Vijay Antony Ajay Dhishan Maargan Movie Review and Rating
Maargan Movie Review : తమిళ్ స్టార్ విజయ్ ఆంటోని మెయిన్ లీడ్ లో నటిస్తూ నిర్మించిన సినిమా ‘మార్గన్’. లియో జాన్ పాల్ దర్శకత్వంలో విజయ్ ఆంటోని ఫిలింస్ కార్పొరేషన్ నిర్మాణంలో తెరకెక్కించారు. ఈ సినిమాతో విజయ్ యాంటోని మేనల్లుడు అజయ్ దిశాన్ నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. తెలుగులో ఈ సినిమాని సురేష్ బాబు రిలీజ్ చేసారు. మార్గన్ నేడు జూన్ 27న రిలీజయింది.
కథ విషయానికొస్తే.. హైదరాబాద్ లో రమ్య అనే అమ్మాయి చనిపోయి ఓ చెత్తకుప్పలో ఆమె శవం దొరుకుతుంది. ఆమె బాడీ అంతా నల్లగా మారిపోయి ఉంటుంది. ఈ హత్య గురించి ముంబైలో ఉండే పోలీసాఫీసర్ ధృవ్(విజయ్ యాంటోని) కి తెలిసి షాక్ అవుతాడు. కొన్నాళ్ల క్రితం ధృవ్ కూతురు కూడా అలాగే మర్డర్ అవుతుంది. దీంతో ధృవ్ హైదరాబాద్ వచ్చి ఆ కేసుని టేకప్ చేస్తాడు. ఈ కేసులో సీసీటీవీ, ఒక చైన్ లాకెట్, కొన్ని ఆధారాలతో అరవింద్(అజయ్ దిశాన్) ని పట్టుకొచ్చి విచారిస్తారు. అరవింద్ ఒక స్విమ్మర్. పార్ట్ టైం జాబ్స్ చేస్తూ గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతూ ఉంటాడు.
అరవింద్ లవర్ రమ్య(దీప్షిక) వదిలేసిన బాధలో ఉన్నాడని అతను చెప్పిన విషయాలతో, మరో క్లూ దొరకడంతో ఈ మర్డర్ చేసింది అరవింద్ కాదని తెలుస్తుంది. కానీ అరవింద్ నీళ్ళల్లో ఉండి ఓ ప్రక్రియ ద్వారా తాను ఉన్నప్పుడు జరిగిన సంఘటనల్లో ఎక్కడికైనా వెళ్లి చూసి ఏం జరిగిందో చెప్పగలడు. అది కేవలం అతను నీళ్ళల్లో ఊపిరి బిగపట్టినంత సేపు మాత్రమే. దీంతో ధృవ్ అరవింద్ హెల్ప్ తీసుకొని ఆ కిల్లర్ ని పట్టుకోవాలనుకుంటారు. అదే సమయంలో అరవింద్ చెల్లి(అర్చన) మిస్ అవుతుంది. మరో లేడీ డాక్టర్ కూడా ఇదే పద్దతిలో శరీరం నల్లగా మారిపోయి చనిపోయి చెత్తకుప్పలో కనిపిస్తుంది. మరి ఈ మర్డర్స్ అన్ని ఎవరు చేస్తున్నారు? అరవింద్ పోలీసులకు ఎలా హెల్ప్ చేసాడు? ధృవ్ కూతురు ఎలా చనిపోయింది? అసలు ఈ మర్డర్స్ అన్ని ఎందుకు చేస్తున్నారు? ఇదే పద్దతిలో ఎందుకు చేస్తున్నారు? అరవింద్ చెల్లి దొరికిందా? తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Kannappa : ‘కన్నప్ప’ మూవీ రివ్యూ.. భక్తితో కన్నీళ్లు పెట్టించారుగా.. మంచు విష్ణు – ప్రభాస్ కాంబో..
