గతకొద్ది రోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు తనను అసభ్య పదజాలంతో తిడుతూ, అశ్లీల వీడియోలు పంపుతున్నారని ‘కరాటే’ కళ్యాణి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు..
నేడు సెల్ ఫోన్ అనేది మనిషి జీవితంలో ఓ భాగమైపోయింది. అలాంటిది మొబైల్ చూడాలంటేనే వణుకు వచ్చేస్తుంది అంటూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ‘కరాటే’ కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. గతకొద్ది రోజులుగా అసభ్య పదజాలంతో తిడుతూ, అశ్లీల వీడియోలు పంపుతూ తనను చిత్రహింసలు పెడుతున్నారని కరాటే కళ్యాణి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఉదయాన్నే ఫోన్ చూడాలంటేనే భయం వేస్తోందని, కొద్దిరోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు ఈ పనులు చేస్తున్నారని, కొన్ని నంబర్లను బ్లాక్ చేసినా సరే వేరే నంబర్ల ద్వారా వీడియోలు పంపుతున్నారని తెలిపారు.
Read Also : మీకు నచ్చినట్టు జీవితాన్ని గడపండి – ప్రియాంక ఆసక్తి కరమైన పోస్ట్
అసలేం జరిగిందంటే.. కొద్ది రోజుల క్రితం ఓ యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకులతో కలిసి కళ్యాణి ఓ డిబేట్‌లో పాల్గొన్నారు. హిందువులు పవిత్రంగా భావించే కొన్ని పేర్లను వాడుకుని బూతు చేష్టలు చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా పేర్లు పెట్టకూడదని, కావాలంటే ముస్లిం, క్రైస్తవ పేర్లు పెట్టుకోండి అంటూ యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అప్పటినుండి ఆమెకు వేధింపులు మొదలయ్యాయి..
క్రైస్తవ సంఘాల ప్రతినిధుల పేరుతో కొద్దిరోజుల నుంచి పలువురు హిందువుల మనోభావాలను రెచ్చగొట్టే విధంగా యూట్యూబ్, ఫేస్‌బుక్‌లలో కథనాలతో పాటు తన ఫొటోలను మార్ఫింగ్ చేసి వీడియోలను అప్‌లోడ్ చేస్తున్నారని కరాటే కళ్యాణి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టామని తెలిపారు.