చిరంజీవి వల్లే ఫస్ట్ కారు కొన్నా అంటున్న ఆ విలన్ ఎవరంటే?

విలన్ సత్య ప్రకాష్‌ని అందరూ గుర్తు పడతారు. 500 వందల పైగా సినిమాల్లో ఆయన నెగెటివ్ రోల్స్ చేశారట. తాజాగా ఈ నటుడు తన ఫస్ట్ కారు కొన్న అనుభవాన్ని మీడియాతో షేర్ చేసుకున్నారు.

Satya Prakash

Satya Prakash : విలన్ క్యారెక్టర్లకి పెట్టింది పేరు సత్య ప్రకాష్. 11 భాషల్లో 500 పైగా సినిమాల్లో విలన్‌గా నటించారు. 1991 లో ‘జైత్రయాత్ర’ సినిమాతో మొదలైన ఆయన జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. రీసెంట్‌గా ఆయన మీడియాతో మాట్లాడారు. పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

కరడు కట్టిన విలన్ పాత్రలకు పేరు సత్య ప్రకాష్. జైత్రయాత్ర, పెళ్లి చేసుకుందాం, మాస్టర్, స్నేహితులు, నరసింహనాయుడు, సీతయ్య, పోకిరి, నమో వెంకటేశా, నేనే రాజు నేనే మంత్రి, ఆచార్య, మసూదా వంటి అనేక సినిమాల్లో నెగెటివ్ రోల్స్‌లో నటించారు. ఎక్కువగా రేప్ సీన్స్‌లో నటించిన సత్య ప్రకాష్‌కి ఆ సీన్స్‌లో చేయడం ఇబ్బందికరంగా ఉండేదట. కానీ సినిమా చేయడం అవసరం కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకోవాల్సి వచ్చేదని ఆయన చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి అంటే తనకు ఎంతో ఇష్టమని ఆయన వల్లే తన జీవితంలో మొట్ట మొదటి కారు కొనుక్కున్నానని చెప్పుకొచ్చారు సత్య ప్రకాష్.

Also Read: సినీ పరిశ్రమలో విషాదం.. ఇటీవలే రీఎంట్రీ ఇచ్చిన హీరో.. అంతలోనే తండ్రి మరణం..

సత్య ప్రకాష్ చిరంజీవి ‘బిగ్ బాస్’ సినిమా  టైమ్‌లో స్కూటర్ మీద షూటింగ్‌కి వస్తుండేవారట. అది గమనించిన చిరంజీవి ఒకసారి సత్య ప్రకాష్‌ని పిలిచి షూటింగ్‌కి ఎలా వస్తావని అడిగారట. స్కూటర్ మీద వస్తాను అని చెప్పగానే ‘హెల్మెట్ పెట్టుకుంటావా?’ అని అడిగారట. అందుకు సత్య ప్రకాష్ లేదని చెప్పడంతో ‘అలా అజాగ్రత్తగా ఉండటం తప్పు.. నువ్వు పెద్ద స్టార్ అవుతావు.. నువ్వు స్కూటర్ మీద హెల్మెట్ లేకుండా వెళ్లడం, రావడం చేస్తున్నప్పుడు బై ఛాన్స్ ఏదైనా ప్రమాదం జరిగితే మన ఇండస్ట్రీ నీ లాంటి ఒక మంచి స్టార్‌ని మిస్ అవుతుంది. నువ్వు నీ కెరియర్ మిస్ అవుతావు. నేను నీకు ఫండింగ్ చేస్తాను.. కారు కొనుక్కో’ అని చెప్పారట. అంతే బాపినీడు గారితో చెప్పి డబ్బులు అరేంజ్ చేయడం, సత్య ప్రకాష్ కారు కొనుక్కోవడం జరిగిపోయిందట. ఇప్పడు తన దగ్గర ఎన్ని కార్లు ఉన్నా.. అప్పుడు మెగాస్టార్ ద్వారా కొనుక్కున్న మొదటి కారు జ్ఞాపకం మాత్రం ఎప్పటికీ మర్చిపోనని చెప్పుకొచ్చారు సత్య ప్రకాష్.

Also Read: సౌందర్య బయోపిక్ చేయాలనుకుంటున్నా.. రష్మిక వ్యాఖ్యలు.. సౌందర్య బయోపిక్ వస్తుందా?