PM Modi: ప్రధాని మోదీ మెచ్చిన ‘ఇప్పపువ్వు లడ్డూ’.. దాన్ని ఎలా తయారు చేస్తారు..? ఆరోగ్య ప్రయోజనాలివే
అదిలాబాద్ జిల్లా ఆదివాసీ మహిళలు తయారు చేసే ఇప్పపువ్వు లడ్డూ గురించి మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్రమోదీ ప్రస్తావించారు.

Ippapuvu laddu
Prime Minister Modi: ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మహిళలు తయారు చేసిన ఇప్పపువ్వు లడ్డూపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఈ ఇప్పపువ్వు లడ్డూ జిల్లాలోని ఉట్నూరు మండలానికి చెందిన ఆదివాసీ మహిళలు భీంబాయి ఆదివాసీ సహకార సంఘం ఆధ్వర్యంలో తయారవుతోంది.
ఈ ఇప్పపువ్వు లడ్డూపై మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. తెలంగాణకు చెందిన ఆదిలాబాద్ జిల్లా సోదరీమణులు ఇప్పపువ్వుతో కొత్త ప్రయోగం చేశారు. వారు రకరకాల వంటలు చేస్తున్నారు. వీటిని ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు. వారి వంటకాల్లో ఆదివాసీల సంస్కృతి, తీయదనం కూడా దాగుంది అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ప్రధాని ప్రశంసించడంపై భీంబాయి ఆదివాసీ మహిళా సంఘం అధ్యక్షురాలు కుంరం భాగుబాయి ఆనందం వ్యక్తం చేశారు. రాబోయేకాలంలో మరింత ఉత్సాహంతో పరిశ్రమను విస్తరించేందుకు కష్టపడతామని అన్నారు.
ఆదివాసీ మహిళలు తయారుచేసే ఇప్పపువ్వు లడ్డూను గిరిజన గర్భిణులు, బాలింతలు, రక్తహీనతతో బాధపడుతున్న వారికి అధికారులు అందజేస్తున్నారు. ఒక లడ్డూ సుమారు 20గ్రాముల బరువు ఉంటుంది. కిలో లడ్డూల ధర రూ.300గా ఉంది. దేశంలో మొదటిసారిగా 2020లో పైలట్ ప్రాజెక్టు కింద అదిలాబాద్ జిల్లాలో 1,845, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 817 మంది గిరిజన గర్భిణులకు ఈ ఇప్పపువ్వు లడ్డూలను అధికారులు అందించారు. నెలకు దాదాపు 20 క్వింటాళ్ల ఇప్పపువ్వు లడ్డూలను భీంబాయి సంఘం నుంచి అధికారులు కొనుగోలు చేసి విద్యార్థినులకు అందిస్తున్నారు.
ఈ ఇప్పపువ్వు లడ్డూను పలు రకాల పదార్థాలతో తయారు చేస్తారు. 400 గ్రాముల ఇప్పపువ్వులు, 190గ్రాముల నువ్వులు, 190 గ్రాముల బెల్లం, 190 గ్రాముల పల్లీలు, 30గ్రాముల కిస్మిస్, మంచి నూనెను కలిపి కిలో లడ్డూలను తయారు చేస్తారు. లడ్డూల తయారీ కోసం ముందుగా ఇప్పపువ్వును సేకరిస్తారు. సేకరించిన ఇప్పపువ్వును ఆరుబయట ఎండలో ఆరబెడతారు. ఆ తరువాత వాటిని నూనెలో వేయిస్తారు. ఆ తరువాత వెయించిన నువ్వులు, పల్లీలను దానికి జతచేసి వేడితగ్గిన తరువాత వాటిలో బెల్లం కలుపుతారు. ఈ పదార్థాలతో పాటు కిస్మిస్, యాలకులు, మిరియాలపొడి కలిపి ఉండలుగా చుట్టి లడ్డూలు తయారు చేస్తున్నారు.