భార్య విజయం కోసం అంగప్రదక్షణలు చేసిన సీనియర్ హీరో.. వీడియో వైరల్

నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి కావాలని, తన భార్య విజయం సాధించాలని కోరుకుంటూ విరుదునగర్‌లోని శ్రీ పరాశక్తి మరియమ్మన్ ఆలయంలో సీనియర్ నటుడు శరత్‌కుమార్ పొర్లుదండాలు పెట్టారు.

Sarathkumar Angapradakshinam: లోక్‌స‌భ‌ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్న నేపథ్యంలో అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తాము విజయం సాధించాలని కోరుకుంటూ అభ్యర్థులు దేవుళ్లను వేడుకుంటున్నారు. తన భార్య కోసం తమిళ సీనియర్ నటుడు, బీజేపీ నేత శరత్‌కుమార్ ఏకంగా పొర్లుదండాలు పెట్టారు. విరుదునగర్‌లోని శ్రీ పరాశక్తి మరియమ్మన్ ఆలయంలో ఆయన అంగప్రదక్షణలు చేశారు.

నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి కావాలని, తన భార్య రాధిక విజయం సాధించాలని కోరుకుంటూ విరుదునగర్‌లోని శ్రీ పరాశక్తి మరియమ్మన్ ఆలయంలో శరత్‌కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా భార్య రాధిక, సన్నిహితుల సమక్షంలో అమ్మవారి ఆలయంలో అంగప్రదక్షణలు కూడా చేశారు. ఈ వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. శరత్‌కుమార్‌తో పాటు రాధిక కూడా పరాశక్తి మరియమ్మన్ అమ్మవారి దర్శనం చేసుకున్నారు.

కాగా, తొలి విడతలో భాగంగా తమిళనాడులో ఏప్రిల్ 19న లోక్‌స‌భ‌ ఎన్నికల పోలింగ్ జరిగింది. విరుదునగర్ పార్లమెంట్ స్థానం నుంచి రాధికా శరత్‌కుమార్ బీజేపీ అభ్యర్థిగా పోటీచేశారు. తన భార్య తరపున శరత్‌కుమార్ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాధికపై కాంగ్రెస్ అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు మాణిక్యం ఠాగూర్, డీఎండీకే నుంచి ప్రముఖ హీరో విజయకాంత్ పెద్ద కుమారుడు విజయ ప్రభాకరన్ పోటీ చేశారు. దీంతో విరుదునగర్ ఎన్నికల ఫలితంపై అమితాసక్తి నెలకొంది.

తమిళనాడులో 19వ తేదీన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఆ ఎన్నికల్లో విరుదునగర్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా రాధికా శరత్‌కుమార్ పోటీ చేశారు. ప్రతిగా, ఆమె భర్త మరియు ప్రముఖ బిజెపి నాయకుడు శరత్‌కుమార్ విరుదునగర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో సుడిగాలి ప్రచారం ప్రారంభించారు.

ట్రెండింగ్ వార్తలు