Kota Srinivasa Rao
Kota Srinivasa Rao Passed Away: తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు (83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున 4గంటల సమయంలో ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
కృష్ణా జిల్లా కంకిపాడులో 1942 జులై 10న కోట శ్రీనివాసరావు జన్మించారు. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన కోట శ్రీనివాసరావు.. రంగస్థల నటుడిగా ఎన్నో ఏళ్లపాటు అలరించారు. 1978లో ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు. తమిళ, హిందీ, కన్నడ చిత్రాల్లో నటించిన కోట.. 750కి పైగా చిత్రాల్లో నటించారు.
సినిమాల్లోకి రాకముందు కోట శ్రీనివాసరావు స్టేట్ బ్యాంకులో పనిచేశారు. 1966లో ఆయనకు రుక్మిణితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. 2010జూన్ 21న కోట కుమారుడు ఆంజనేయ ప్రసాద్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. కొడుకు అకాల మరణంతో ఆయన కుంగిపోయారు. కోట తమ్ముడు శంకర్ రావు కూడా నటుడే.
ఇదిలాఉంటే.. కోట శ్రీనివాసరావు రాజకీయాల్లోనూ అడుగుపెట్టారు. 1999 నుంచి 2004 వరకు విజయవాడ తూర్పు బీజేపీ ఎమ్మెల్యేగా పనిచేశారు.
వృద్ధాప్య సమస్యల కారణంగా ఇటీవల కాలంలో సినిమాలకు దూరంగా ఉంటున్నారు. 2023లో వచ్చిన ‘సువర్ణ సుందరి’ ఆయన చివరి చిత్రం. ప్రతిఘటన, గాయం, తీర్పు, లిటిల్ సోల్జర్స్, గణేష్, చిన్నా, ఆ నలుగురు, పెళ్లైన కొత్తలో చిత్రాలకు గాను నంది అవార్డులు అందుకున్నారు.