Site icon 10TV Telugu

Ace : విజయ్ సేతుపతి ‘ఏస్’ మూవీ రివ్యూ.. కామెడీ థ్రిల్లర్..

Vijay Sethupathi Rukmini Vasanth Yogi Babu Ace Movie Review and Rating

Vijay Sethupathi Rukmini Vasanth Yogi Babu Ace Movie Review and Rating

Ace Movie Review : విజయ్ సేతుపతి, రుక్మిణి వసంత్ జంటగా దివ్య పిళ్ళై, బబ్లూ పృథ్వీరాజ్, యోగిబాబు, అవినాష్.. పలువురు కీలక పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘ఏస్’. 7CS ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అరుముగ కుమార్ దర్శక నిర్మాణంలో ఈ సినిమా నిర్మించారు. తెలుగులో ఈ సినిమాని శ్రీమతి పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్ పై నిర్మాత బి.శివ ప్రసాద్ రిలీజ్ చేసారు. ఏస్ సినిమా నేడు మే 23న తెలుగు – తమిళ్ భాషల్లో ఒకేసారి విడుదల అయింది.

కథ విషయానికొస్తే.. బోల్డ్ కాశీ(విజయ్ సేతుపతి) తన పాత జీవితం వదిలేసి కొత్తగా బతకాలని మలేషియా వస్తాడు. అక్కడ జ్ఞానానందం(యోగిబాబు) అతని ఊరినుంచి వచ్చిన వ్యక్తి ఇతనే అనుకోని బోల్డ్ కాశీని తీసుకెళ్లి కల్పన(దివ్య పిళ్ళై) రెస్టారెంట్ లో పని ఇప్పిస్తాడు. కల్పన రెస్టారెంట్ ఇబ్బందుల్లో ఉంటుంది. డబ్బులు కట్టకపోతే రెస్టారెంట్ జప్తు చేసుకుంటామని టైం ఇస్తారు. ఈ క్రమంలో బోల్డ్ కాశీకి రుక్కు(రుక్మిణి వసంత్)పరిచయం అయి ప్రేమలో పడతారు. రుక్మిణి సేల్స్ చేయకపోతే జాబ్ పోతుందని తెల్సి అక్కడ లోకల్ గ్యాంగ్ స్టర్ ధర్మ(అవినాష్) దగ్గర పేకాటలో డబ్బు కోసం ఒక గేమ్ ఆడతాడు కాశీ. వరుసగా గెలుస్తూ కాశీ డబ్బులు గెలవడంతో ధర్మ మోసం చేసి అతన్ని ఓడించి వారం రోజుల్లో డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరిస్తాడు.

మరోవైపు రుక్కు సవతి తండ్రి పోలీస్ రాజదొరై(బబ్లూ పృథ్వీరాజ్) రుక్కుని ఇబ్బందిపెడతాడు. అతనికి డబ్బులు ఇచ్చి రుక్కు తన ఇంటిని విడిపించుకోవాలనుకుంటుంది. ఇన్ని సమస్యలకు డబ్బులే కావాలి అని కాశీ స్కెచ్ వేసి ఓ బ్యాంక్ కి డబ్బులు తీసుకెళ్తున్న వ్యాన్ నుంచి దొంగతనం చేస్తాడు. ఎవరికీ తెలియకుండా చేసి తప్పించుకున్నా రాజదొరైకి తెలిసిపోతుంది. మరి పోలీసులు బోల్డ్ కాశీని పట్టుకున్నారా? ధర్మకి డబ్బులు కట్టారా? రాజదొరై నుంచి రుక్కు తన ఇంటిని విడిపించుకుందా? ఈ సమస్యలన్నిటినీ కాశీ ఎలా తీర్చాడు? పోలీసుల నుంచి కాశీ ఎలా తప్పించుకున్నాడు? రాజదొరైకి ఎలా తెలిసింది? ఈ దొంగతనం కేసు ఎలా క్లోజ్ అయింది? బోల్డ్ కాశీ తమ ఊరివాడు కాదని జ్ఞానానందంకి ఎప్పుడు తెలుస్తుంది? అసలు బోల్డ్ కాశీ ఎవరు.. తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also See : Anasuya Bharadwaj : అనసూయ పెద్ద కుమారుడికి ఉపనయనం.. ఫొటోలు వైరల్..

