Nidhi Tewari : నిధి తివారీ. ఇప్పుడీ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. దీనికి కారణం.. ప్రధాని నరేంద్ర మోదీకి ప్రైవేట్ సెక్రటరీగా ఆమెను నియమించడమే. దీంతో ఒక్కసారిగా నిధి తివారీ పేరు తెరపైకి వచ్చింది. అసలు ఎవరీ నిధి తివారీ? ఆమె ప్రత్యేకతలు ఏంటి? ఆమె ఏం చదివారు? ప్రస్తుతం ఏం చేస్తున్నారు? అనే వివరాలు ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం పీఎంవోలో డిప్యూటీ సెక్రటరీగా వ్యవహరిస్తున్న నిధి త్వరలో కొత్త బాధ్యతలు తీసుకోనున్నారు.
నిధి తివారీ ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) ఆఫీసర్. ప్రధాని మోదీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్ సభ నియోజకవర్గం వారణాసిలోని మెహముర్‌గంజ్ వాసి నిధి తివారీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లో 96వ ర్యాంక్ సాధించారు. 2014 బ్యాచ్‌కు చెందిన నిధి.. వారణాసిలో కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ లో అసిస్టెంట్ కమిషనర్ గా పని చేశారు. 2023 జనవరి 6 నుంచి ప్రధానమంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పని చేస్తున్నారు.
Also Read : ప్రధాని మోదీ మెచ్చిన ‘ఇప్పపువ్వు లడ్డూ’.. దాన్ని ఎలా తయారు చేస్తారు..? ఆరోగ్య ప్రయోజనాలివే
2022లో అండర్ సెక్రటరీగా చేరారు. పీఎంవోలో చేరడానికి ముందు నిధి తివారీ విదేశాంగ మంత్రిత్వశాఖలో పని చేశారు. నిరాయుధీకరణ, అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల విభాగంలో బాధ్యతలు నిర్వర్తించారు. అంతర్జాతీయ సంబంధాల మెరుగుదలలో నిధి తివారీకున్న నైపుణ్యమే పీఎంవోలో కీలక పాత్ర పోషించే స్థాయికి తీసుకొచ్చింది. ఫారిన్ అండ్ సెక్యూరిటీకి చెందిన అంశాలను నేరుగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కు నివేదించడంలో నిధిది కీ రోల్.
ప్రధాని మోదీకి ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ నియామకానికి కేంద్ర క్యాబినెట్ అపాయింట్ మెంట్స్ కమిటీ ఆమోదం తెలిపింది. డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ దీనిపై మెమోరాండమ్ విడుదల చేసింది. నిధి తివారీ కన్నా ముందు ప్రధాని మోదీ ప్రైవేట్ సెక్రటరీలుగా ఇద్దరు పని చేశారు. హార్ధిక్ సతీశ్ చంద్ర షా, వివేక్ కుమార్ లు ప్రైవేట్ సెక్రటరీలుగా విధులు నిర్వహించారు. ఈసారి ఓ మహిళకు ఆ బాధ్యతలు అప్పగించడం విశేషం.