పక్కనోడు ఏమరుపాటుగా ఉంటే చాలు వాడి జేబులో సొమ్ములు కాజేసే మాయగాళ్లు ఉన్న కాలం ఇది. సిటీ బస్సుల్లో ప్రయాణించేటప్పుడో, రైల్వే స్టేషన్ వద్ద రద్దీలో నగలు, పర్సులు, హ్యాండ్ బ్యాగ్ లు పోగోట్టుకుని లబోదిబోమనేవాళ్లు ఎంతమందో ఉన్నారు. కానీ రోడ్డుపై దొరికిన రూ. 7.5 లక్షల విలువైన బంగారాన్ని పోలీసులకు అప్పచెప్పి తమ నిజాయితీని చాటుకుని పలువురికి ఆదర్శంగా నిలిచారు పూణేలోని ఇద్దరు ఆటోరిక్షా డ్రైవర్లు.
మహారాష్ట్రలోని పూణే రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం, మార్చి8న, బేరాలు కోసం ఎదురు చూస్తున్న అతుల్ తిలేకర్, భారత్ భోసలే అనే ఆటో డ్రైవర్లకు పార్కింగ్ బూత్ వద్ద ఒక బ్యాగు కనపడింది. దాన్ని తెరిచి చూస్తే దానిలో ఏడున్నరలక్షల రూపాయలు విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయి. వెంటనే వారిద్దరూ దాన్ని తీసుకువెళ్లి రైల్వే పోలీసులకు అందచేశారు. కొద్దిసేపటి తర్వాత బ్యాగు పోగొట్టుకున్న బాధితుడు దీపక్ చిత్రాల తన బ్యాగు కనపించటంలేదని పోలీసులకు ఫిర్యాదు చేయటానికి పోలీసు స్టేషన్ కు వచ్చాడు.
అప్పటికే పోలీసుల వద్దకు చేరిన బ్యాగుతో బాధితుడు చెప్పిన ఆనవాలు సరిపోవటంతో పోలీసులు బ్యాగును తిరిగి దీపక్ కు అందచేశామని ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ ఎస్ ఆర్ గౌడ్ చెప్పారు. విలువైన బంగారం ఉన్న బ్యాగును పోలీసులకు అప్పచెప్పిన ఆటోడ్రైవర్ల నిజాయితీకి మెచ్చి బాధితుడు వారికి బహుమతి ఇవ్వబోయాడు. కానీ ఆటో డ్రైవర్లు ఆ బహుమతిని సున్నితంగా తిరస్కరించారు.
See Also | తెలంగాణలో ఎయిర్ పోర్టుల నిర్మాణానికి ఆరు అనుకూల ప్రాంతాలు