సైరా నరసింహారెడ్డి.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కుమారుడు రామ్ చరణ్ నిర్మాతగా నటిస్తున్న 151వ సినిమా. అత్యంత భారీ బడ్జెట్‌తో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందు మాత్రం అవాంతరాలు ఎదుర్కొంటుంది. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా సినిమా తీస్తుండగా.. ఉయ్యాలవాడ జీవిత చరిత్రకు సంబంధించిన వాస్తవాలు తెలుసుకుని సినిమా తీసేందుకు నిర్మాత రామ్ చరణ్ తమకు డబ్బులు చెల్లిస్తానని హామీ ఇచ్చి తమను మోసం చేశారంటూ ఉయ్యాలవాడ కుటుంబసభ్యులు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే లేటెస్ట్ గా ఉయ్యాలవాడ వారసులు కొంతమంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన దొరవారి దస్తగిరి రెడ్డితో పాటు మరికొందరు సినిమాలో ఉయ్యాలవాడ చరిత్రతో పాటు ఇళ్లు, ఇతర వస్తువులను కూడా సినిమా కోసం వాడుకున్నారని పిటిషన్‌లో వెల్లడించారు. అంతేకాదు ట్రైలర్ విడుదలకు ముందే డబ్బులు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఇవ్వట్లేదని అందులో చెప్పుకొచ్చారు. బడ్జెట్ మొత్తం మీద 10శాతం చెల్లిస్తానని రామ్ చరణ్ హామీ ఇచ్చాడని సినిమా బడ్జెట్ రూ.200 కాగా, అందులో 10 శాతం అంటే రూ. 20 కోట్లు చెల్లించాలని, కానీ రూ. 25వేలు దారి ఖర్చులకు మాత్రమే ఇచ్చారంటూ పిటిషనర్లు చెబుతున్నారు.
ఉయ్యాలవాడ వారసులు వారి పిటిషన్‌లో రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ, హోమ్, సీబీఎఫ్‌సీ ఛైర్‌పర్సన్, నిర్మాత రామ్ చరణ్, దర్శకుడు సురేంద్రరెడ్డి, చిరంజీవి, అమితాబ్ బచ్చన్ పేర్లను ప్రతివాదులుగా చేర్చారు. ఇదిలా ఉంటే అమితాబ్ పేరును ప్రతివాదిగా చేర్చడంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అమితాబ్ తో ఈ కేసుకు సంబంధం ఏమిటీ? అంటూ జస్టీస్ రాజశేఖర్ రెడ్డి పిటీషనర్ లను ప్రశ్నించారు. అమితాబ్ పేరును ప్రతివాదుల లిస్ట్ నుంచి తొలిగించాలని ఆదేశించారు. ఇక 1952 సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం ఒకరి బయోపిక్ తీయాలంటే తప్పనిసరిగా వారి వారసుల అనుమతి తీసుకోవాలని, కానీ ఇక్కడ పూర్తిగా విరుద్ధంగా ఉందని పిటీషనర్ల తరపున న్యాయవాది వాదిస్తున్నారు. దీంతో హైకోర్టు తీర్పు ఆసక్తికరంగా కనిపిస్తుంది.
ఇదిలా ఉంటే ఉయ్యాలవాడ మండలంలోని రూపనగుడి గ్రామానికి చెందిన నరసింహారెడ్డి వంశస్థులు కొంతమంది చిరంజీవిని ఆయన నివాసంలో కలిసి అభినందించారు. ‘సైరా’ సినిమా ద్వారా రేనాటి గడ్డ చరిత్రను దశదిశల నిలుపుతున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. కోవెలకుంట్లలోని జుర్రేరు, కుందూ నదులు కలిసే ప్రదేశంలో ఏర్పాటు చేస్తున్న ఉయ్యాలవాడ స్మృతివనం ప్రారంభోత్సవానికి చిరంజీవిని ఆహ్వానించారు. దీంతో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసుల విషయంలో సరైన స్పష్టత లేని కారణంగా ఎవరి నుంచి అనుమతులు తీసుకోవాలనే క్లారిటీ లేని కారణంగా సైరా సినిమాకు ఇబ్బందులు లేనట్లే అని అంటున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన సైరా సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది.