‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీ రివ్యూ.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సత్తా చూపించిన సినిమా..

'ఆపరేషన్ వాలెంటైన్' సినిమా పుల్వామా అటాక్, దానికి ఇండియా ఇచ్చిన కౌంటర్ అటాక్.. ఆధారంగా మన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సత్తా చూపిస్తూ తీసిన దేశభక్తి సినిమా.

Varun Tej Manushi Chhillar Operation Valentine movie review

Operation Valentine : మెగా హీరో వరుణ్ తేజ్(Varun Teja) హీరోగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో శక్తిప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆపరేషన్ వాలంటైన్’. మానుషి చిల్లర్ హీరోయిన్ గా, రుహానీ శర్మ, నవదీప్, శతాఫ్, సంపత్, పరేష్ పహుజా, అభినవ్ గోమఠం, అలీ రాజా, శ్వేతవర్మ.. పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు. పుల్వామా అటాక్, దానికి భారతదేశం ఉగ్రవాదులకు ఇచ్చిన కౌంటర్ అటాక్.. వంటి రియల్ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఆపరేషన్ వాలెంటైన్ సినిమా మార్చ్ 1న గ్రాండ్ గా తెలుగు, హిందీలో రిలీజ్ అవుతుంది. నేడు ముందురోజే రాత్రి పలు చోట్ల ప్రీమియర్స్ వేశారు.

కథ విషయానికొస్తే.. రుద్ర(వరుణ్ తేజ్) ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో వింగ్ కమాండర్. 20 మీటర్ రేంజ్ లో జెట్ ఫైటర్ ని తీసుకెళ్తే శత్రువుల రేడార్ సిగ్నల్స్ కి చిక్కము అనే వజ్ర కాన్సెప్ట్ మీద ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. ఆ ప్రయోగంలో తన ఫ్రెండ్ కబీర్(నవదీప్) ని కోల్పోతాడు. రుద్ర గాయపడతాడు. కొన్ని రోజులు ఎయిర్ ఫోర్స్ కి దూరంగా ఉండి మళ్ళీ జాయిన్ అవుతాడు. ఈ సంఘటన వల్ల తన ప్రేయసి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో రాడార్ వింగ్ కమాండర్ అహనా గిల్(మానుషీ చిల్లర్) మధ్య గ్యాప్ వస్తుంది.

రుద్ర యాక్సిడెంట్ నుంచి కోలుకోగానే ఓ ఆపరేషన్ అప్పచెప్తారు. జెట్ పైలెట్ గా ఆ ఆపరేషన్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసి వస్తుంటే పుల్వామా అటాక్ జరుగుతుంది. ఓ ఉగ్రవాది CRPF జవాన్స్ ట్రక్స్ వద్దకు సూసైడ్ బాంబర్ గా వచ్చి పేల్చడంతో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోతారు. దీనికి సమాధానంగా ఆ దాడి చేసిన ఉగ్రవాదులని అంతం చేయడానికి పాకిస్థాన్ లోకి చొరబడి మన పైలెట్స్ బాలాకోట్ దాడిని చేస్తారు. ఆ ఆపరేషన్ ని రుద్ర లీడ్ చేస్తాడు, కింద నుంచి అహనా రాడార్ కంట్రోల్ చేస్తుంది. ఈ ఆపరేషన్ లో ఇండియన్ టీం ఎలా సక్సెస్ అయ్యారు? అటాక్ సమయంలో పాకిస్థాన్ వాళ్ళు అటాక్ చేస్తే ఎలా తప్పించుకున్నారు? దానికి పాకిస్థాన్ ఎలా రియాక్ట్ అయింది? దానికి ఇండియా ఎలా సమాధానం ఇచ్చింది అనేది తెరపై చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ..
ఈ సినిమాని పుల్వామా అటాక్, దానికి కౌంటర్ అటాక్ ఆధారంగా తీసిన సినిమా అని తెలిసిందే. అయితే వాటిని ఎలా చూపించారు అనేదే ముఖ్యం. ఫస్ట్ హాఫ్ రుద్ర క్యారెక్టర్, అతను చేసిన ప్రయోగం, రుద్ర – అహనా మధ్య ప్రేమని చూపించారు. ఇంటర్వెల్ ముందు పుల్వామా అటాక్ దాడిని చూపించి సెకండ్ హాఫ్ లో ఎలా కౌంటర్ ఇస్తారు అని అందరూ వెయిట్ చేసేవిధంగా స్క్రీన్ ప్లేని ఆసక్తిగా రాసుకున్నారు. ఇక సెకండ్ హాఫ్ లో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్, మన పైలెట్స్ ఎలా పాకిస్థాన్ లోకి ఎంటర్ అయి ఉగ్రవాదులని అంతం చేశారు, అక్కడి నుంచి తప్పించుకొని ఎలా వచ్చారు? మళ్ళీ పాకిస్థాన్ వాళ్ళు ఆట్క ప్లాన్ చేస్తే మన వాళ్ళు ఎలా సమాధానం ఇచ్చారు అని ఆల్మోస్ట్ గాలిలో యుద్ధం చూపించారు. సెకండ్ హాఫ్ మొత్తం నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే ఆసక్తిగా తెరకెక్కించారు.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ని చాలా గొప్పగా చూపించారు. ఎయిర్ ఫోర్స్ వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు, షూటింగ్స్ కి వాళ్ళ లొకేషన్స్ లో పర్మిషన్స్ ఇవ్వడంతో సినిమాని చాలా రియాలిటీకి దగ్గరగా తీశారు. ప్రేక్షకులకి ఎయిర్ ఫోర్స్ గురించి చాలా విషయాలు తెలుస్తాయి ఈ సినిమాతో. టెక్నికల్ గా మాత్రం చాలా పర్ఫెక్ట్. ఈ సినిమాతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్, జెట్ ఫైటర్స్, రాడార్ సిస్టమ్స్, మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఎలా పనిచేస్తారు, గాలిలో యుద్ధ సీన్స్.. లాంటి చాలా ఆశయాలు సాధారణ ప్రజలకు కూడా వివరంగా అతేలుస్తాయి. ఇక సినిమా చాలా భాగం గాలిలో యుద్ధం సీన్స్ తో ఉంటుంది. గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటాయి ఆ సీన్స్.

