Venkatesh : అసలైన ఫ్యామిలీ స్టార్.. విక్టరీ వెంకటేష్ బర్త్ డే స్పెషల్.. ఇప్పుడు మాత్రం మాస్, బోల్డ్ హీరో..

టాలీవుడ్ లో అందరి హీరోల అభిమానులు అభిమానించే హీరోల్లో వెంకటేష్ ఒకరు.

Victory Venkatesh Birthday Special A Complete Family Hero Turned Mass and Bold Acting

Venkatesh : నటులు అన్నాక అన్ని పాత్రలు చేస్తారు. హీరోలు కూడా అన్ని జానర్స్ లో అన్ని రకాల పాత్రలు చేసి అభిమానులని, ప్రేక్షకులని మెప్పించడానికి ప్రయత్నిస్తారు. హీరోలు అన్ని సినిమాల్లోనూ ఒకే రకమైన పాత్రలు చేస్తే చూసేవాళ్ళకి కూడా బోర్ కొడుతుంది. కానీ వెంకటేష్ ఫ్యామిలీ హీరోగా కెరీర్ లో సగం సినిమాలు చేసినా ఎవ్వరికి బోర్ కొట్టలేదు పైగా అందరికి ఫ్యామిలీ హీరోగా మరింత నచ్చేశాడు. టాలీవుడ్ లో అందరి హీరోల అభిమానులు అభిమానించే హీరోల్లో వెంకటేష్ ఒకరు.

కెరీర్ మొదట్లో మాస్ పాత్రలు చేసినా ఆ తర్వాత ప్రేమ కథా చిత్రాల్లోకి వచ్చేసాడు వెంకటేష్. ‘ప్రేమ’ సినిమాతో మొదలుపెట్టి ఆ తర్వాత ఎన్నో ప్రేమ కథలతో మెప్పించాడు వెంకటేష్. ఇక తెరపై అమాయక హీరో పాత్రలో కనిపించాలంటే వెంకటేష్ తర్వాతే. రాజా, చంటి లాంటి సినిమాల్లో సీన్స్ తో ప్రేక్షకులను కంటతడి పెట్టించాడు. ప్రేమించుకుందాం రా, ప్రేమంటే ఇదేరా, కలిసుందాంరా, నువ్వు నాకు నచ్చవు.. లాంటి యూత్ ఫుల్ లవ్ స్టోరీలతో మెప్పిస్తునే పవిత్రబంధం, సుందరకాండ, ఆడవారి మాటలకు అర్దాలే వేరులే.. లాంటి ఎమోషనల్ సినిమాలతో, మరో వైపు బొబ్బిలిరాజా, గణేష్, కొండపల్లి రాజా, తులసి, లక్ష్మి.. లాంటి మాస్ సినిమాలతో ప్రేక్షకులని మెప్పించారు. మధ్యమధ్యలో ఈనాడు, దృశ్యం.. లాంటి ప్రయోగాత్మక చిత్రాలు కూడా చేశారు.

కానీ ఎన్ని రకాల సినిమాలు చేసినా ప్రతి సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ చూడాలని ఉండేలా చేసి ఫ్యామిలీ హీరో అనిపించుకున్నాడు. ఇప్పుడు సీనియర్ హీరోగా కూడా ప్రతి సినిమాకి కొత్తగా ప్రయత్నిస్తున్నారు. F2, F3 లాంటి సినిమాల్లో ఫుల్ గా నవ్వించి, నారప్ప, గురు లాంటి సినిమాలతో మాస్ గా మారి, ఇటీవల రానా నాయుడు సిరీస్ తో ఎవ్వరూ ఊహించనంత బోల్డ్ గా చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు వెంకటేష్. ముద్దుగా అభిమానులు వెంకీ మామ అని పిలుచునే ఈ విక్టరీ స్టార్ ఇప్పుడు తన 75వ సినిమాతో రాబోతున్నారు.

శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ 75వ సినిమా సైంధవ్ జనవరి 13న సంక్రాంతికి రానుంది. ఈ సినిమాలో కూడా ఓ పక్క ఫ్యామిలీ పాత్ర పోషిస్తునే మరో పక్క మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు. టాలీవుడ్ లో అందరి హీరోలతో కలిసి సినిమాలు చేయడానికి రెడీగా ఉన్న ఏకైన హీరో వెంకటేష్ మాత్రమే. గతంలో అనేకసార్లు ఈ విషయం వెంకటేష్ చెప్పారు. వెంకీ మామ అంటే అభిమానులకు మాత్రమే కాదు ప్రేక్షకులకు, ఫ్యామిలీ ఆడియన్స్ కి, టాలీవుడ్ ప్రముఖులకు అందరికి ఇష్టమే.

Also Read : Pawan Kalyan : OG సినిమా అప్డేట్స్ కోసం చూడకండి.. DVV ప్రకటన.. ఎలక్షన్స్ ముందు పవన్ OG సినిమా లేనట్టేనా?

విక్టరీ వెంకటేష్ ఈ సంవత్సరం 63వ పడిలోకి అడుగుపెడుతున్నా ఇంకా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలు చేస్తున్నారు. ఈ 75 సినిమాల ప్రయాణం సెంచరీ కొట్టి ఆ పైన కూడా సాగాలని అందరూ కోరుకుంటున్నారు. ఇక నేడు వెంకీ మామ పుట్టిన రోజున అభిమానులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.