సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం నిరంకుశత్వ పాలన నుంచి హైదరాబాద్‌కు విముక్తి కల్పించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. 1948, సెప్టెంబర్ 17న పోలీస్ చర్య ద్వారా హైదరాబాద్ భారతదేశంలో విలీనం అయిందన్నారు. దేశాన్ని ఐకమత్యంగా నిలిపేందుకు పటేల్ కృషి చేశారని కొనియాడారు. ఆలిండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ కార్యక్రమంలో పాల్గొన్న షా తమ ప్రభుత్వం తీసుకున్న మరికొన్ని అంశాలపై మాట్లాడారు.
ఏదైనా ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాలంటే దానికి దమ్ము ధైర్యం కావాలని, అవి మాకు టన్నుల్లో ఉన్నాయని అన్నారు. సర్జికల్ స్ట్రైక్స్, జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేయాలంటే చాలా ధైర్యం కావాలని అన్నారు. సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడులతో ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అదే సమయంలో భారత్ అంటే ఏమిటో ప్రపంచదేశాలకు తెలిసి వచ్చిందని అమిత్ షా అన్నారు ఇలాంటి దాడులు చేసేందుకు ఎంతో ధైర్యం ఉండాలని అది మోడీ నాయకత్వంలో జరిగిందని చెప్పారు. గతంలో యూపీయే ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వాలుకానీ తీసుకున్న ఏవైనా 5 అతి పెద్ద నిర్ణయాలు చెప్పగలరా అని ఆయన సభనుద్దేశించి అడిగారు.
ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాలంటే దానికి ఎంతో ధైర్యం సాహసం కావాలని అమిత్ షా పేర్కొన్నారు. పాకిస్తాన్‌పై సర్జికల్ దాడులు చేయడం, జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేయడం తమ ప్రభుత్వ అతి పెద్ద విజయాలుగా అమిత్ షా పేర్కోన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెట్టే నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోలేదని చెప్పిన అమిత్ షా… తమ నిర్ణయాలతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఒక్క అంగుళం భూమి కూడా శతృదేశానికి వెళ్లడం తాము సహించబోమని చెప్పిన కేంద్రహోంశాఖ మంత్రి… ఆర్టికల్ 370 రద్దు ఎలా జరుగుతుందని చాలామంది ప్రశ్నించారని అయితే ఆగష్టు 5న ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు కశ్మీర్‌లో ఒక్క తూటా పేలిన వార్తలు రాలేదని అమిత్ షా చెప్పారు.