ఎగ్జిబిటర్లపై నాగవంశీ ఫుల్ ఫైర్.. కావాలంటే చిరంజీవి దగ్గరికెళ్తాం.. వదిలేదే లే..
తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల నిర్ణయంపై ప్రముఖ నిర్మాత నాగవంశీ(Naga Vamsi) తీవ్రంగా స్పందించారు.
- V Santhosh Kumar
- Updated on- May 13, 2026 / 06:55 PM IST
tollywood producer naga vamsi press meet regarding latest issue
- థియేటర్ల మొండిపై నాగవంశీ ఆగ్రహం.
- చిరంజీవి దగ్గరకు వెళ్తామంటూ హెచ్చరిక.
- పెద్ది సినిమాపై భారీ పెట్టుబడి.
Naga Vamsi: తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో ఎగ్జిబిటర్లు “పర్సెంటేజ్ షేరింగ్ విధానం” కోసం గళమెత్తారు. ప్రస్తుతమున్న రెంటల్ సిస్టమ్ వల్ల థియేటర్లు తీవ్ర నష్టాల్లో ఉన్నాయని, కేవలం పర్సెంటేజ్ పద్ధతిలో వచ్చే సినిమాలనే ప్రదర్శిస్తామని హైదరాబాద్ సమావేశంలో స్పష్టం చేశారు. థియేటర్లు మూతపడితే సినీ పరిశ్రమ మొత్తం దెబ్బతింటుందని, ఇతర రాష్ట్రాల తరహాలో ఇక్కడ కూడా మార్పులు రావాలని వారు డిమాండ్ చేశారు. టికెట్ ధరలు పెంచకుండానే ఆదాయాన్ని సమన్వయం చేసుకోవడమే తమ లక్ష్యమని వివరించారు.
అయితే, ఈ నిర్ణయంపై ప్రముఖ నిర్మాత నాగవంశీ(Naga Vamsi) తీవ్రంగా స్పందించారు. ఎగ్జిబిటర్ల నిర్ణయం వల్ల మొదటగా రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాకే పెద్ద ముప్పు వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సినిమాపై తాము భారీగా పెట్టుబడి పెట్టామని, షూటింగ్ చివరి దశలో ఇలాంటి నిబంధనలు పెట్టడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవేళ థియేటర్లు మూసివేస్తే లేదా ఆపేస్తే, తాము నేరుగా చిరంజీవి, రామ్ చరణ్‌ల దగ్గరకు వెళ్లి సమస్యను వివరిస్తామని నాగవంశీ హెచ్చరించారు.
అలాగే, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవి మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన హరి హర వీరమల్లు సమయంలో కూడా ఇలాగే చేశారు. ఇప్పుడు రామ్ చరణ్ పెద్ది సినిమాకు చేస్తున్నారు. మధ్యలో చాలా సినిమాలు వచ్చాయి కదా. అప్పుడెందుకు ఈ గొడవలు చేయలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య ఈ వివాదం టాలీవుడ్‌లో వేడిని పుట్టిస్తోంది. థియేటర్లలో కనీస సౌకర్యాలు మెరుగుపరచకుండా, కేవలం షేరింగ్ విధానం అడిగితే ఎలా అని నాగవంశీ ప్రశ్నించారు. భారీ బడ్జెట్ సినిమాల విషయంలో రిస్క్ ఎక్కువగా ఉంటుందని, అందరూ కలిసి కూర్చుని చర్చించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. జూన్ 4న ‘పెద్ది’ విడుదల కానున్న తరుణంలో ఈ పర్సెంటేజ్ రచ్చ ఎలాంటి మలుపు తిరుగుతుందోనని పరిశ్రమ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