సినిమా విశ్లేషణ.. చాలా ఫాస్ట్ గా సినిమాలు తీసే హీరోలలో విజయ్ యాంటోని ఒకరు. తక్కువ సమయంలో తక్కువ బడ్జెట్ లో మంచి సినిమాలు తీసి ప్రేక్షకులను మెప్పిస్తాడు. ఈ క్రమంలోనే మార్గన్ అనే మరో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ తో వచ్చాడు. ఫస్ట్ హాఫ్ అంతా ఒక మర్డర్ జరగడం ఆ హంతకుడు ఎవరో పోలీసులు వెతకడం, అరవింద్ మీద అనుమానంతోనే సాగుతుంది. ఇతను హంతకుడు కాదు అని తెలియడంతో ఈ మర్డర్స్ ఎవరు చేస్తున్నారు అనే ఆసక్తి నెలకొంటుంది. సెకండ్ హాఫ్ లో అరవింద్ ఇచ్చిన క్లూలతోనే పోలీసులు విచారణ చేపట్టడంతో మర్డర్ చేసేవాళ్ళని ఎలా పట్టుకుంటారు అని సస్పెన్స్ తో బాగా నడిపించారు. సాధారణంగా ఇలాంటి మర్డర్ మిస్టరీలలో హంతకుడు ఇతను కాపోతే అతను అని కొన్ని గెస్ లు చేయొచ్చు. కానీ ఈ సినిమాలో విలన్ ఎవరో అసలు చివరి వరకు కనిపెట్టలేరు.
విలన్ ని పోలీసులు కనిపిట్టి అది ధృవ్ కూతురి మర్డర్ కి కనెక్ట్ చేయడం బాగా రాసుకున్నారు. అయితే అరవింద్ నీళ్ళల్లో ఉండి ప్రపంచాన్ని చూడొచ్చు అని చూపించిన విద్యల గురించి క్లారిటీ ఇవ్వలేదు. చాలా సినిమాల్లో మాయలు, మంత్రాలు చూపిస్తారు కానీ అవి ఎక్కడో పురాణాల్లోనో ఉన్నట్టు కనీసం చెప్తారు. ఇక్కడ అరవింద్ చేసేది నమ్మడానికి కనీసం ఎలాంటి ఉదాహరణ, పురాణాలు, మంత్రాలు లాంటివి సరిగ్గా చూపించలేకపోయారు. తాబేళ్లతో అరవింద్ ప్రత్యేక బంధం ఉన్నట్టు చూపిస్తారు కానీ అది ఎందుకు? ఎలా అని చూపించలేదు. అరవింద్ తండ్రి గురించి, ఆయన విద్యల గురించి, నీళ్ల గురించి ఏదో చెప్తారని మొదట్నుంచి బిల్డప్ ఇస్తారు కానీ అదేంటో చెప్పకుండానే వదిలేసారు. ఇక చివర్లో ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. ఆ మెసేజ్ ఏంటో తెలిస్తే సినిమా కథ లీక్ అయినట్టే కాబట్టి తెరపై చూసేయండి.
నటీనటుల పర్ఫార్మెన్స్.. విజయ్ యాంటోని ఎప్పట్లాగే థ్రిల్లర్ సినిమాలో తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. విజయ్ మేనల్లుడిగా అజయ్ దిశాన్ మొదటి సినిమా అయినా చాలా బాగా నటించాడు. ఈ సినిమాలో నీళ్ళల్లో ఉండే సీన్స్ కోసం, స్విమ్మింగ్ కోసం చాలా కష్టపడి ప్రాక్టీస్ చేసినట్టు తెలుస్తుంది. దీప్షిక క్యూట్ గా ఓ చిన్న పాత్రలో మెరిపించింది. బ్రిగిడ సాగా పోలీస్ పాత్రలో మెప్పించింది. సముద్రఖని గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు. హత్యలు చేసే పాత్రలో నటించిన వాళ్ళ నటనని మెచ్చుకోక తప్పదు. అర్చన, రామచంద్ర, వినోద్ సాగర్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
Also Read : Kannappa : ‘కన్నప్ప’ ట్విట్టర్ రివ్యూ.. మంచు విష్ణు సినిమా గురించి ఆడియన్స్ ఏమంటున్నారు?
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. థ్రిల్లర్ కి తగ్గ మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. తెలుగు డబ్బింగ్ కూడా బాగా కుదిరింది. ఒక కొత్త మెసేజ్ ని తీసుకొని దాని చుట్టూ రాసుకున్న సస్పెన్స్ స్క్రీన్ ప్లే థ్రిల్లర్ బాగున్నా అరవింద్ పాత్రని ఇంకా డీటైల్డ్ గా రాసుకోవాల్సింది. తమిళ్ స్టార్ ఎడిటర్ లియో జాన్ పాల్ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తూనే మంచి థ్రిల్లర్ ని బాగానే తెరకెక్కించాడు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు కావాల్సినంత బాగానే ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘మార్గన్’ ఒక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ తో సాగి ఒక మంచి మెసేజ్ ఇచ్చిన సినిమా. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.