Site icon 10TV Telugu

#9YearsOfModiGovernment: మోదీ పాలనలో ఏయే ఏడాది.. ఏయే కీలక ఘట్టం? పూర్తి వివరాలు

9Years Of Modi Government

9Years Of Modi Government

Narendra Modi: భారత ప్రధానిగా నరేంద్ర మోదీ సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం ఇదే రోజున (2014 మే 26న) ప్రమాణ స్వీకారం చేశారు. ఈ తొమ్మిదేళ్లలో దేశ చరిత్రలోనేగాక బీజేపీ (Bharatiya Janata Party)లోనూ కీలక ఘట్టాలు చోటుచేసుకున్నాయి. ఏయే ఏడాది ఏయే ఘట్టం చోటుచేసుకుందో చూద్దాం…

2014: ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం చేశాక చేపట్టిన మొదటి అతిపెద్ద కార్యక్రమం స్వచ్ఛభారత్. 2014, అక్టోబర్ 2న దీన్ని ప్రారంభించారు.

2015: భారత ప్రణాళికా సంఘం (Planning Commission of India) స్థానంలో మోదీ సర్కారు దేశంలో నీతి ఆయోగ్ ను (NITI Aayog)ను ప్రవేశపెట్టింది.
జనవరి 26 (గణతంత్ర దినోత్సవం) రోజున అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ముఖ్యఅతిథిగా భారత్ కు వచ్చారు.

2016: సెప్టెంబర్ 4న భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ గా రఘురాం రాజన్ నుంచి ఉర్జిత్ పటేల్ బాధ్యతలు స్వీకరించారు.
అదే ఏడాది సెప్టెంబరు 18న పాకిస్థాన్ ఉగ్రవాదులు నలుగురు జమ్మూకశ్మీర్ లోని యూరీలోకి చొరబడి భారత ఆర్మీపై భీకరదాడి చేసి 23 మంది ప్రాణాలు తీశారు.
అదే ఏడాది నవంబరు 8న సాయంత్రం పాత రూ.500, రూ.1,000 నోట్లను తక్షణమే రద్దు చేస్తున్నట్లు మోదీ ప్రకటించారు. భారత ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లింది.

2017: దేశ ఆర్థిక చరిత్రలో సరికొత్త అధ్యాయం.. వస్తు, సేవల పన్ను (GST)ని ప్రవేశపెట్టింది మోదీ ప్రభుత్వం. స్వాతంత్ర్యానంతరం అత్యంత భారీ పన్ను సంస్కరణగా ఇది నిలిచింది. 2017 జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చింది.
* అదే ఏడాదిలోనే సుప్రీంకోర్టు ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని చెప్పింది.
* ఉత్తరప్రదేశ్ లోని 403 అసెంబ్లీ స్థానాల్లో మోదీ హవాతోనే 2017లో బీజేపీ 312 స్థానాల్లో గెలుపొందింది.

2018: ఈ ఏడాది ట్రిపుల్ తలాక్ (Muslim triple talaq) ను నేరంగా పరిగణిస్తూ ప్రధాని మోదీ ప్రభుత్వం బిల్లును రూపొందించి, లోక్‌సభలో ప్రవేశపెట్టింది. లోక్‌సభలో 2018 డిసెంబర్ 27వ తేదీన ఈ బిల్లుకు ఆమోద ముద్ర పడింది.
* అదే ఏడాది, డిసెంబరు 10న అప్పటి ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేశారు. అప్పట్లో ఈ వ్యవహారం సంచలనం రేపింది. * డిసెంబరు 12న శక్తికాంత దాస్ ఆ బాధ్యతలు స్వీకరించారు. ఆయన మోదీకి అనుకూలంగా వ్యవహరిస్తారని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
* పలు రాష్ట్రాల్లో 2018లో మూకదాడులు జరిగాయి

2019: లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. మోదీ హవాతో బీజేపీ 303 సీట్లు సాధించింది.
* పలు రాష్ట్రాల్లో 2019లోనూ మూకదాడులు జరిగాయి.
* హిందువుల దశాబ్దాల కల అయోధ్యలో రామమందిర నిర్మాణంపై వారికి అనుకూలంగా 2019, నవంబరు 9న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
* అదే ఏడాది ఫిబ్రవరి 14న శ్రీనగర్, పుల్వామా ఉగ్రదాడి చోటుచేసుకుంది. భారతీయ సైనికులను తీసుకువెళ్తున్న కాన్వాయ్ పై ఉగ్రవాదులు కారుతో ఆత్మాహుతి బాంబు దాడికి పాల్పడడంతో దాదాపు 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.
* ఫిబ్రవరి 15న మోదీ మొట్టమొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించారు.
* ఈ ఏడాది అక్టోరులో జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370ని అక్టోబరు 31న రద్దు చేశారు.

2020: కరోనా వేళ దేశంలో లాక్‌డౌన్ విధించారు. దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడడంతో మోదీపై ఒత్తిడి పెరిగింది.
* ఆగస్టు 5న రామమందిర నిర్మాణానికి మోదీ భూమిపూజ చేశారు. దీంతో హిందువుల్లో మోదీ ప్రభ మరింత పెరిగింది.
* ఈ ఏడాది సెప్టెంబరు 17న మూడుసాగు చట్టాలకు లోక్‌సభలో ఆమోద ముద్ర పడింది.
* ఢిల్లీలో 2020, ఫిబ్రవరి 23 నుంచి మతపర అల్లర్లు జరిగాయి.
* కరోనా విజృంభణ నేపథ్యంలో మోదీ 2020లో విదేశీ పర్యటన ఒక్కటీ చేయలేదు.
* ఇదే ఏడాది స్వచ్ఛభారత్ రెండో దశ ప్రారంభమైంది.

2021: కేంద్ర సర్కారు తీసుకొచ్చిన మూడు సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఆగస్టు 9న రైతులు ఆందోళనలు ప్రారంభించారు.
అదే ఏడాది అక్టోబరు 3న ల‌ఖింపూర్ ఖేరీలో రైతుల మీదకు కారు దూసుకెళ్లడంతో కొందరు రైతులు మృతి చెందారు.
కరోనా ప్రభావం తగ్గడంతో 2021 నుంచి మోదీ మళ్లీ విదేశీ పర్యటనలు ప్రారంభించారు.

2022: యూపీలో జరిగిన ఎన్నికల్లో 255 సీట్లను మోదీ, యోగి వల్ల బీజేపీ గెలుచుకుంది.
బీజేపీతో విభేదాల వల్ల ఆగస్టు 9న బిహార్ సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా చేశారు. ఆ తర్వాతి రోజు ఆర్జేడీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు.

ప్రస్తుత ఏడాది కర్ణాటకలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ అన్నీ తానై ప్రచారం చేసిన బీజేపీ గెలవలేదు. దీంతో రానున్న నెలల్లో రాష్ట్రా అసెంబ్లీ ఎన్నికలపై, వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికలపై అంచనాలు మారాయి.

#9YearsOfModiGovernment: తొమ్మిదేళ్ల పాలనలో మోదీకి ఎదురైన 5 అతిపెద్ద సవాళ్లు, తీవ్ర విమర్శలు..

Exit mobile version