నిరసనలు హింసాత్మకం.. 19మంది మృతి.. 1,113 మంది అరెస్ట్‌

  • Publish Date - December 27, 2019 / 07:21 AM IST

దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు నిరసన సంధర్భంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధికంగా 19 మంది చనిపోగా, వెయ్యి మందికి పైగా అల్లర్ల కేసుల్లో అరెస్ట్‌ అయ్యారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వమే వెల్లడించింది. 

ఇవాళ(27 డిసెంబర్ 2019) రాష్ట్రంలో ముస్లింల శుక్రవారం పార్థనలు జరుగుతుండగా.. అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. హింసాత్మక ఘటనలను నియంత్రించేందుకు ప్రయత్నాలు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు భద్రతా బలగాలు ఫ్లాగ్‌మార్చ్‌ చేశాయి. ఇంటర్నెట్ సేవలను కూడా చాలా ప్రదేశాల్లో నిలిపివేశారు. 

మరోవైపు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన హింసలో ఇప్పటివరకు 19 మంది చనిపోయారని, పౌర చట్టాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనల్లో 288 మంది పోలీసులు గాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లతో సంబంధం ఉందనే ఆరోపణలలతో 1,113 మందిని అరెస్ట్‌ చేశారు. 327 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. 5,558మందిని ముందస్తు అరెస్ట్‌లు చేశారు.