Big Boss 5 Telugu
Big Boss 5 Telugu: బిగ్ బాస్ ఐదవ సీజన్ ఎప్పుడు మొదలవుతుంది? ఈ ఏడాది అసలు అవుతుందా.. లేదా? అయితే హోస్ట్ ఎవరు.. కంటెస్టెంట్స్ ఎవరు.. చాలా రోజులుగా ఈ చర్చ జరుగుతూనే ఉంది. సాధారణంగా ప్రతి ఏడాది వేసవి కాలం ఎండింగ్ లో మొదలయ్యే ఈ షో గత ఏడాది కరోనా కారణంగా సెప్టెంబర్ మాసానికి వెళ్ళింది. దీంతో ఈ ఏడాది అసలు ఉంటుందా ఉండదా అనే చర్చ కూడా జరిగింది. అయితే.. ఒకనెల అటు ఇటూ అయినా బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభం కావడం మాత్రం పక్కా అంటున్నారు ఆ షో నిర్వాహకులు.
బిగ్ బాస్ సీజన్ 5 ఈ ఏడాదిలో జరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని గట్టిగా చెప్తున్నారు. అయితే ఎప్పటి నుంచి మొదలౌతుంది? కంటెస్టెంట్స్ ఎవరన్నదానిపైనే ఉత్కంఠ నెలకొంది. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 1.. 2017 జూలై 16న ప్రారంభం కాగా.. రెండో సీజన్ 2018 జూన్ 10న ప్రారంభమైంది. ఆ తరువాత మూడో సీజన్.. మళ్లీ జూలైకి వెళ్లగా ఇక నాలుగో సీజన్ 2020 సెప్టెంబర్ 21న ప్రారంభమైంది. గత ఏడాది కరోనా కారణంగా అసలు ఉంటుందా ఉండదా అని అనుమానాల మధ్య ఈ షో మొదలై గ్రాండ్ సక్సెస్ దక్కించుకుంది.
ఇక ఈ ఏడాది ఎప్పుడు మొదలవుతుంది అన్నది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పడుతోంది. ఒక్కొక్కటి లాక్ డౌన్ నుండి మినహాయింపులు పొందుతూ యధావిధిగా కార్యకలాపాలు మొదలవుతున్నాయి. త్వరలో షూటింగులు కూడా మొదలు పెట్టేందుకు మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ షూటింగ్ కూడా మొదలు పెట్టే సన్నాహాలు మొదలయ్యాయట. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియను జూమ్ ద్వారా పూర్తి చేసినట్టు తెలుస్తుండగా, బిగ్ బాస్ సెట్‌కి సంబంధించిన పనులు కూడా శరవేగంగా జరుగుతున్నట్టు తెలుస్తుంది.
ఈ సీజన్-5 సెట్ చాలా రిచ్‌గా రూపొందించనున్నారని చాలా కాలంగా ప్రచారం జరుగుతుండగా ఇప్పుడు అదే స్థాయిలోనే సన్నాహాలు జరుగుతున్నాయట. అన్నీ కుదిరితే జూలై, ఆగస్టులో అన్ని పనులన్నీ సిద్ధం చేసుకొని.. సెప్టెంబరులో షో మొదలు పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సీజన్ షో హోస్టుగా ఎవరు అవుతారన్నది కూడా ప్రేక్షకులలో ఆసక్తి కలిగించే అంశమే. కాగా మళ్లీ ఈ సీజన్ కు కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించనున్నారని తెలుస్తుంది.