“ఆత్మ నిర్భర్ భారత్” లో ప్రపంచ సంక్షేమమూ భాగమే… వైభవ్​ సమ్మిట్ ను ప్రారంభించిన మోడీ

‘Aatmanirbhar Bharat’ శాస్త్రీయ పరిశోధనల్లో యువత భాగం కావాల్సిన సమయం ఆసన్నమైందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. వైశ్విక్ భారతీయ వైజ్ఞానిక్​గా పిలిచే ‘వైభవ్​ సదస్సు-2020’ను ప్రధాని నరేంద్రమోడీ ఇవాళ వర్చువల్​ వేదికగా ప్రారంభించారు. ఈ సదస్సులో 55 దేశాలకు చెందిన దాదాపు 3 వేల మంది భారత మూలాలు ఉన్న విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ ముఖ్య సాంకేతిక సలహాదారు నేతృత్వంలో సుమారు 200 విద్యాసంస్థలు.. ఎస్​ అండ్ టీ సంస్థలు సహా 40 దేశాలకు చెందిన 15 వందల మంది ప్యానలిస్టులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.


ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని … దేశ, విదేశాల్లోని భారతీయ శాస్త్రవేత్తలు, విద్యావేత్తలతో జరిగిన వైభవ్ సదస్సు గొప్ప మేధావుల సంఘం. శాస్త్రీయ పరిశోధన, ఆవిష్కరణలను పెంచడానికి భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. సామాజిక-ఆర్థిక సంస్కరణలకు సైన్స్​ ప్రధాన ఆధారం. రైతులకూ సాయపడే విధంగా ఉన్నత స్థాయి శాస్త్రీయ పరిశోధనలు అవసరం. ధాన్యం ఉత్పత్తులను పెంచేందుకు మన శాస్త్రవేత్తలు కష్టపడి పనిచేశారు. నేడు మనం అతి తక్కువ పప్పు దినుసులు మాత్రమే దిగుమతి చేసుకుంటున్నాన్నాం. మన దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయికి చేరింది. సైన్స్ పట్ల ఎక్కువ మంది యువత ఆసక్తి చూపేవిధంగా ప్రోత్సహించవలసిన సమయమిదని మోడీ చెప్పారు.


భారత దేశం పిలుపునిచ్చిన స్వయం సమృద్ధ భారత దేశం(ఆత్మనిర్భర్ భారత్)​ నినాదంలో ప్రపంచ సంక్షేమం దార్శనికత కూడా ఉందని చెప్పారు. ఈ కలను సాకారం చేయడానికి అందరూ కలిసి రావాలని, మద్దతివ్వాలని కోరారు. ఇటీవలే అంతరిక్ష పరిశోధన రంగంలో మార్పులు తెచ్చామని, ఇది పరిశ్రమలతో పాటు విద్యా విషయంలో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.


దేశీయంగా వ్యాక్సిన్​ ఉత్పత్తిని ప్రోత్సహించామని ఈ సందర్భంగా మోదీ తెలిపారు. రోగ నిరోధక కార్యక్రమంలో భాగంగా 2014లో నాలుగు కొత్త వ్యాక్సిన్లను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ నాలుగింటిలో ఒకటైన రోటావైరస్ వ్యాక్సిన్‌ను మన దేశంలోనే అభివృద్ధిపరిచారని చెప్పారు.