Hanuman : మళ్ళీ తెలుగు సినిమాల్లో ‘హనుమాన్’ శకం మొదలైంది.. నిన్న తేజ, రేపు చిరు, తర్వాత నిఖిల్..

హనుమాన్ సినిమాతో పాటు ఆంజనేయస్వామి సినీ పరిశ్రమలో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు.

Hanuman : మళ్ళీ తెలుగు సినిమాల్లో ‘హనుమాన్’ శకం మొదలైంది.. నిన్న తేజ, రేపు చిరు, తర్వాత నిఖిల్..

The New Super Hero Hanuman Raised in Movie Industry so many movies using Hanuman References

Updated On : January 17, 2024 / 7:31 AM IST

Hanuman : మనం పూజించే ఆంజనేయస్వామి ఎంతో బలవంతుడు అని మనం నమ్ముతాం. ఇప్పటి భాషలో చెప్పాలంటే నిజమైన సూపర్ హీరో. ఎవరికి భయం వచ్చినా ముందుగా తలుచుకునే పేరు ఆంజనేయస్వామి పేరే. ఇక ఆంజనేయ స్వామి(Anjaneya Swami) విగ్రహం, గుడి లేకుండా ఏ ఊరు ఉండదు. హనుమంతుడిని చూడగానే మనసులో ధైర్యం వచ్చేస్తుంది. అందుకే హనుమంతుడి గురించి ముందు తరాలకి, బయట దేశాలకి కూడా తెలియడానికి ఇప్పుడు సినిమాల్లో ఆంజనేయస్వామి రిఫరెన్సులు తీసుకుంటున్నారు.

గతంలోనే పలు సినిమాల్లో ఆంజనేయస్వామి రిఫరెన్సులు ఉన్నాయి. హనుమంతుడి మీద పాటలు కూడా వచ్చాయి. హీరోకి దెబ్బలు తగిలి పడిపోతే హనుమంతుడు కరుణతోనే లెగుస్తాడు. హీరో భయపడితే హనుమంతుడిని తలుచుకుంటాడు. ఆంజనేయస్వామిని స్తుతిస్తూ సాంగ్స్ కూడా వచ్చాయి. ఇలాంటి రిఫరెన్సులతో గతంలో జగదేకవీరుడు అతిలోక సుందరి, శ్రీ ఆంజనేయం, ఊసరవెల్లి, సుప్రీమ్.. లాంటి పలు సినిమాలు వచ్చాయి. ఇవే కాకుండా ఇంకా చాలా సినిమాల్లో ఆంజనేయస్వామి రిఫరెన్సులు వాడారు. కొన్ని సినిమాల్లో హనుమాన్ విగ్రహాల వద్ద ఫైట్ సీన్స్ ఉంటాయి. ఇక హనుమాన్ గ్రాఫిక్ మూవీ, లెజెండ్స్ అఫ్ హనుమాన్ సిరీస్.. వంటివి కూడా వచ్చి మెప్పించాయి.

ఇప్పుడు మళ్ళీ తెలుగు సినీ పరిశ్రమలో హనుమాన్ శకం మొదలైంది అని చెప్పొచ్చు. ఇటీవల ఆదిపురుష్ రామాయణం ఆధారంగా తీసిన సంగతి తెలిసిందే. ఇందులో కూడా ఆంజనేయస్వామి పాత్రని చక్కగా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇప్పుడు దేశమంతా వైరల్ అవుతున్న సినిమా హనుమాన్. ప్రశాంత్ వర్మ(Prashanth Varma) దర్శకత్వంలో తేజ సజ్జ(Teja Sajja) హీరోగా హనుమాన్ సినిమా సంక్రాతికి వచ్చి భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమా ఆసాంతం హనుమంతుడి రిఫరెన్స్ ఉంది. చివర్లో డైరెక్ట్ గా ఆ ఆంజనేయస్వామే రావడంతో సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు మైమరచిపోయారు. మన సొంత సూపర్ హీరో హనుమంతుడు అని ప్రమోట్ చేయడం… ఇది నిజమే కదా అని ప్రజలని బాగా ఆకర్షించింది.

Also Read : Anil Kumar : ‘విశ్వంభర’ టైటిల్ గ్లింప్స్ కాన్సెప్ట్ ఇతనిదే.. డైరెక్టర్‌గా అఖిల్‌తో సినిమా.. ఇదన్నా వర్కౌట్ అవుతుందా?

దీంతో హనుమాన్ సినిమాతో పాటు ఆంజనేయస్వామి సినీ పరిశ్రమలో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు. రాబోయే సినిమాల్లో హనుమంతుడి రిఫరెన్స్, కనీసం విగ్రహం అయినా ఉండాలని పలువురు దర్శక నిర్మాతలు కోరుకుంటున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) మొదటి నుంచి హనుమంతుడు భక్తుడని తెలిసిందే. ఇటీవల హనుమాన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా గెస్ట్ గా వచ్చారు. చిరంజీవి నెక్స్ట్ విశ్వంభర సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమాలో కూడా హనుమంతుడి రిఫరెన్స్ ఉందని తెలుస్తుంది. ఇటీవల రిలీజ్ చేసిన విశ్వంభర గ్లింప్స్ లో ఓ భారీ హనుమంతుడి విగ్రహాన్ని చూపించారు. ఈ గ్లింప్స్ చూస్తుంటే సినిమాలో హనుమంతుడి రిఫరెన్స్ ఎక్కువగానే, కథలో భాగంగానే ఉంటుందని తెలుస్తుంది.

అలాగే హీరో నిఖిల్(Nikhil Siddharth) నెక్స్ట్ సినిమాలో కూడా హనుమంతుడు రిఫరెన్స్ ఉంది. నిఖిల్ స్వయంభు అనే భారీ పీరియాడికల్ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ టైంలో హార్స్ రైడింగ్ చేస్తున్న వీడియోని పోస్ట్ చేసి.. స్వయంభు సినిమాలో నేను కూడా హనుమంతుడి భక్తుడిని. ఈ సినిమాలో కూడా జై శ్రీరామ్ అంటాము అని తెలిపాడు. దీంతో నిఖిల్ పోస్ట్ కూడా వైరల్ అవుతుంది.. ఇలా రాబోయే ఆసక్తికర సినిమాలన్నీ హనుమంతుడి రిఫరెన్స్ తో నిండిపోతున్నాయి. దీంతో ఇలా అయినా మన ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారని పలువురు అభినందిస్తుంటే, మరికొంతమంది మన సూపర్ హీరోని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం అంటుంటే, పిల్లలు మాత్రం జై హనుమాన్ అని ఆసక్తిగా హనుమంతుడి గురించి తెలుసుకుంటున్నారు. మొత్తానికి హనుమాన్ శకం నడుస్తుంది మన సినీ పరిశ్రమలో.