వేల మంది ఎదురుచూపులు తర్వాత నరేంద్రమోడీ శనివారం సాయంత్రం న్యూఢిల్లీలోని పాలమ్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. 74వ ఐక్యరాజ్యసమితి సమావేశాలు ముగించుకుని ఆయనకు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకున్నారు. వచ్చిన వెంటనే ఆయన సైనికులను పొగుడుతూ ప్రసంగించారు. సరిగ్గా మూడేళ్ల క్రిందట 2016లో కశ్మీర్‌లో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్‌ను గుర్తు చేసుకున్నారు.
స్వాగతం పలికేందుకు వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ‘2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఐక్యరాజ్యసమితికి వెళ్లాను. ఈ సారి భారత్‌కు వారిచ్చిన స్పందనలో మార్పు ఉంది. వాళ్లు చూపించిన గౌరవం పెరిగింది ఇది 130కోట్ల మంది భారతీయులకే చెందుతుంది. మూడేళ్ల క్రితం సెప్టెంబర్ 28నుంచి రాత్రుల్లో నిద్రపోయేవాడిని కాదు. ఎప్పుడు టెలిఫోన్ రింగ్ అవుతుందా. సైనికుల గురించి ఏ వార్త వినాల్సి వస్తుందోనని ఎదురుచూసేవాడిని. సర్జికల్ స్ట్రైక్ జరిపి భారత ఔన్నత్యాన్ని పెంచాం’ అని మోడీ అన్నారు. ఈ సర్జికల్ స్ట్రైక్‌లో 19మంది సైనికులు అమరులయ్యారు.
అమెరికాలో పర్యటనలో భాగంగా మోదీ ప్రవాస భారతీయుల సమావేశాల్లో పాల్గొన్నారు. అక్కడి ఆయిల్ కంపెనీల ఉన్నతాధికారులతోనూ భేటీ అయ్యారు. ఆపై ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాల్గొని భారత వాణిని బలంగా వినిపించారు. ఈ సందర్బంగా మోదీ తన అమెరికా విశేషాలను అందరితో పంచుకున్నారు.