సినిమా విశ్లేషణ.. విజయ్ సేతుపతి సినిమాలు అంటే తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి అంచనాలు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో ఏస్ సినిమాకి విజయ్ సేతుపతి ఇక్కడికి వచ్చి మరీ ప్రమోట్ చేయడంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. ఫస్ట్ హాఫ్ బోల్డ్ కాశీ మలేషియా రావడం, జ్ఞానానందంతో కామెడీ, రుక్మిణితో కాశీ ప్రేమలో పడటం, కల్పన రెస్టారెంట్ సమస్య, ధర్మ దగ్గర ఇరుక్కోవడం లాంటి సీన్స్ అన్ని అక్కడక్కడా నిదానంగా, సింపుల్ గా సాగిపోతాయి. హీరో దొంగతనం చేద్దామని ప్లాన్ చేసిన దగ్గరనుంచి సినిమా ఆసక్తిగా సాగుతుంది. సెకండ్ హాఫ్ అంతా ఈ దొంగతనం నుంచి ఎలా బయటపడ్డారు, అందరి సమస్యలు ఎలా తీర్చాడు అని థ్రిల్లింగ్ గా సాగుతూనే యోగిబాబు పాత్రతో కామెడీ పండించారు.

కొత్త కథ ఆసక్తిగా రాసుకున్నా రెగ్యులర్ కథనంతోనే సినిమాని కామెడీ థ్రిల్లర్ లా నడిపించారు. అయితే బోల్డ్ కాశీ పాత్రకు ఫ్లాష్ బ్యాక్ ఏదో ఉంది అనేలా మొదట్నుంచి బిల్డప్ ఇచ్చినా అదేంటి అనేది మాత్రం చూపించలేదు. దానికోసం పార్ట్ 2 ప్లాన్ చేస్తారేమో. ధర్మ డెన్ లో హీరో పేకాట ఆడే సీన్స్, దొంగతనం ప్లానింగ్ సీన్స్, క్లైమాక్స్ లో అన్ని సమస్యల నుంచి ఒకేసారి అందరూ బయటపడేలా సీన్స్ చాలా బాగా ఆసక్తిగా రాసుకున్నారు. మరోసారి విజయ్ సేతుపతి తన సినిమాతో మెప్పించాడనే చెప్పొచ్చు. అయితే సినిమా విజువల్స్, నటీనటుల లుక్స్ చూస్తే ఇది కొన్నేళ్ల క్రితం సినిమా, ఆలస్యంగా రిలీజ్ అయిందేమో అనే సందేహం రాకమానదు.

నటీనటుల పర్ఫార్మెన్స్.. విజయ్ సేతుపతి సైలెంట్ గా ఉంటూనే ప్లాన్స్ వేస్తూ డార్క్ కామెడీతో నవ్విస్తూ మెప్పించాడు. యోగిబాబు పాత్ర ఎప్పట్లాగే ఫుల్ గా నవ్విస్తుంది. దివ్య పిళ్ళై తన పాత్రలో పర్వాలేదనిపిస్తుంది. రుక్మిణి వసంత్ క్యూట్ గా అలరిస్తూనే ఎమోషనల్ సీన్స్ లో మెప్పిస్తుంది. అవినాష్, బబ్లూ పృథ్వీరాజ్ నెగిటివ్ పాత్రల్లో పర్ఫెక్ట్ సెట్ అయ్యారు. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపిస్తారు.

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ ఓకే అనిపిస్తాయి. సినిమా అంతా మలేషియాలోనే తీశారు. మలేషియా రియల్ లొకేషన్స్ అన్ని బాగా సెట్ అయ్యాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపించినా పాటలు బాగున్నాయి. డైరెక్టర్ కాస్త కొత్త పాయింట్ తీసుకొని పాత సీన్స్ తో రెగ్యులర్ కథాంశంతో కామెడీ పండిస్తూనే థ్రిల్లింగ్ గా తెరకెక్కించాడు. నిర్మాణ పరంగా కూడా సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది.

Also Read : NTR Properties : వామ్మో ఎన్టీఆర్ కి ఇన్ని వందల కోట్ల ఆస్తులున్నాయా? ప్రైవేట్ జెట్ కూడా? ఎన్టీఆర్ మీద బాలీవుడ్ మీడియా వార్తలు..

మొత్తంగా ‘ఏస్’ సినిమా కొత్త జీవితం మొదలుపెట్టిన హీరో తనకు కావాల్సిన వాళ్ళ సమస్యలు తీర్చడానికి దొంగతనం చేస్తే ఎలా తప్పించుకున్నాడు? ఆ సమస్యలు ఎలా తీర్చాడు అని కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

Exit mobile version