25 Years Old N.Gayathri Civil court Judge : 25 ఏళ్లకే జడ్జి అయిన దినసరి కూలి కుమార్తె

‘కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి’ అబ్దుల్ కలామ్ చెప్పిన మాటల్ని నిజం చేసి తన కలల్ని సాకారం చేసుకుంది ఓ దినసరి కూలి కూతురు. పేదరికం తన కలలకు అడ్డుకాదని నిరూపించి కేవలం 25 ఏళ్లకే న్యాయమూర్తి అయ్యింది ఓ నిరుపేద కూతురు ‘గాయత్రి’.

25 Years Old Women Judge : ‘కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి’ అబ్దుల్ కలామ్ చెప్పిన మాటలు భారత్ లో ఎంతోమంది యువత స్పూర్తిగా తీసుకుని వారి కలల్ని సాకారం చేసుకుంటున్నారు. అబ్దుల్ కలాం మాటల్ని నిజం చేసి తన కలల్ని సాకారం చేసుకుంది ఓ దినసరి కూలి కూతురు.పేదరికం తన కలలకు అడ్డుకాదని నిరూపించి కేవలం 25 ఏళ్లకే న్యాయమూర్తి అయ్యింది ఓ నిరుపేద కూతురు ‘గాయత్రి’. గాయత్రి అనే తన పేరు పక్కన న్యాయమూర్తి అనే స్థానాన్ని దక్కించుకోవటాని అహర్నిశలు కష్టపడింది కర్ణాటకకు చెందిన ఎన్.గాయత్రి.పాతికేళ్ల వయసుకే కర్ణాటకలోని కోలారు సివిల్‌ కోర్టు న్యాయమూర్తిగా ఎన్‌.గాయత్రి నియమితులైన గాయత్రి కష్టం వెనుక ఆమె పట్టుదల ఉంది. పేదరికంలో పుట్టినా కష్టపడి చదివి న్యాయమూర్తిగా అవకాశాన్ని దక్కించుకుంది గాయత్రి.

కర్ణాటకలోని బంగారుపేట యళబుర్గికి చెందిన గాయత్రి.. ఎన్‌.కారహళ్లిలోని గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంది. కోలారు ఉమెన్స్ కాలేజీలో బీకాం పూర్తి చేసింది. కేజీఎఫ్‌లోని కెంగల్‌ హనుమంతయ్య కాలేజీలో 2021లో లా పూర్తి చేసింది. యూనివర్శిటీలో నాలుగో ర్యాంకు సాధించింది. అదే సంవత్సరం సివిల్‌ జడ్జి పోస్టులకు నిర్వహించిన డైరెక్ట్ రిక్రూట్ మెంట్ కోసం దరఖాస్తు చేసుకుంది. కానీ ఫెయిల్ అయ్యింది. ఆ తరువాత రెండోసారి ప్రయత్నించి ఫలితం సాధించింది. బంగారపేటకు చెందిన నారాయణస్వామి, వెంకట రత్నమ్మల ఏకైక కుమార్తె గాయత్రి.

గాయత్రి తల్లిదండ్రులు ఇద్దరూ రోజువారి కూలి పనులకు వెళ్లి సంపాదించిన కొద్దిపాటి డబ్బుతోనో కూతుర్ని చదివించారు. తమలాగే తమ ఒక్కగానొక్క కూతురు కష్టపడకూడదని తపన పడ్డారు. తల్లిదండ్రుల తపనను అర్థం చేసుకున్న గాయత్రి కష్టపడి చదివింది. కూతున్ని ఉన్నతస్థానంలో చూడాలనుకున్న కన్నవారికోరికను నెరవేర్చింది న్యాయమూర్తిగా అవకాశాన్ని దక్కించుకుని. సీనియరు న్యాయవాది శివరాం సుబ్రహ్మణ్యం వద్ద ఆమె జూనియర్‌ న్యాయవాదిగా పనిచేసింది గాయత్రి. ఆమెలో ఉన్న ప్రతిభ, పట్టుదల గమనించిన న్యాయవాది శివరాం సుబ్రహ్మణ్యం సివిల్‌ న్యాయమూర్తి పరీక్షలకు హాజరు కావటానికి చదవాల్సిన పుస్తకాలను ఇచ్చి ప్రోత్సహించారు. ఆమెకు అన్ని రకాలుగాను సహకరిచారు. అలా సుబ్రహ్మణ్యం నమ్మకాన్ని..తల్లిదండ్రుల ఆశలను నెరవేరుస్తూ 25 ఏళ్లకే సివిల్ కోర్టు న్యాయమూర్తిగా నియమితులైంది గాయత్రి. ఓ సాధారణ దినసరి కూలి కూతురు న్యాయమూర్తి గాయత్రి అయ్యింది.

 

ట్రెండింగ్ వార్తలు