రూ. 10కే నాలుగు దోశలు..60 ఏళ్ల పేద బామ్మ పెద్ద మనస్సు

  • Publish Date - August 27, 2020 / 04:21 PM IST

చిన్న కిరాణా కొట్టు పెట్టినా..చిన్న టీ స్టాల్ పెట్టినా..లాభం లేకుండా ఎవ్వరూ వ్యాపారం చేయరు. కానీ లాభమే కాదు సాటి మనిషి కడుపు నింపాలనే మంచి మనస్సు కలవారు కూడా ఉన్నారు. అటువంటి అన్నపూర్ణలు ఈ భారతదేశంలో ఎంతోమంది ఉన్నారు. తాము ఇబ్బందుల్లో ఉన్నా ఏమాత్రం లాభాపేక్ష
లేని కోయంబత్తూరుకు చెందిన కమలతాల్ అనే 85 ఏళ్ళ బామ్మ..కేవలం రూ.1కే ఇడ్లిలను అమ్మటం..రామేశ్వరంలోని అగ్ని తీర్థంలో 70 ఏళ్ల రాణి ఉచితంగానే పేదలకు ఇడ్లీ ఇవ్వటం. ఇటువంటి ఎంతోమంది అన్నపూర్ణలకు జన్మనిచ్చింది ఈ భారతభూమి.



అటువంటి మరో బామ్మ కేవలం రూ.10లకే నాలుగు దోశలు, లేదా నాలుగు ఇడ్లీలను అమ్ముతూ పేదల కడుపు నింపుతోంది. చిన్నపాటి హోటల్లోనే కాదు, వీధి బండ్ల వద్ద కూడా ఏది తినాలన్నాటిఫిన్ కనీసం 30 రూపాయలకు తక్కువగా దొరికే పరిస్థితి లేదు. అటువంటిది కేవలం 10 రూపాయలకే నాలుగు దోశలు అమ్మటం అంటే ఆమె పెద్ద మనస్సు కాక మరేమిటి?

మహారాష్ట్రలో నాగ్‌పూర్‌కు చెందిన శారదా చౌరగడే అనే 61 ఏళ్ల వృద్ధురాలు మహల్‌లోని డీడీ నగర్ స్కూల్‌కు దగ్గరలో ఓ చిన్న స్టాల్ పెట్టుకుంది. చాలా కాలంగా ఇడ్లీ, దోశలు అమ్ముతూ జీవిస్తోంది. నాలుగు దోశలు లేదా నాలుగు ఇడ్లీలకు కేవలం 10 రూపాయలు మాత్రమే తీసుకుంటుంది.



ఇలా 2004 నుంచి స్టాల్ నడుపుతోంది. నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకు పెరుగుతున్నా తన టిఫెన్ ధరలు మాత్రం ఆమెపెంచటంలేదు. స్కూల్ పిల్లల కోసమే ఈ స్టాల్ పెట్టానంటోంది శారద. చట్నీ, సాంబారు ఇలా అన్ని రకాల వెరైటీలు చేసి మంచి రుచికరమైన ఆహారం అందించే బామ్మ..పిల్లల దగ్గర పాపం డబ్బులేం ఉంటాయి..అందుకే రూ.10 రూపాయలకే ఇస్తున్నానని అంటోంది. అంతే కాదు చాలాసార్లు పిల్లల వద్ద సరిపడా డబ్బు లేకపోతే ఆకలితో మాత్రం ఉండొద్దు అంటూ అడిగి మరీ ఉచితంగా ఇడ్లీలు..దోశలు వారు ఏమి తింటే అవి తినిపిస్తుంది.

తాను పేదరికాన్ని అనుభవిస్తున్నా కూడా ఏ మాత్రం లాభం చూసుకోకుండా సేవ చేస్తోంది. ఇలా చేయడం వల్ల కొన్నిసార్లు వచ్చే డబ్బులు ఖర్చులకు సరిపోకపోయినా..పిల్లల కడుపు నిండుతోందని అదే తనకు చాలా తృప్తినిస్తోందని అందుకే నష్టం వచ్చినా స్టాల్ మాత్రం నడుపుతున్నానని అంటోంది.