Vikram shared his bad memory at Ponniyin Selvan 2 promotions
Vikram : కోలీవుడ్ హీరో విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన విలక్షణమైన నటనతో భాషతో సంబంధం లేకుండా అందరి అభిమానాన్ని పొందాడు. ఇక సినిమాలోని తన పాత్ర కోసం ఎంతటి రిస్క్ అయినా చేస్తాడు. శంకర్ తెరకెక్కించిన ఐ సినిమాలో తన చూపించిన వేరియేషన్స్ కి ఎవరైనా సలాం అనాల్సిందే. సినిమా పలితాలతో సంబంధం లేకుండా ప్రయోగాలకు పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతుంటాడు. తాజాగా ఈ హీరో తన లైఫ్ జరిగిన ఒక చేదు అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నాడు.
తనకి 12 ఏళ్ల వయసు ఉన్న సమయంలో ఫ్రెండ్ తో కలిసి బైక్ పై వెళ్తుండగా యాక్సిడెంట్ అయ్యింది. ఆ ప్రమాదంలో తన కుడి కాలికి తీవ్ర గాయం అవ్వడంతో పాటు శరీరంపై ఎన్నో గాయాలు, పలు చోట్ల ఎముకలు విరగడం జరిగింది. కాలి లిగమెంట్లు దెబ్బ తినడంతో ఎన్ని రోజులు ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నా గాయం మాత్రం మానడం లేదు. దీంతో డాక్టర్.. విక్రమ్ తల్లికి కాలిని తీసేస్తే మంచిదని సలహా ఇచ్చాడట. కానీ విక్రమ్ మాత్రం తన ఆత్మ విశ్వాసాన్ని కోల్పోకుండా ధైర్యంగా పోరాడి గాయం నుంచి కోలుకుని బయట పడ్డాడు.
ఆ గాయం నుంచి కోలుకోడానికి దాదాపు 23 సర్జరీలు జరగడంతో పాటు మూడేళ్ల పాటు వీల్ ఛైర్ లోనే ఉండాల్సి వచ్చిందట. ఆ విషయాన్ని తను ఎప్పటికి మర్చిపోలేను అంటూ చెప్పుకొచ్చాడు. కాగా విక్రమ్ పొన్నియిన్ సెల్వన్ 2 (Ponniyin Selvan 2) సినిమాతో ఏప్రిల్ 28న ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమయ్యాడు. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ పార్ట్ గత ఏడాది రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అందుకుంది. మరి ఈ సీక్వెల్ ఎటువంటి విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి.