Rathnam Review : ‘రత్నం’ మూవీ రివ్యూ.. అమ్మలాంటి అమ్మాయి కోసం పోరాటం..

'రత్నం' సినిమా నేడు ఏప్రిల్ 26న తెలుగు, తమిళ్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఫుల్ లెంగ్త్ యాక్షన్ సినిమాగా రత్నం తెరకెక్కింది.

Rathnam Movie Review : యాక్షన్ హీరో విశాల్(Vishal) తాజాగా ‘రత్నం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జీ స్టూడియోస్‌, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్త నిర్మాణంలో కార్తికేయన్ సంతానం నిర్మాతగా యాక్షన్ డైరెక్టర్ హరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రత్నం’ సినిమా నేడు ఏప్రిల్ 26న తెలుగు, తమిళ్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఫుల్ లెంగ్త్ యాక్షన్ సినిమాగా రత్నం తెరకెక్కింది.

కథ విషయానికొస్తే.. కథ అంతా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ బోర్డర్ లో సాగుతుంది. రత్నం(విశాల్) తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు తమిళనాడులో ఓ ఆపద నుంచి తప్పించుకొని చిత్తూరు వచ్చి ఓ మార్కెట్ లో స్థిరపడుతోంది. రత్నం చిన్నప్పుడే తల్లిని కోల్పోతాడు. రత్నం చిన్నప్పుడే అక్కడ రౌడీగా ఉన్న పన్నీర్(సముద్రఖని)ని కాపాడటానికి వేరే వాళ్ళని చంపి జైలుకు వెళ్తాడు. దీంతో రత్నం పన్నీర్ ని మామయ్య అంటూ అతని దగ్గరే ఉంటాడు. పన్నీర్ ఎమ్మెల్యే అయ్యాక దందాలన్నీ రత్నం చూసుకుంటాడు.

ఈ క్రమంలో ఒకరోజు మల్లిక(ప్రియా భవాని శంకర్) ని రోడ్ మీద చూస్తాడు. తనని చంపడానికి మనుషులు వస్తే వాళ్ళ నుంచి మల్లికని కాపాడతాడు. మల్లిక అచ్చు తన అమ్మలానే ఉండటంతో ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాడు. మల్లికకు ఒక ల్యాండ్ సమస్య ఉంది, లింగం(మురళీశర్మ) మనుషులు ఆమెని చంపడానికి తిరుగుతున్నారు అని తెలుసుకొని ఆమెకు రక్షణగా ఉంటాడు. అసలు రత్నం తల్లి ఎవరు? ఆమె కథేంటి? మల్లికకు ఉన్న ల్యాండ్ సమస్య ఏంటి? లింగం మల్లికని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? లింగం – రత్నంలకు ఉన్న సంబంధం ఏంటి? పన్నీర్ రత్నంకి ఎలా అండగా నిలబడ్డాడు అనేవి తెరపై చూడాల్సిందే.

Also Read : The 100 Teaser : మరోసారి పోలీసుగా ఆర్కే నాయుడు.. జనసేనాని తల్లి చేతులు మీదుగా మూవీ టీజర్ లాంచ్..

సినిమా విశ్లేషణ.. సినిమా ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఉంటుంది. కొట్టుకోవడం, నరుక్కోవడం, ఫైట్స్, చేజింగ్స్.. సినిమాలో ఇవే సగం ఉంటాయి. ఇలాంటి కథలు గతంలో చాలా వచ్చాయి. ఒక అమ్మాయికి సమస్య, ఓ రౌడీ ఆమె కోసం నిలబడి విలన్స్ తో పోరాడతాడు. కథ పరంగా ఇంతే. కాకపోతే ఇందులో హీరోయిన్ అచ్చం హీరో తల్లిలాగే ఉండటం అనేది, హీరో తల్లి ఫ్లాష్ బ్యాక్ కొంచెం కొత్తగా ఉంటుంది. ఈ కథకు తమిళనాడు, ఆంద్ర బోర్డర్ లో రాసుకోవాల్సిన అవసరం లేదు. మరి ఎందుకు రాసుకున్నాడో డైరెక్టర్ కే తెలియాలి. హరి సినిమాలు అంటే సినిమా అంతా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. రత్నం సినిమా కూడా అంతే. మొదట్లో రత్నం తల్లి ఫేస్ చూపించకుండా హీరోయిన్ వచ్చాక చూపించడం కొంచెం ఆసక్తికరంగా ఉంటుంది. క్లైమాక్స్ ముందు ట్విస్ట్ బాగుంటుంది. కానీ క్లైమాక్స్ పర్ఫెక్ట్ గా ఇవ్వలేదు అనిపిస్తుంది. మిగిలిన కథనం అంతా రొటీన్ యాక్షన్ స్క్రీన్ ప్లేనే ఉంది. సినిమా అంతా సీరియస్ గా సాగినా యోగిబాబు మాత్రం అక్కడక్కడా నవ్వించాడు.

నటీనటుల పర్ఫార్మెన్స్ : విశాల్ ప్రతి సినిమాకి ప్రాణం పెట్టి పనిచేస్తాడు. యాక్షన్ సీన్స్ కూడా డూప్ లేకుండా చేస్తాడు. రత్నం సినిమాకి కూడా విశాల్ అంతే కష్టపడ్డాడు. ప్రియా భవాని శంకర్ ఆపదలో ఉన్న అమ్మాయిగా తన నటనతో మెప్పించింది. యోగిబాబు అక్కడక్కడా తన కామెడీతో నవ్విస్తాడు. సముద్రఖని ఎమ్మెల్యే పాత్రలో అదరగొట్టాడు. మురళి శర్మ విలన్ గా బాగా నటించారు. చివర్లో గౌతమ్ మీనన్ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చి మెప్పించారు. మిగిలిన నటీనటులు అంతా పాత్రకు తగ్గట్టు నటించి పర్వాలేదనిపించారు.

సాంకేతిక అంశాలు.. హరి సినిమాలు అంటే ముఖ్యంగా యాక్షన్ సీన్స్. ఈ సినిమాలో కూడా యాక్షన్ సీన్స్ అదిరిపోతాయి. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగానే ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చినా పాటలు మాత్రం జస్ట్ ఓకే అనిపిస్తాయి. కథ, కథనం రెండూ చాలా పాతవి. క్లైమాక్స్ ట్విస్ట్ ఒకటి బాగా రాసుకున్నారు. దర్శకుడిగా హరి ఆల్రెడీ సక్సెస్ ఫుల్ డైరెక్టర్.

మొత్తంగా ‘రత్నం’ సినిమా అమ్మలాగా ఉన్న ఓ అమ్మాయి కోసం హీరో చేసే పోరాటం. యాక్షన్, ఫైట్స్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు రత్నం సినిమా చూడొచ్చు. ఈ సినిమాకు 2.25 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

ట్రెండింగ్ వార్తలు