CP Radhakrishnan: భారత నూతన ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్.. ఆయన రాజకీయ ప్రస్థానం ఇదే..
దేశంలోని అత్యంత అనుభవజ్ఞులైన రాజకీయ వ్యక్తుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు.

CP Radhakrishnan: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభర్థి రాధాకృష్ణన్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. నూతన రాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ఆయన రాజకీయ నేపథ్యం గురించి తెలుసుకుందాం. ఆయన పూర్తి పేరు చంద్రపురం పొన్నుసామి రాధాకృష్ణన్. తమిళనాడుకి చెందిన రాజకీయ నాయకుడు. మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నారు.
జార్ఖండ్ గవర్నర్‌గా కూడా పని చేసిన రాధాకృష్ణన్ ప్రజా జీవితంలో నాలుగు దశాబ్దాలకు పైగా అనుభవాన్ని కలిగి ఉన్నారు. ఆయన విస్తృత రాజకీయ ప్రయాణం ఎంపీగా, పార్టీ నాయకుడిగా, నిర్వాహకుడిగా, గవర్నర్‌గా విభిన్న బాధ్యతలను కలిగి ఉంది. దేశంలోని అత్యంత అనుభవజ్ఞులైన రాజకీయ వ్యక్తుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు.
16ఏళ్ల వయసులోనే..
సీపీ రాధాకృష్ణన్ 1957 అక్టోబర్ 20న తమిళనాడులోని తిరుప్పూర్‌లో జన్మించారు. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ఆయన రాజకీయ ప్రయాణం చిన్న వయసులోనే ప్రారంభమైంది. 16ఏళ్ల వయసులో తొలిసారి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)లో చేరారు. తర్వాత 1974లో భారతీయ జనసంఘ్ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యుడయ్యారు.
ఆ తర్వాత బీజేపీని స్థాపించడంతో అందులో చేరారు. 1998 లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడు కోయంబత్తూర్ స్థానం నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేసి 1.5 లక్షల ఆధిక్యంతో విజయం సాధించారు. డీఎంకే నేత రామనాథన్‌ను నాడు ఓడించారు. ఆ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి గెలిచిన ముగ్గురు బీజేపీ ఎంపీల్లో రాధాకృష్ణన్ ఒకరు. రాజకీయ మార్పుల కారణంగా 1999లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఆయన 55వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు.
* సిపి రాధాకృష్ణన్ రాజకీయ ప్రయాణం 1974లో భారతీయ జనసంఘ్ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యుడిగా ఎన్నికతో ప్రారంభమైంది.
* 1996లో తమిళనాడు బిజెపి కార్యదర్శిగా నియమితులయ్యారు.
* 1998- 1999 – కోయంబత్తూరు నుండి లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు.
* టెక్స్ టైల్స్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా చేశారు.
* పిఎస్‌యులపై పార్లమెంటరీ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు.
* ఫైనాన్స్ కన్సల్టేటివ్ కమిటీ మెంబర్ గా ఉన్నారు.
* స్టాక్ ఎక్స్ చేంజ్ స్కామ్ స్పెషల్ పార్లమెంటరీ కమిటీ మెంబర్ గా ఉన్నారు.
* 2004లో యూఎన్ జనరల్ అసెంబ్లీలో భారత్ కు ప్రాతినిధ్యం వహించారు.
* బీజేపీ తమిళనాడు శాఖకు 2004, 2007లో రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు.
* బీజేపీకి అత్యంత నమ్మకస్తుడిగా గుర్తింపు. అందుకే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక.
2004 2007 మధ్య బిజెపి రాష్ట్ర నాయకత్వంలో సి.పి. రాధాకృష్ణన్ ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆయన తమిళనాడులో బిజెపి అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ సమయంలో, ఆయన 93 రోజుల పాటు 19వేల కిలోమీటర్ల రథయాత్రను ప్రారంభించారు. నదుల అనుసంధానం, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు, అంటరానితనాన్ని ఎదుర్కోవడం, మాదకద్రవ్యాలను అరికట్టడం వంటి అంశాలపై గళమెత్తారు.
రాధాకృష్ణన్ సేవలను గుర్తించిన మోదీ సర్కార్ 2023లో జార్ఖండ్ గవర్నర్‌గా నియమించింది. దాదాపు ఏడాదిన్నర అక్కడ పనిచేశారు. తర్వాత గతేడాది మార్చిలో తమిళసై సౌందర రాజన్ రాజీనామాతో తెలంగాణ, పుదుచ్చేరి బాధ్యతలను ఆయనకే అప్పగించారు. కానీ, జులైలో మహారాష్ట్రకు పూర్తి స్థాయి గవర్నర్‌గా నియమించారు.