బాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. వరుస మరణాలు అందర్నీ కలిచివేస్తున్నాయి. బాలీవుడ్, బుల్లి తెర నటుడు రంజన్ సెహగల్ (36) తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. 2020, జులై 11వ తేదీ శనివారం రాత్రి పంజాబ్ రాష్ట్రంలోని చండీగడ్ లో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు.
ఫోర్స్, కర్మ వంటి చిత్రాలతో పాటు..పలు పంజాబీ సినిమాల్లో నటించారు. బుల్లితెరపై క్రైమ్ పెట్రోల్, సావధాన్ ఇండియా, తుమ్ దేనా సాత్ మేరా లాంటి కార్యక్రమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు రంజన్.
రంజన్ మరణంతో అందరూ దిగ్ర్భాంతికి గురయ్యారు. చిన్న వయస్సులో మరణించడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అతడితో నటించిన నటులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. రంజన్ మృతిపై సినీ అండ్ టీవీ ఆర్టిస్టు అసోసియేషన్ (CINTAA) నివాళి అర్పించింది.
ఈ ఏడాదిలో బాలీవుడ్ కు చెందిన నటులు రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్, సరోజ్ ఖాన్, వాజిద్ ఖాన్ అనారోగ్యంతో కన్నుమూయగా..యువ నటుడు రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నారు.