బాలీవుడ్ నటి కంగనా రనౌత్ శివసేన- వివాదంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే హీరోయిన్ కంగనా రనౌత్ పేరు పెట్టకుండా టార్గెట్ చేశారు. ముంబైకి చాలా మంది వచ్చి పేరు సంపాదిస్తారని, కానీ వారు ముంబైకి తిరిగి అప్పును చెల్లించరు అంటూ విమర్శించారు.
ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ, కొంతమంది తమ ఉపాధి, వ్యాపారం కోసం నగరానికి వచ్చి బాగా సంపాదించుకుని కనీసం కృతజ్ఞతలు చెప్పడం లేదని అన్నారు. అసెంబ్లీలో మాట్లాడిన ఉద్ధవ్ ఠాక్రే ఎవరి పేరు పెట్టకుండా, “కొంతమంది వారు నివసించే నగరానికి కృతజ్ఞతలు తెలుపుతారు కాని కొంతమంది అలా లేరు” అని అన్నారు. ఇటీవల మరణించిన మంత్రి అనిల్ రాథోడ్‌కు నివాళి అర్పించిన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ, అనిల్ భయ్య రాజస్థాన్ నుండి వచ్చి మహారాష్ట్రను తన నివాసంగా చేసుకున్నారు. అతను బలమైన శివ సైనిక్.
వాస్తవానికి, కంగనా రనౌత్ వర్సెస్ శివసేన వివాదం చాలా రోజులుగా వార్తల్లో నిలుస్తుంది. శివసేన నాయకుడు సంజయ్ రౌత్ నటి కంగనా రనౌత్ పై విమర్శల దాడి చేయడమే కాదు. మహారాష్ట్రలో కంగనా రనౌత్ పై నిరసనలు కూడా జరిగాయి. ఆమె ఫోటోలను చెప్పులతో కొట్టారు. కారణం, కంగనా రనౌత్ ముంబైని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK) తో పోల్చడమే.
ఈ క్రమంలోనే కంగనా రనౌత్‌కు కేంద్రం Y ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించింది. ఆమెకు ఓ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్‌తో పాటు 11 మంది పోలీసులు భద్రతగా ఉంటారని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. కంగనాకు కల్పించే భద్రతలో కమాండోలు కూడా ఉండనున్నట్లు కేంద్రం హోంశాఖ వర్గాల సమాచారం.
హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ముంబైలో కంగనాకు భద్రత కల్పించాలంటూ కేంద్రానికి లేఖ రాయగా.. కంగనాకు భద్రత కల్పించాలని ఆమె సోదరి, తండ్రి తనను కోరినట్లు హిమాచల్ సీఎం జైరాం థాకూర్ తెలిపారు. ముంబై పోలీసులను తాను విశ్వసించడం లేదని, ఆమె వేరొకరి నుండి రక్షణ కోరుకుంటుందని కంగనా చెప్పడంతో ఈ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకుంది.