The GOAT : ‘ది గోట్'(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)మూవీ రివ్యూ.. విజయ్ చివరి సినిమా ఎలా ఉంది?

విజయ్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అవ్వడంతో ఇదే విజయ్ లాస్ట్ సినిమా అని ప్రచారం జరగడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

The GOAT : ‘ది గోట్'(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)మూవీ రివ్యూ.. విజయ్ చివరి సినిమా ఎలా ఉంది?

Vijay The Greatest of All Time Movie Review and Rating

The GOAT Movie Review : తమిళ్ స్టార్ హీరో విజయ్ ‘The Goat’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) అనే సినిమాతో నేడు సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణంలో కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ నిర్మాతలుగా ఈ సినిమా తెరకెక్కింది. స్నేహ, మీనాక్షి చౌదరి, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా, వైభవ్, అజ్మీర్, జయరాం.. ఇలా పలువురు స్టార్స్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో నటించడం, విజయ్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అవ్వడంతో ఇదే విజయ్ లాస్ట్ సినిమా అని ప్రచారం జరగడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

కథ విషయానికొస్తే.. గాంధీ(విజయ్) తన టీమ్ సునీల్ ( ప్రశాంత్), అజయ్ (అజ్మల్), కళ్యాణ్ సుందరం (ప్రభుదేవా)తో కలిసి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ గా స్పెషల్ మిషన్స్ చేస్తూ ఉంటాడు. ఈ విషయం వాళ్ళ ఇళ్లల్లో కూడా తెలీదు. అనుకోకుండా థాయిలాండ్ లో జరిగే ఓ మిషన్ కి గాంధీ కడుపుతో ఉన్న తన భార్య(స్నేహ), కొడుకుని తీసుకెళ్లాల్సి వస్తుంది. ఆ సమయంలో అటాక్ జరగడం, తన భార్యకి తనేం చేస్తాడో తెలియడం, తన కొడుకు తప్పిపోవడం జరుగుతాయి. అయితే తన కొడుకు ఒక యాక్సిడెంట్ లో చనిపోయాడని అందరూ అనుకుంటారు. దీంతో ఆ ఫీల్డ్ కి దూరమయి, భార్య, కూతురుకు దూరమయి బతుకుతుంటాడు గాంధీ.

16 ఏళ్ళ తర్వాత జాబ్ పర్పస్ రష్యా వెళ్లాల్సి వస్తుంది. అక్కడ చిన్నప్పుడు చనిపోయాడు అనుకున్న తన కొడుకుని కలుస్తాడు. చిన్నప్పుడు చనిపోయిన కొడుకు జీవన్(విజయ్) మళ్ళీ ఎలా తిరిగి వచ్చాడు? గాంధీ మళ్ళీ డ్యూటీలోకి వస్తాడా? గతంలో తను చేసిన మిషన్ లో చనిపోకుండా మిగిలిన ఓ వ్యక్తి గాంధీ పై ఎలా రివెంజ్ తీర్చుకోడానికి వస్తాడు? జీవన్ తిరిగొచ్చాక గాంధీ లైఫ్ లో ఎలాంటి మార్పులు వచ్చాయి తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : HIT 3 : ‘హిట్‌-3’ నుంచి సాలీడ్ అప్‌డేట్‌.. అర్జున్ స‌ర్కార్‌ను చూశారా..?

