Family Star Review : ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ రివ్యూ.. ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించిందా?

ఫ్యామిలీ స్టార్ సినిమా ఫ్యామిలీ వ్యాల్యూస్ చెప్తూ ఓ ప్రేమకథని నడిపించారు.

Vijay Deverakonda Mrunal Thakur Family Star Movie Review and Rating

Family Star Review : విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) జంటగా పరుశురాం దర్శకత్వంలో దిల్ రాజు(Dil Raju) నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘ఫ్యామిలీ స్టార్’. ఈ సినిమా నేడు ఏప్రిల్ 5న థియేటర్స్ లోకి వచ్చింది. టీజర్, సాంగ్స్, ట్రైలర్స్ తో సినిమాపై ముందు నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. ఇక దిల్ రాజు అంటేనే ఫ్యామిలీ సినిమాలకు పెట్టింది పేరు. చాలా రోజుల తర్వాత దిల్ రాజు నుంచి ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వస్తుందని బాగానే ఈ సినిమాని ప్రమోట్ చేశారు.

కథ విషయానికొస్తే.. గోవర్ధన్(విజయ్ దేవరకొండ) ఓ మిడిల్ క్లాస్ వ్యక్తి. సివిల్ ఇంజనీర్ గా జాబ్ చేస్తూ తన పెద్ద ఫ్యామిలీని పోషిస్తూ ఉంటాడు. ఇంట్లో బామ్మ, ఇద్దరు అన్నలు, వదినలు , పిల్లలు.. ఓ ఉమ్మడి కుటుంబంలా ఉన్నా ఓ అన్నయ్య(రవి ప్రకాష్) తాగుడికి బానిసై, ఓ అన్నయ్య(రాజా) బిజినెస్ కోసం ట్రై చేస్తుండటంతో బాధ్యతలు అన్ని గోవర్ధన్ పై పడతాయి. అలాంటి ఓ మిడిల్ క్లాస్ జీవితంలోకి ఇందు(మృణాల్ ఠాకూర్) వాళ్ళింట్లో పెంట్ హౌస్ లోకి ఓ స్టూడెంట్ అని రెంట్ కి వస్తుంది. ఇందు గోవర్ధన్ ఫ్యామిలీలో ఒక మెంబర్ లా కలిసిపోతుంది. గోవర్దన్ కి కూడా నచ్చడం, అతనికి సపోర్ట్ ఉండటంతో ప్రేమలో పడిపోతాడు.

అయితే ఇందు ఓ మిడిల్ క్లాస్ వ్యక్తి జీవితం మీద థీసిస్ రాయడానికి ఇతని లైఫ్ లోకి వచ్చిందని, గోవర్ధన్ లైఫ్ ని, అతని ఫ్యామిలీని తక్కువ చేసి ఓ పుస్తకం రాసిందని తెలుస్తుంది. తన ప్రేమ విషయం చెప్పాలనుకునే గోవర్ధన్ కి ఈ విషయం తెలియడంతో ఇందు మీద అరిచి గొడవ పెట్టుకుంటాడు. లైఫ్ లో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని గతంలో తనకి ఆఫర్ ఇచ్చిన కంపెనీకి వెళ్లి జాబ్ తెచ్చుకొని అడ్వాన్స్ శాలరీ కూడా తెచ్చుకుంటాడు. కానీ అంతలో ఆ కంపెనీ ఓనర్(జగపతిబాబు) కూతురే ఇందు అని తెలియడంతో షాక్ అవుతాడు. ఆ తర్వాత మరి జాబ్ కంటిన్యూ చేస్తాడా? ఇందు – గోవర్ధన్ ల గొడవ ఏమైంది? ఇందు ఆ బుక్ ఎందుకు రాసింది? అసలు గోవర్ధన్ వాళ్ళ అన్న ఎందుకు తాగుడికి బానిస అయ్యాడు? కథలో ఫ్యామిలీ గొప్పతనం ఎలా చెప్పాడు అంటే తెరపై చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ.. ఫ్యామిలీ స్టార్ సినిమాని ముందు నుంచి కూడా లవ్, ఫ్యామిలీ అంశాలు ఉంటాయని చెప్పి ప్రమోట్ చేశారు. చెప్పినట్టే కథ, కథనం పరంగా పూర్తిగా లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గానే ఉంది సినిమా. ఫస్ట్ హాఫ్ గోవర్ధన్ లైఫ్ స్టోరీ, ఇందు గోవర్ధన్ లైఫ్ లోకి రావడం, ఆ కుటుంబంతో ఇందు ప్రయాణం, ఇందు బుక్ రాసిందని గోవర్ధన్ కి తెలిసి గొడవ పడటం.. అంటూ సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చిన జాబ్ చేయడానికి, లైఫ్ లో ఎదగడానికి గోవర్ధన్ ఏం చేసాడు? ఇందు -గోవర్ధన్ మధ్య ప్రయాణం ఎలా సాగింది అన్నట్టు సాగుతుంది.

