సైరా ఎఫెక్ట్: ఏపీలో ఉయ్యాలవాడ జయంతి, వర్ధంతి వేడుకలు!

  • Publish Date - September 29, 2019 / 06:44 AM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మాణంలో రామ్ చరణ్ నిర్మించిన సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. అక్టోబర్ 2వ తేదీన విడుదలకు సిద్ధం అవుతున్న ఈ సినిమా ప్యాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ స్థాయిలో ఐదు భాషల్లో విడుదల కాబోతున్న తొలి తెలుగు సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమ 270కోట్ల బడ్జెట్ తో రూపొందుతుంది.

రాయలసీమలోని కర్నూలు జిల్లాకు చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు కావడంతో ఏపీ ప్రభుత్వం సైరా నరసింహారెడ్డి జయంతి, వర్ధంతి వేడుకలను జరపాలని నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రతీ ఏడాది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జయంతి, వర్ధంతికి సంబంధించిన ఉత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందట.  త్వరలోనే దీనిపై అధికారికంగా ఓ నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించుకుని ఇందుకోసం ఒక కమిటీ వెయ్యాలని అనుకుంటుంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధానికి పదేళ్ళ ముందే, బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన ఉయ్యాలవాడ చరిత్రను మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన గొప్పతనం అందరికీ తెలిసేలా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జయంతి, వర్ధంతి ఉత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందట. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫిబ్రవరి 22, 1847 బ్రిటీష్ వారి చేతిలో ఉరి వేయబడి చంపబడ్డాడు.