Also Read : Operation Valentine : జస్ట్ ఇంత తక్కువ బడ్జెట్‌లో ఆ రేంజ్ విజువల్స్ తో సినిమానా?.. అద్భుతం చేస్తున్న ‘ఆపరేషన్ వాలెంటైన్’..

నటీనటులు..
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ రుద్రగా వరుణ్ తేజ్ అదరగొట్టాడని చెప్పొచ్చు. దేశభక్తి, ఆవేశం ఉన్న యువ పైలెట్ గా నటనలో అదరగొట్టాడు. పైలెట్ లో కూర్చొని గాలిలో యుద్ధం చేస్తున్నప్పుడు, జెట్ ఫ్లైట్ నడుపుతున్నప్పుడు కేవలం కళ్ళతోనే నటించాడు. ఇక మానుషీ చిల్లర్ కింద ఉండి రాడార్ సిగ్నల్స్ చూస్తూ పైలెట్స్ కి ఆదేశాలు జారీ చేసే ఆఫీసర్ గా బాగా నటించింది. మరో పక్క ప్రేమ సన్నివేశాల్లోను వీరు మెప్పించారు. దేశభక్తి సినిమా కావడంతో ఎక్కడా హద్దు మీరకుండా వీరి ప్రేమని, పనిని కలిపి అందంగా చూపించారు. నవదీప్, రుహాణి శర్మ, పరేష్ పహుజా పైలెట్స్ గా అదరగొట్టారు. శ్వేతా వర్మ, అలీ రాజా, శతాఫ్, సంపత్, అభినవ్ గోమఠం.. మిగిలిన నటీనటులంతా ఆమెప్పించారు.

సాంకేతిక అంశాలు..
ముఖ్యంగా ఈ సినిమా VFX గురించి చెప్పుకోవాలి. ఈ సినిమాని చాలా వరకు గ్రీన్ మ్యాట్ లోనే షూట్ చేశారు. గాలిలో జెట్ ఫైటర్ సీన్స్ అన్ని VFX తో అద్భుతంగా చూపించారు. ఎయిర్ బేస్ లొకేషన్స్ అన్ని అద్భుతంగా చూపించారు. సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. చాలా తక్కువ బడ్జెట్ లో ఈ రేంజ్ అవుట్ పుట్ ఇచ్చారంటే గ్రేట్ అని చెప్పొచ్చు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఇచ్చారు. గాలిలో జెట్ ఫైటర్స్ తిరుగుతున్న శబ్దాలని కూడా చాలా రియల్టీగా వినిపించారు. పాటలు మాత్రం పర్వాలేదనిపిస్తాయి. ఇక కథ మనందరికి తెలిసిందే. దానికి ప్రేమ, దేశం ఎమోషన్స్ మరిన్ని కలిపి చూపించారు. కథనం ఫస్ట్ హాఫ్ లో కాసేపు మాత్రం రుద్ర క్యారెక్టర్ గురించి చెప్పడానికి ముందుకి, వెనక్కి వెళ్తూ వస్తుంటుంది. సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే అయితే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. దర్శకుడిగా శక్తి ప్రతాప్ సింగ్ మొదటి సినిమాతోనే ఇలాంటి సబ్జెక్టుని తీసుకొని దాన్ని చక్కగా చూపించి సక్సెస్ అయ్యాడు.

మొత్తంగా ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమా పుల్వామా అటాక్, దానికి ఇండియా ఇచ్చిన కౌంటర్ అటాక్.. ఆధారంగా మన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సత్తా చూపిస్తూ తీసిన దేశభక్తి సినిమా. ఖచ్చితంగా ఈ సినిమాని థియేటర్స్ లో చూడాల్సిందే. ఈ చిత్రానికి 3 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

ట్రెండింగ్ వార్తలు