ఆన్‌లైన్ రమ్మీకి బానిసై.. అప్పులు కట్టలేక ఆత్మహత్య

  • Publish Date - October 30, 2020 / 07:18 AM IST

online Rummy:ఆన్‌లైన్ గేమ్స్‌కి అందులోనూ రమ్మీ వంటి చట్ట నిషేధ ఆటలకు అట్రాక్ట్ అవుతున్న యువకులు చాలా మంది ఇటీవలికాలంలో కనిపిస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఈజీగా డబ్బు సంపాదించవచ్చు అనే యోచనతో.. లక్షలాది, కోట్లాది రూపాయలను కోల్పోతు కష్టపడి చివరకు ప్రాణాలు కూడా వదిలేస్తున్నారు. గేమ్స్ ఆడేందుకు చేసిన అప్పులు తీర్చలేక, గేమ్ వల్ల డబ్బులు పొయ్యాయని ఇంట్లో చెప్పలేక చివరకు ఓ 28ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తర చెన్నైలోని సెంబియం పరిసరాల్లో చోటుచేసుకుంది.



అరచేతిలో సెల్‌ఫోన్, కంప్యూటర్‌ ల్యాప్‌టాప్‌ ఆధారంగా ఆన్‌లైన్‌ రమ్మీకి బానిసలు అవుతున్నారు. ఈ క్రమంలోనే తమిళనాడు విల్లుపురం జిల్లాకు చెందిన ఎం కుమారసన్ కూడా అదే మాయదారి గేమ్‌కు బానిస అయ్యాడు. ఒక ప్రైవేట్ బ్యాంకులో కలెక్షన్ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. ఆన్‌లైన్ రమ్మీకి బానిసైన కుమారసన్ అప్పులు బాధ తట్టుకోలేక తీవ్ర మనోవేధనకు గురై ఉరేసుకుని చనిపోయాడు.. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో అతనిని రూమ్మేట్స్ ఉరివేసుకున్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న సెంబియం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కుమారసన్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ వైద్యులు అతన్ని చనిపోయినట్లు ప్రకటించారు.



https://10tv.in/online-class-takes-student-life/
ఆత్మహత్య చేసుకున్న కుమారసన్.. ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడటానికి బానిసై తండ్రి వద్ద కూడా ఇటీవల రూ. లక్ష వరకు అప్పుగా తీసుకున్నాడు. నెలకు రూ .18,000 సంపాదిస్తున్నట్లు చెప్పిన కుమారసన్.. కుటుంబానికి మాత్రం ఇప్పటివరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు.



కాలక్షేపం కోసం ఆడుదామని బానిసలైపోతున్న యువకులు, సాప్ట్‌వేర్‌ ఉద్యోగులు ఎందరో.. ఫలితంగా లక్షలాది రూపాయలు పోగొట్టుకోవడమే కాక ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నో ఘటనలు ఇటువంటివి చోటుచేసుకోగా.. ప్రస్తుతం రాష్ట్రాల్లో దీనిపై నిషేధం నడుస్తుంది. ఆన్‌లైన్ రమ్మీ వల్ల ఆర్థికంగా నష్టపోవడమేకాకుండా ఆరోగ్యం కూడా దెబ్బతింటోందని నిపుణులు చెబుతున్నారు.