అయితే సినిమాలో సాగదీత కొంచెం ఎక్కువే ఉందని చెప్పొచ్చు. కొన్ని చోట్ల బోరింగ్ గా సాగుతుంది. కొన్ని లాజిక్ లెస్ సీన్స్ కూడా ఉన్నాయి. సినిమాల్లో లాజిక్ వెతక్కూడదు కానీ ఈ సినిమాలో ఆల్రెడీ రెండు సంవత్సరాల శాలరీ అడ్వాన్స్ తీసుకొని, మళ్ళీ శాలరీ తక్కువ పడిందని డబ్బులు అడగటం.. లాంటి కొన్ని సీన్స్ మాత్రం లాజిక్ కి అర్ధం కావు. ఫ్యామిలీ స్టార్ సినిమాలో ఫ్యామిలీ గురించి, భారతీయ కుటుంబ వ్యవస్థ గురించి మాత్రం చాలా గొప్పగా చెప్పారు. ఓ పక్క ఫ్యామిలీ ఆడియన్స్ కోసం కథని నడిపిస్తునే మరో పక్క యూత్ కోసం విజయ్ – మృణాల్ మధ్య సన్నివేశాలని బాగానే తీర్చిదిద్దారు. ఇక విజయ్ సినిమాలంటే లిప్ కిస్ సీన్స్ ఉంటాయి అనే కామెంట్స్ ని మరోసారి నిజం చేసాడు విజయ్. ఇక తెలంగాణ యాసలోనే సినిమా మొత్తం నడిపించారు. కానీ అందరికి ఆ యాస సెట్ అవ్వలేదు.

Also Read : Family Star : విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. పబ్లిక్ టాక్ ఏంటి..?

నటీనటుల విషయానికొస్తే.. విజయ్ దేవరకొండ ఒక మిడిల్ క్లాస్ బాధ్యత గల యువకుడిగా, లైఫ్ లో ఎదగాలి అని కసి ఉన్న కుర్రాడిగా పర్ఫెక్ట్ గా నటించాడు. మృణాల్ ఠాకూర్ తన ప్రతి సినిమాతోనూ తెలుగు ప్రేక్షకులని మెప్పిస్తుంది. ఫ్యామిలీ స్టార్ లో కూడా ఇందు పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. అభినయ, వాసుకి.. విజయ్ వదిన పాత్రల్లో మెప్పించారు. బామ్మ పాత్రలో రోహిణి మాత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమా తర్వాత ఆ రేంజ్ లో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ తో మెప్పించింది. ఆఫీస్ లో విజయ్ కి లైన్ వేసే అమ్మాయిగా హీరోయిన్ దివ్యంశ కౌశిక్ కొన్ని సీన్స్ లో మెప్పిస్తుంది. తాగుడికి బానిసైన అన్నగా రవిప్రకాష్, ఫ్రెండ్ పాత్రలో ప్రభాస్ శీను, అజయ్ ఘోష్, వెన్నెల కిషోర్, జగపతిబాబు.. మిగిలిన పాత్రలన్నీ ఓకే అనిపిస్తాయి.

సాంకేతిక అంశాలు.. ఫ్యామిలీ స్టార్ సినిమాటోగ్రఫీ విజువల్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇండియాలోని టాప్ కెమెరామెన్ లలో ఒకరైన KU మోహనన్ ఈ సినిమాకి వర్క్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంటుంది. సాంగ్స్ పరంగా మాత్రం ఓ రెండు పాటలు తప్ప మిగిలినవి ఏవి అంతగా కనెక్ట్ అవ్వవు. కథ ఓ కొత్త కాన్సెప్ట్ తీసుకున్నాడని చెప్పొచ్చు. కానీ కథనం మాత్రం పాతదే. దర్శకుడిగా పరుశురాం ఆల్రెడీ సక్సెస్ ఫుల్ డైరెక్టర్. ఇక దిల్ రాజు సినిమాలు అంటే నిర్మాణ విలువలు బాగానే ఖర్చుపెడతారని తెలిసిందే. డైలాగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. సినిమాలో ఫ్యామిలీకి సంబంధించి రాసిన ప్రతి డైలాగ్ బాగుంటుంది.

మొత్తంగా ఫ్యామిలీ స్టార్ సినిమా ఫ్యామిలీ వ్యాల్యూస్ చెప్తూ ఓ ప్రేమకథని నడిపించారు. ఇది కచ్చితంగా ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చూడాల్సిన సినిమానే. ఈ సినిమాకు రేటింగ్ 2.75 ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

ట్రెండింగ్ వార్తలు