సినిమా విశ్లేషణ.. చిన్నప్పుడు హీరో కొడుకు తప్పిపోయి విలన్ దగ్గర పెరిగి హీరో మీదకే రావడం గతంలో పలు సినిమాలు చూసాం. ఇది కూడా అదే కథ కానీ సీక్రెట్ మిషన్స్ నేపథ్యంలో కథనం చూపించారు. సినిమాలో డిఫరెంట్ స్క్రీన్ ప్లేకి అవకాశం ఉన్నా కథ ఒకే లైన్ లో వెళ్తుంది. ఫస్ట్ హాఫ్ గాంధీ గురించి, గాంధీ చుట్టూ పక్కల పాత్రలు ఎస్టాబ్లిష్ చేయడం, కొడుకు తప్పిపోవడం పెద్దయ్యాక కొడుకు మళ్ళీ తిరిగి రావడంతో సాగుతుంది. ఇంటర్వెల్ కి గాంధీ కొడుకే విలన్ అని ఆడియన్స్ కి తెలిసేలా చూపించినా ఇది ఆడియన్స్ ముందే పసిగడతారు. ఇక సెకండ్ హాఫ్ గాంధీ, జీవన్ మధ్యలో జరిగే సంఘటనలు ఎత్తుకుపైఎత్తు అన్నట్టు సాగుతాయి. గాంధీ తన కొడుకే విలన్ అని ఎలా కనిపెట్టాడు, ఏం చేసాడు అనేది కొంచెం ఆసక్తిగానే చూపించారు.

సినిమా నిడివి 3 గంటలు కావడంతో చాలా చోట్ల సినిమా సాగదీసినట్టు ఉంటుంది. అలాగే రెగ్యులర్ కథే కావడం, ట్విస్ట్ లు ముందే ఊహించడం జరుగుతుంది. సినిమాలో క్రికెట్ ఫ్యాన్స్ కి ముఖ్యంగా ధోని ఫ్యాన్స్ కి మాత్రం మంచి ఫీస్ట్ ఉంటుంది. తండ్రి కొడుకులు హీరో – విలన్ గా కొట్టుకోవడం చూసి బోలెడన్ని పాత సినిమాలు గుర్తుకు వస్తాయి. కొన్ని సీన్స్ తప్పితే విజయ్ ని ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ లో డీ ఏజింగ్ చేసి పర్వాలేదనిపించారు. క్లైమాక్స్ ఓ పక్క క్రికెట్, ఓ పక్క యాక్షన్ సీన్స్ కంపారిజాన్ చేస్తూ చూపించిన విధానం మాత్రం బాగుంటుంది.

నటీనటుల పర్ఫార్మెన్స్.. విజయ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి ఆఫీసర్ క్యారెక్టర్స్ లో విజయ్ అదరగొడతాడు. ఇప్పుడు రెండు పాత్రల్లోను మెప్పించాడు. కానీ కామెడీ, ఎమోషనల్ సీన్స్ లో విజయ్ ఎప్పుడు చేసే ఓవర్ యాక్టింగ్ తోనే కానిచ్చాడు. స్నేహ ఎమోషనల్ గా మెప్పిస్తుంది. మీనాక్షి చౌదరి ఓ పాటకి, కాసేపు కనిపించడానికే. ప్రభుదేవా, ప్రశాంత్, జయరాం, అజ్మీర్, వైభవ్, లైలా.. మిగిలిన నటీనటులంతా వారి పాత్రల్లో బాగానే మెప్పించారు.

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. యాక్షన్ కొరియోగ్రఫీ కూడా బాగా చేసారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ యువన్ శంకర్ రాజా బాగా ఇచ్చినా పాటలు మాత్రం వినడానికి కష్టమే. కథ, కథనం రెగ్యులర్. దర్శకుడిగా వెంకట్ ప్రభు ఇప్పటికే తన సినిమాలతో మెప్పించాడు. ఈ సినిమాలో కూడా డైరెక్టర్ గా సక్సెస్ అయ్యాడు. డీ ఏజింగ్ టెక్నిక్ గతంలో కొన్ని సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో బెటర్ అనుకోవచ్చు. నిర్మాణ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాకి బాగానే ఖర్చుపెట్టారు.

మొత్తంగా ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ తండ్రి కొడుకుల వార్. ఈ సినిమా విజయ్ ఫ్యాన్స్ కి మాత్రమే ఫీస్ట్. మిగిలిన వాళ్లకి సాగదీతే. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.