Tn School
Tamil Nadu : ఓ స్కూల్ లోని టాయిలెట్ గోడ కూలిపోవడంతో ముగ్గురు విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలపాలయ్యారు. తమిళనాడు రాష్ట్రంలోని తిరునెల్వేలిలో శుక్రవారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది.
తిరునెల్వేలి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు సమీపంలోని చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వ-సహాయక పాఠశాల “స్కాఫ్టర్ ఉన్నత పాఠశాల” అత్యంత పురాతనమైంది. శుక్రవారం ఉదయం ఈ పాఠశాలలోని టాయిలెట్ గోడ కూలిపోయింది. దీంతో అక్కడే ఉన్న ముగ్గురు 8వ తరగతి విద్యార్థులపై శిథిలాలు పడటం వల్ల తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన మరో ముగ్గురు విద్యార్థులను హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.
విద్యార్థులు మృతి చెందడంతో.. తోటి విద్యార్థులు ఆందోళనకు దిగారు. పాఠశాలలోని పూలకుండీలను ధ్వంసం చేశారు. పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఘటనాస్థలికి పోలీసులు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పాఠశాల ప్రాథమిక విభాగం ముందు టాయిలెట్ ఉందని పోలీసులు తెలిపారు. పాఠశాల భవనం 130 సంవత్సరాల పురాతనమైనదని చెప్పారు. 100 ఏళ్లకుపైగా నడుస్తోన్న ఈ స్కూల్ లో భవనాలు, గోడలు శిథిలావస్థకు చేరుకున్నాయని స్థానికులు ఆరోపించారు. ఈ ప్రమాద ఘటనపై దర్యాప్తునకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి.. దర్యాప్తు చేపట్టారు.
విద్యార్థుల మృతిపట్ల సంతాపం తెలిపారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్. బాధితుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ఈ మేరకు ఆమె ఓ ట్వీట్ చేశారు.
ALSO READ Telangama Govt with Kotelijent : టాలెంట్ ఉంటే ఉద్యోగాలు వెతుక్కుంటు వస్తాయి : మత్రి కేటీఆర్