బొగ్గు స్కామ్….మాజీ కేంద్రమంత్రికి 3ఏళ్ల జైలు శిక్ష

Former Union minister gets 3-yrs imprisonment in coal scam బొగ్గు కుంభకోణం (Coal block scam) కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇవాళ(అక్టోబర్-26,2020) శిక్షలు ఖరారు చేసింది. మాజీ కేంద్రమంత్రి ‘దిలీప్ రే’ తో పాటు మరో ఇద్దరు అధికారులకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ సోమవారం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును వెలువరించింది.
మూడేళ్ల శిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున జరిమానా కూడా విధిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ భరత్ పరాశర్ తీర్పును వెలువరించారు. దీంతోపాటు క్యాస్ట్రన్ టెక్‌కు రూ.60లక్షలు, క్యాస్ట్రన్ మైనింగ్ లిమిటెడ్‌కు మరో 10లక్షల జరిమానాను విధించారు.
కాగా, ఈ కేసులో… అటల్ బిహారీ వాజ్‌పాయ్ ప్రభుత్వంలో బొగ్గుగనుల సహాయ మంత్రిగా పనిచేసిన దిలీప్‌తోపాటు బొగ్గు గనుల మంత్రిత్వశాఖకు చెందిన ఉన్నతాధికారులు ప్రదీప్‌కుమార్ బెనర్జీ, నిత్యానంద్ గౌతమ్, క్యాస్ట్రాన్ టెక్నాలజీస్ (సిటిఎల్) డైరెక్టర్ మహేంద్ర కుమార్ అగర్వాలా తదితరులకు కూడా జీవితఖైదు విధించాలని సీబీఐ ఈ నెల 14న కోర్టును కోరిన విషయం తెలిసిందే.
1999లో జార్ఖండ్ లో బొగ్గు గనుల కేటాయింపుల్లో అక్రమాల కేసులో సీబీఐతోపాటు, నిందితుల వాదనలు విన్న ధర్మాసనం.. జార్ఖండ్‌లోని గిరిదిహ్‌లోని బ్రహ్మాదిహ బొగ్గు బ్లాక్ ను 1999లో నిబంధనలకు విరుద్ధంగా సీటీఎల్‌కు కేటాయించారని పేర్కొంటూ…ఈ నెల 6న మాజీ కేంద్రమంత్రి దిలీప్ రే తో పాటు మరో ఇద్దరు అధికారులను దోషులుగా తేల్చింది. అనంతరం ఈ కేసును అక్టోబరు 26కు వాయిదా వేస్తూ.. మాజీ మంత్రి హాజరుకావాలని సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ధర్మాసనం ఈ రోజు తీర్పును వెలువరించింది.