Punjab5
ABP-CVoter Survey : వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో..ఏ ఒక్క పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే మెజర్టీ వచ్చే అవకాశం లేదని తాజాగా విడుదలైన ఏబీపీ-సీవోటర్స్ సర్వే చెబుతోంది.
రాష్ట్రంలోని ఓటర్ల మూడ్ ఎలా ఉందో తెలుసుకునేందుకు ఏబీపీ న్యూస్ మరియు సీ ఓటర్ సంస్థ నిర్వహించిన నెలవారీ సర్వేలో…గ్రూపు రాజకీయాలు, అంతర్గత కుమ్ములాటలతో పంజాబ్ ‘చేయి’జారిపోనుందని, ఆప్ నేతృత్వంలో సర్కారు ఏర్పాటయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది.
వచ్చే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) 38.4 శాతం ఓట్లను సాధిస్తుందని, ఆ తర్వాతి స్థానంలో 34.1శాతం ఓట్లతో కాంగ్రెస్ నిలవనుందని సర్వే వివరిస్తోంది. శిరోమణి అకాళీదల్ కు 20.4శాతం,బీజేపీకి 2.6శాతం ఓట్లు వచ్చే అవకాశముందని సర్వే తెలిపింది. ఇక,సీట్ల విషయానికొస్తే…50-56 సీట్లతో అతిపెద్ద పార్టీగా ఆప్ అవతరించింది. కాంగ్రెస్ కు 39-45సీట్లు,శిరోమణి అకాళీదల్ కు 17-23 సీట్లు,బీజేపీకి 0-1 సీట్లు వచ్చే అవకాశముందని సర్వే తెలిపింది. కాగా,పంజాబ్ అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య 117.
ఇక,ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఇటీవల కాలంలో వరుస పంజాబ్ పర్యటనలు చేస్తూ..అక్కడి పార్టీ కేడర్‌లో జోష్ నింపుతున్నారు. పంజాబ్ లో అన్ని వర్గాల ఓటర్లను ఆకట్టుకునేలా పలు హామీలతో ముందుకు సాగుతున్నారు. తాజా సర్వే ఆప్ కేడర్ లో మరింత జోష్ నింపిందనే చెప్పవచ్చు.
గత పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 77 సీట్లు సాధించి అధికారాన్ని హస్తగతం చేసుకోగా, 20 స్థానాల్లో విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్ కు 15 సీట్లు రాగా, బీజేపీ కేవలం 3 సీట్లకు పరిమితం కావడం తెలిసిందే. ఈసారి ఎలాగైనా పంజాబ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని అరవింద్ కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు.
ALSO READ Awantipora Encounter : కశ్మీర్ లో ఎన్ కౌంటర్..ఉగ్రవాది హతం