Fish Venkat Dies: టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూశారు. ఆయన వయసు 53 ఏళ్లు. హైదరాబాద్ చందానగర్ లోని పీఆర్కే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫిష్ వెంకట్ మృతి చెందారు. ఫిష్ వెంకట్ కొంతకాలంగా కిడ్నీ సంబంధ సమస్యతో బాధపడుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు.
ఫిష్ వెంకట్ అసలు పేరు మంగళంపల్లి వెంకటేశ్. ముషీరాబాద్ లో చేపల వ్యాపారంతో ఫిష్ వెంకట్ గా గుర్తింపు పొందారు. 100కు పైగా సినిమాల్లో హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి సినీ ప్రియులను అలరించారు. నటుడు శ్రీహరి ద్వారా సినీ పరిశ్రమలోకి వచ్చారు ఫిష్ వెంకట్. డైరెక్టర్ వీవీ వినాయక్ ఫిష్ వెంకట్ ను నటుడిగా పరిచయం చేశారు. ఆది, దిల్, బన్నీ, అత్తారింటికి దారేదీ, గబ్బర్ సింగ్, ఆర్య, డీజే టిల్లు తదితర చిత్రాల్లో ఆయన నటించారు. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తనదైన కామెడీతో, డైలాగులతో ప్రేక్షకులను కడుపుబ్బా నటించారు. ఆయన మరణంతో సినీ పరిశ్రమలో విషాదం అలుముకుంది. సినీ రంగానికి చెందిన పలువురు ఫిష్ వెంకట్ మృతికి సంతాపం తెలిపారు.
రెండు కిడ్నీలు పాడవడంతో ఫిష్ వెంకట్ అనారోగ్యానికి గురయ్యారు. కొంతకాలంగా ఆయన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సినీ పరిశ్రమకు చెందిన అనేక మంది వైద్య ఖర్చులకు సాయం చేశారు. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయాల్సి ఉందని డాక్టర్లు చెప్పడంతో వైద్య ఖర్చుల కోసం కుటుంబసభ్యులు ఎదురుచూస్తున్నారు.
ఇదే సమయంలో ఫిష్ వెంకట్ కన్నుమూశారు. పలు హిట్ సినిమాల్లో ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు. 100కి పైగా చిత్రాల్లో యాక్ట్ చేసిన వెంకట్.. ఇండస్ట్రీలో అందరికీ సుపరిచితమే. పెద్ద స్టార్స్ సినిమాల్లోనూ నటించే అవకాశం ఆయనకు దక్కింది. విలన్ పాత్రలోనూ కామెడీ పండించడం ఫిష్ వెంకట్ కే సాధ్యమైంది. ఫిష్ వెంకట్ లాంటి నటుడు ఇక లేరనే వార్త ఇండస్ట్రీకి కొంత లోటుగా చెప్పొచ్చు. శనివారం ముషీరాబాద్ లోని స్మశాన వాటికలో అంత్యక్రియలు చేసేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.