చంద్రయాన్ -2లో మరోదశ సక్సెస్ అయ్యింది. విక్రమ్ ల్యాండర్ కక్ష్య తగ్గింపు ప్రక్రియలో రెండో కక్ష్య తగ్గింపు పూర్తయ్యింది. జస్ట్ తొమ్మిది సెకన్లలో కక్ష్య తగ్గింపు ప్రక్రియ పూర్తి చేసింది. సెప్టెంబర్ 7వ తేదీన విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగనుంది. ఉదయం 1.30 నుంచి 2.30 మధ్య చంద్రుడిని తాకనుంది.
మంగళవారం ఉదయం 8.50 గంటలకు ల్యాండర్ లో నింపిన ఇంధనాన్ని నాలుగు సెకన్లపాటు మండించి చంద్రుడికి దగ్గరగా 104 కిలోమీటర్లు తగ్గించి మరింత దగ్గరగా తీసుకెళ్లే ప్రక్రియ విజయంతంగా చేపట్టారు. ప్రస్తుతం ఆర్బిటర్ చంద్రుడికి 100 కిలోమీటర్ల ఎత్తులోని లూనార్ ఆర్బిట్ లో పరిభ్రమిస్తూ, ల్యాండర్ సమాచారాన్ని భూనియంత్రిత కేంద్రానికి అందించే పనిలో ఉంది. ఆర్బిటర్, ల్యాండర్ లు సక్రమంగా ఉన్నాయని, బాగా పని చేస్తున్నాయని ఇస్రో ప్రకటించింది.
బెంగళూరులోని మిషన్ ఆపరేటర్ కాంప్లెక్స్, ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ ఆండ్ కమాండ్ నెట్ వర్క్, బైలాలులోని ఇండియన్ డీప్ స్పేస్ నెట్ వర్క్ లాంటి భూనియంత్రిత కేంద్రాల నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ఆపరేషన్ ను చేపట్టారు. ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై దక్షిణ ధృవం ప్రాంతంలో సాఫ్ట్ ల్యాండింగ్ చేయడానికి శాస్త్రవేత్తలు కసరత్తు చేస్తున్నారు.