Wall Collapses In Lucknow
Wall Collapses In Lucknow: ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. దిల్ కుషా ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు ఓ గోడ కుప్పకూలిపోయింది. దీంతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (శాంతి భద్రతలు) పీయూష్ మోర్దియా చెప్పారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయని వివరించారు. వారిద్దరిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని చెప్పారు.
వారిద్దరికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. గోడ కింద ఇంకా ఎవరైనా చిక్కున్నారా? అన్న విషయంపై స్పష్టత లేదు. లక్నోలో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా ఇవాళ పాఠశాలలకు సెలవు ఇస్తున్నట్లు ఆ రాష్ట్ర సర్కారు ఇవాళ ఉదయం ప్రకటన చేసింది. వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భారీ వర్షాలకు లక్నోలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు నిలిచాయి.