Rahul
BSP Supremo Mayawati: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ – బీఎస్పీ కలిసి పోటీచేసే విషయంపై బీఎస్పీ అధినేత్రి మాయావతికి సీఎం సీటు ఆఫర్ చేశామంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశం అయ్యాయి. యూపీ ఎన్నికల్లో అధినేత్రి మాయావతిని తమ ఉమ్మడి పార్టీల తరుపున సీఎం అభ్యర్థిగా నిలబడాలంటూ ప్రతిపాదనలు పంపామని, అయితే ఆమె నుంచి ఎటువంటి సమాధానం రాలేదని శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలపై బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆదివారం స్పందించారు. సీఎం అభ్యర్థిత్వంపై రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఆమె చెప్పారు. “రాహుల్ గాంధీ స్వయంగా కులతత్వ మనస్తత్వంతో బాధపడుతూ నాపై ఆరోపణలు చేస్తున్నారు. అతను అబద్ధాలు చెబుతున్నాడని, నాకు ఎలాంటి ఆఫర్ రాలేదని, దళితులకు కాంగ్రెస్ ఎప్పుడూ అండగా నిలవలేదని” ఆమె అన్నారు.
Also Read:TS Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామం.. స్టార్ క్యాంపెయినర్‌గా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
సీబీఐ, ఈడీ, పెగాసస్‌లకు భయపడుతున్నానని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై మాయావతి స్పందిస్తూ, మాజీ ప్రధాని, దివంగత రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ కూడా బీఎస్పీ పరువును మసకబార్చే ప్రయత్నం చేశారని సంచలన ఆరోపణలు చేశారు. “ఇప్పుడు, ప్రియాంక గాంధీ కూడా అదే మాట చెబుతోంది, నేను ED మరియు ఇతర దర్యాప్తు సంస్థలకు భయపడుతున్నాను. ఇదంతా అబద్ధం. ఈ కేసులన్నింటిపై సుప్రీంకోర్టులో పోరాడి గెలిచామని వారు తెలుసుకోవాలి’ అని మాయావతి అన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ బీఎస్పీని కించపరిచేందుకు, బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తోందని మాయావతి ఆరోపించారు.
ఇటీవల ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పనితీరుపై వ్యాఖ్యానిస్తూ “రాహుల్ తన సొంత పార్టీని గాడిలో పెట్టుకోలేకపోతున్నాడని” మాయావతి ఎద్దేవా చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిఎస్‌పి మరియు కాంగ్రెస్ పార్టీలు వరుసగా ఒకటి మరియు రెండు స్థానాలు గెలుచుకుని ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. ఇక రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై పలువురు రాజకీయ విశ్లేషకులు స్పందిస్తూ 80వ దశకంలో కోల్పోయిన దళిత-ముస్లిం-బ్రాహ్మణుల ఓటు బ్యాంకును తిరిగి పొందాలని భావిస్తున్న నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు.