జైపూర్ : సెల్ఫీ..సెల్ఫీ..సెల్ఫీ. ఈ పిచ్చితో పలువురు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ముఖ్యంగా యువతలో ఈ సెల్ఫీల మోజుతో కన్నవారికి కడుపుశోకం మిగులుస్తున్నారు. ఈక్రమంలో సెల్ఫీ తీసుకునేందుకు ఏకంగా రైలెక్కిన యువకుడు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.
ప్రమాదాలు ముంచుకొస్తున్నా..ప్రాణాలు పోతున్నా..యువత మాత్రం వారి నిర్లక్ష్యం చేస్తునే ఉన్నారు. రాజస్థాన్‌లోని సమ్మర్‌గంజ్ మండి రైల్వేస్టేషన్‌లో రాహుల్ అనే 16 సంవత్సరాల యువకుడు రైలెక్కి సెల్ఫీ దిగుతుండగా హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలి తీవ్ర గాయాలపాలయ్యాడు. హై టెన్షన్ వైర్ల తాకిడికి 70 శాతం కాలిన గాయాలతో రైల్వే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కానీ ఫలితం లేకపోవటం మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తరలించారు.
కాగా మే 1వ తేదీన హర్యానాలోని పానిపట్ లో రైలు పట్టాలపై ముగ్గురు యువకులు సెల్ఫీ దిగుతుండగా వారిని రైలు ఢీకొట్టడంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా 2011 -17 మధ్య కాలంలో సెల్ఫీలు దిగుతూ 259 మంది మృతి చెందినట్లు తేలింది. సెల్ఫీ మరణాలు ఇండియాలో అత్యధికంగా, ఆ తర్వాత రష్యా, అమెరికా, పాకిస్థాన్ దేశాలు ఉన్నాయని ఓ సర్వేలో తేలింది. దీంతో ఇండియాలో సెల్ఫీ పిచ్చి ఎంతగా ఉందో ఊహించుకోవచ్చు.