‘సరిలేరు నీకెవ్వరు’కు వెళ్తూ..: హీరోయిన్‌కి పోలీసుల నుంచి నోటీసులు

  • Publish Date - January 14, 2020 / 04:38 AM IST

ప్రముఖ హీరోయిన్ సంజనాకు నోటీసులు పంపించారు బెంగళూరు సిటీ ట్రాఫిక్ పోలీసులు. విచారణకు రావాలంటూ ఆదేశించారు. ఎందుకంటే ఆమె బెంగళూరులోని మాజెస్టిక్ రోడ్‌లో కారు నడుపుతూ సెల్ఫీ వీడియో తీసుకుంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెకు నోటీసులు పంపారు.

వివరాల్లోకి వెళ్తే.. మహేష్ బాబు హీరోగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమా చూసేందుకు వెళ్తూ.. కారు డ్రైవ్ చేస్తూనే ఓ సెల్ఫీ వీడియో తీసుకుంది సంజన. అది కాస్తా సోషల్ మీడియాలో పెట్టింది. అది కాస్తా వైరల్ అవ్వడంతో ట్రాఫిక్ రూల్స్ ప్రకారం ఆమెకు నోటీసులు పంపించారు పోలీసులు. ట్రాఫిక్ చట్టాల ప్రకారం.. డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వాడకూడదు. డ్రైవింగ్ చేస్తూ మొబైల్ మాట్లాడితే రూ.1000 ఫైన్ వేస్తారు. రెండోసారి కూడా ఇలాగే మొబైల్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే… డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేసే ఛాన్సుంది. అలాగే రూ.1000 ఫైన్ వేస్తారు. ఒకవేళ మూడోసారీ పట్టుబడితే రూ.2000 ఫైన్ వేస్తారు.

అయితే సంజన విషయంలో మాత్రం బెంగళూరు పోలీసులు గట్టిగానే రియాక్ట్ అయ్యారు. ఒక సెలబ్రిటీ అయ్యి అందరినీ ప్రభావితం చేసేలా ఇటువంటి చర్యలకు పాల్పడడంతో ఆమెకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. సెలబ్రిటీలు అత్యంత బాధ్యతతో మెలగాలని, సెలబ్రిటీలే ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే తమకు పరిస్థితుల్ని కంట్రోల్ చెయ్యడం కష్టమవుతుందని అంటున్నారు. ఈ క్రమంలోనే సంజన విషయంలో ఆమె నిబంధనలు అతిక్రమించినట్లు క్లియర్‌గా తెలిసినందువల్ల జాయింట్ పోలీస్ కమిషనర్ ఆదేశాలతో ట్రాఫిక్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.