ఫేస్‌బుక్ తీసివేతలు: పొలిటికల్ పేజ్‌లు పోతున్నాయ్!

  • Publish Date - April 2, 2019 / 03:58 AM IST

ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడు అంతా సోషల్ మీడియాపై ఆధారపడి రాజకీయాలు నడుస్తున్నాయి. పార్టీలు కూడా అనుకూల వ్యక్తులను ప్రోత్సహిస్తూ ప్రచారాలను పెంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీల కార్యకర్తలు, నాయకులు శృతి మించి ప్రత్యర్ధి పార్టీలపైన తీవ్రస్థాయిలో విపరీతమైన పదజాలంతో పోస్టింగులు చేస్తూ వ్యక్తిగత ఇమేజ్‌కు దెబ్బకోడుతున్నారు.

ఏ ఒక్క పార్టీనో కాదు.. ప్రతీ పార్టీది ఇప్పుడు ఒకటే సిద్దాంతం.. ఎన్నికల యుద్ధం గెలవడం. యుద్దం గెలవాలంటే ప్రత్యర్థులకు ఉన్న శక్తి, సామర్ధ్యాలను నిర్విర్యం చేసి.. సామదాన బేద దండోపాయాల్ని ఉపయోగించి బలహీనులుగా మార్చడం..  అలా చేస్తే అనుకున్న లక్ష్యం చేరుకోవచ్చు. అందులో బాగంగానే పార్టీలు ప్రత్యర్ధులపై దాడికి సోషల్ మీడియాని వేదికగా ఎంచుకుంటున్నాయి. 

అయితే ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. వరుసగా నకిలీ, స్పామ్ ఖాతాలను తొలగిస్తున్న ఫేస్‌బుక్ కాంగ్రెస్ ఐటీ సెల్‌కు అనుబంధంగా పనిచేస్తున్న 687 పేజీలు, అకౌంట్లను రిమూవ్ చేసింది. వీటిద్వారా పోస్ట్ చేస్తున్న సమాచారం నకిలీవి అని గుర్తించిన ఫేస్‌బుక్ వాటిని రీమూవ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఖాతాలను నిర్వహిస్తున్న వారు తమ అసలు ధ్రువీకరణను వెల్లడించట్లేదని చెప్పింది.

దీనిపై కాంగ్రెస్ పార్టీకి చెప్పామని, ఆ పార్టీ నాయకుల అనుమానాలను క్లారిఫై చేశామని ఫేస్‌బుక్ సైబర్ సెక్యూరిటీ పాలసీ అధినేత నతానియల్ గ్లీచర్ వెల్లడించారు. పాకిస్థాన్‌ కేంద్రంగా ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో భారత్‌పై దుష్ప్రచారం చేస్తున్న 103 పేజీలు, గ్రూపులు, ఖాతాలను కూడా తొలగించినట్లు ఫేస్‌బుక్ తెలిపింది. ‘సిల్వర్‌ టచ్‌’ అనే భారతీయ ఐటీ సంస్థకు చెందిన 15 పేజీలు, గ్రూపులు, ఖాతాలను కూడా ఫేస్‌బుక్‌ తొలగించింది. ప్రధాని నరేంద్రమోడీకి సంబంధించిన ‘నమో’ యాప్‌ను సృష్టించింది ఈ సంస్థే. 

మంచి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు సోషల్ మీడియా అద్భుత సాధనం. కానీ.. రాజకీయ పార్టీలు సోషల్ మీడియాను కూడా పాడు చేసేశాయని, తమ నేతలకు అండగా ప్రత్యర్థి పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేయడం పార్టీల వీరాభిమానులకు పరిపాటిగా మారిందని ఫేస్‌బుక్ ఇటువంటి చర్యలు తీసుకోవడం హర్షనీయం అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.