడా? బార్ శ్రీను కథని చైతన్య సినిమా తీస్తున్నట్టు తెలుసా? కిడ్నాప్ చేసిన వాళ్ళని పోలీసులు పెట్టుకున్నారా? ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Rajamouli – Mahesh Babu : సినిమా అనౌన్స్ చేశాక మొదటిసారి కలిసి కనిపించిన రాజమౌళి మహేష్ బాబు.. మహేష్ లుక్ అదిరిందిగా..

సినిమా విశ్లేషణ.. క్రైం కామెడీ జానర్ లో ఈ ‘పారిజాత పర్వం’ సినిమాని తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ అంతా బార్ శ్రీను కథ, చైతన్య కథ రెండూ ఒకేసారి చూపిస్తారు. ఇంటర్వెల్ కి కిడ్నాప్ జరిగినట్టు చూపించి నెక్స్ట్ ఏం జరుగుతుందా అని ఆసక్తి కలిగించారు. ఇక సెకండ్ హాఫ్ కిడ్నాప్ చేసిన వాళ్ళు డబ్బులు డిమాండ్ చేయడం, పోలీసులు వీళ్ళ కోసం వెతకడం, ఎవరు ఎవర్ని కిడ్నాప్ చేసారంటూ ఒక కన్ఫ్యూజన్ కామెడీతో సాగుతుంది. సినిమా మొత్తంలో కామెడీ అయితే కొంచెం వర్కౌట్ అయింది. సినిమాలో సినిమా వాళ్ళ కష్టాలు చూపించారు. క్రైం కామెడీ కిడ్నాప్ కథాంశమైనా సినిమా అంతా సినిమా చుట్టే తిరుగుతుంది. బార్ శ్రీను, శ్రద్ధాదాస్, చైతన్య, హర్ష, చైతన్య గర్ల్ ఫ్రెండ్ వీళ్లంతా సినిమాల్లో రాణిద్దామనే ఇండస్ట్రీకి వచ్చిన పాత్రలే. దీంతో కొంచెం ఆసక్తిగా కథనం నడుస్తుంది.

నటీనటుల పర్ఫార్మెన్స్.. ఈ సినిమాకి మెయిన్ హీరో సునీల్ అని చెప్పొచ్చు. సునీల్ బార్ శ్రీను పాత్రలో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. శ్రద్దా దాస్ తన అందంతో నటనతో అలరించింది. చైతన్య సినిమాల కోసం ప్రయత్నించే పాత్రలో మెప్పించాడు. వైవా హర్ష తన కామెడీతో నవ్వించాడు. మాళవిక సతీషన్ అక్కడక్కడా కనిపించి ఓకే అనిపించింది. శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖ, సమీర్.. మిగిలిన నటీనటులు కూడా పర్వాలేదనిపించారు.

సాంకేతిక అంశాలు.. ముఖ్యంగా ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. లొకేషన్, సీన్, సీన్ టైమింగ్ కి తగ్గట్టు విజువల్స్ పర్ఫెక్ట్ గా మెప్పించాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా సెట్ అయింది. పాటలు మాత్రం ఓకే అనిపిస్తాయి. కథ పాతదే అయినా స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నారు. దర్శకుడిగా సతీష్ సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. సినిమాలో కామెడీకి స్కోప్ ఉన్నా రాసుకోలేదు అనిపిస్తుంది. నిర్మాణం పరంగా సినిమాకు బాగానే ఖర్చుపెట్టారు.

మొత్తంగా ‘పారిజాత పర్వం’ సినిమా సినిమాల్లో స్టార్ అవుదామనుకొని వచ్చిన వాళ్లంతా అవ్వలేక కిడ్నాప్ చేస్తే ఆ కిడ్నాప్ వల్ల ఏం జరిగింది అని కామెడీగా చూపించారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి అభిప్రాయం మాత్రమే.

ట్రెండింగ్ వార్తలు