Veede Mana Varasudu : ‘వీడే మన వారసుడు’ మూవీ రివ్యూ..

వీడే మన వారసుడు సినిమా రైతుల సమస్యలను, గ్రామీణ బంధాలను చూపిస్తూ తెరకెక్కిన సినిమా.

Veede Mana Varasudu

Veede Mana Varasudu Movie Review : రమేష్ ఉప్పు హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా తెరకెక్కించిన సినిమా ‘వీడే మన వారసుడు’. ఈ సినిమా జూలై 18న థియేటర్స్ లో విడుదలైంది. లావణ్య రెడ్డి, సర్వాణి మోహన్, సమ్మెట గాంధీ, విజయ రంగరాజు, ఆనంద్ భారతి, గూడూరు కిషోర్.. పలువురు కీలక పాత్రలు పోషించారు.

కథ విషయానికొస్తే.. ఓ అపార్టుమెంట్‌లో వాచ్‌మన్‌గా పని చేస్తున్న రామన్న (రమేష్ ఉప్పు) మంచిగా ఉంటూ అందరి మన్ననలు పొందుతాడు. అపార్ట్‌మెంట్‌లోని కొంతమంది యువకులు డ్రగ్స్ వాడకంతో మృతిచెందుతారు. అయితే ఓ రౌడీ గ్యాంగ్ చనిపోయిన వారిపై అప్పులున్నాయంటూ శవాలను తీసుకెళ్లకుండా అడ్డుకుంటుంది. దాంతో వాచ్‌మన్ రామన్న ఆ రౌడీ గ్యాంగ్ ని కొట్టి వెళ్లిపోయేలా చేస్తాడు. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న రామన్న ఇలా వైలెంట్ అయ్యాడేంటి అని అంతా అనుకుంటారు. రామన్న ఫ్లాష్ బ్యాక్ లో కొండన్న (రమేష్ ఉప్పు) ఓ గ్రామంలో రైతుగా బతుకుతూ ఉంటాడు. తన మేనకోడలు (లావణ్యరెడ్డి)ని పెళ్లి చేసుకుంటాడు. కానీ వారికి పుట్టిన పిల్లలు మరణిస్తారు. రైతుగా అప్పులు పెరిగిపోతాయి. ఇదంతా చూసి కొండన్న తండ్రి అంకన్న (సమ్మెట గాంధీ), అతని భార్య( దేవసేన )తో కలసి ఆత్మహత్య చేసుకుంటాడు. అసలు కొండన్న సిటీకి వచ్చి రామన్నగా ఎందుకు మారాడు? రామన్నకు పిల్లలు పుట్టారా? రైతు అప్పులు తీరాయా తెలియాలంటే తెరపై చూడాల్సిందే..

Also Read : Fish Venkat Dies: టాలీవుడ్ లో విషాదం.. నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత

సినిమా విశ్లేష‌ణ‌.. సినిమాలో డ్రగ్స్‌తో యువ‌త నాశనమవ్వడం, మేన‌రికం పెళ్లిళ్ల‌తో వచ్చే సమస్యలు, ఇప్పటికి కూడా రైతులు ఎదుర్కుంటున్న కష్టాలు ముఖ్యంగా చూపించారు. అయితే కథ పరంగా ఇది రొటీన్ కథ. ఓ రైతు అప్పుల బాధలు, తన కష్టాలతో గ్రామం వదిలేసి సిటీకి రావడం, అక్కడ ఎలా బతికాడు అని రొటీన్ కథాంశంతో సాగింది. రైతుల సమస్యలతో పాటు కుటుంబ బంధాలు, గ్రామాల్లో ఉండే భావోద్వేగాలను చూపించారు.

నటీనటుల పర్ఫార్మెన్స్.. రమేష్ ఉప్పు ఓ పక్కన మెయిన్ లీడ్ లో నటిస్తూనే మరో పక్క దర్శకుడిగా, నిర్మాతగా కూడా కష్టపడ్డారు. యాక్షన్ సీక్వెన్స్‌లలో బాగా మెప్పించారు. హీరోయిన్ లావణ్య రెడ్డి సింపుల్ లుక్స్ లో కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. సర్వాణి మోహన్ కూడా తన పాత్రలో పర్వాలేదనిపించింది. సీనియర్ నటుడు సమ్మెట గాంధీ, దేవసేన తల్లితండ్రుల పాత్రలో ఎమోషన్ పండించారు. విజయ రంగరాజు, ఆనంద్ భారతి, గూడూరు కిషోర్, శిల్ప, సిద్ధు రాయల్, అద్వితేజ్ రెడ్డి.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.

Also Read : Pooja Hegde : అందరూ కోట్లల్లో తీసుకుంటే.. పూజా హెగ్డే లక్షల్లో.. మరీ అంత తక్కువా?

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ లో విలేజ్ ని బాగా చూపించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. పాటలు యావరేజ్. యాక్షన్ సీన్స్ బాగానే డిజైన్ చేసారు. రొటీన్ కథని రైతు సమస్యలు, ఎమోషన్స్ తో చెప్పే ప్రయత్నం చేసాడు దర్శకుడు. నిర్మాణ పరంగా ఈ సినిమాకు కావాల్సినంత ఖర్చుపెట్టారు.

మొత్తంగా వీడే మన వారసుడు సినిమా రైతుల సమస్యలను, గ్రామీణ బంధాలను చూపిస్తూ తెరకెక్కిన సినిమా. ఈ సినిమాకు 2 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.